అరుణ ధూళిపాళ కవిత : మేలుకోవాలి ఇక!
శూన్యమైన ప్రపంచాన్ని చూసి బిగ్గరగా రోదించే కాలం రాకమునుపే మనిషివై మేలుకో...!! అంటూ అరుణ ధూళిపాళ రాసిన కవిత ' మేలుకోవాలి ఇక! ' ఇక్కడ చదవండి :
ఎక్కడా అంతం లేని ఆరంభం ఒకటి
నిశ్శబ్ద పరదాలను నిలువున చీల్చుకొని
ఎన్నో ప్రమాణాల ఆదర్శంగా
శబ్ద ప్రపంచపు చైతన్య వాహినిగా
సాగింది ఉరకల ఒరవడితో...
ఎక్కడ మొదలయిందో..?
మనుషులకే తెలియని
మనో రహస్య కుహరాలు తెరిచి
జ్ఞాన నాడులను కదిలించి
రంగరించి పోసింది విజ్ఞాన గుళికల్ని
వేరు పడతోసింది
మనిషిని జీవులనుండి...
కానీ....
మాయా లోకపు కనికట్టు మోహంలో
స్వార్థాన్ని ఒంటినిండా తొడుక్కుని
హద్దులు లేని అహంకారాన్ని
నరాల్లో కెక్కించుకొని
నీకు దూరంగా జరిగిపోతున్న
సమయాన్ని మరచి,
చేస్తున్న అస్థిమిత జీవన యానం..
మనసులకు నడుమ
మనిషిగా అస్తిత్వాన్ని కోల్పోతే
రెండోసారి అలుముకున్న నిశ్శబ్దం
వెక్కిరిస్తుంది నిన్ను..
శూన్యమైన ప్రపంచాన్ని చూసి
బిగ్గరగా రోదించే కాలం రాకమునుపే
మనిషివై మేలుకో...!!