Asianet News TeluguAsianet News Telugu

గోపగాని రవీందర్ కవిత : సవాళ్ల పద్మవ్యూహం..!

అంతా నేననే అహంతో చెలరేగిపోతున్న వాళ్ల తీరుపై చర్నాకోలాను ఝులిపించాల్సిందే..! అంటూ  గోపగాని రవీందర్ రాసిన కవిత " సవాళ్ల పద్మవ్యూహం..! " ఇక్కడ చదవండి : 

Telugu Poem Writtem by Gopagani Ravinder
Author
First Published Sep 27, 2022, 10:20 AM IST

ప్రశ్నల జడవానలో
తడవడమెంతో ఇష్టమైనదే 
ఎదుగుతున్న తరాల్లో 
నశించి పోతున్న ఓర్పును గూర్చే
నా దుఃఖమంతా
ఫలవంతమయ్యే జీవితాల కోసం 
కార్యోన్ముఖులమై సాగాల్సిందే..!

స్నేహ మాధుర్యాన్ని
జుర్రు కోవల్సిన వయసులో
శిఖరాయమైన ఆశయాలను
సాధించుకోవల్సిన తరుణంలో 
అంతా నేననే అహంతో 
చెలరేగిపోతున్న వాళ్ల తీరుపై 
చర్నాకోలాను ఝులిపించాల్సిందే..!

ప్రేమ పుష్పాల వంటి
నవ్వులు వికసించాల్సిన చోట
ద్వేషపు బీజాలు మొలకెత్తుతున్నాయి
రాబోయే రోజులెంత భీకరమో 
కొంచెం బుజ్జగించైన
కొంచెం లాలించైన 
కొంచెం మందలించైన సరే 
అచరణకై అడుగులు వేయాల్సిందే..!

మొగ్గలు విచ్చుకోకుండానే
రాలిపోవడమెంత 
ఆందోళనకరమైనదో కదా 
పరిపరి విధాలైన ఆలోచనలతో 
నిరాశ దుప్పటి నిలువెల్లా 
చుట్టుకుంటున్నది దర్జాగా 
అయినా కానీ 
సవాళ్ల పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందే..!
 

Follow Us:
Download App:
  • android
  • ios