చెట్టు చిగురించడాన్ని వదులుకోనట్లుగానే నూతనోత్సాహ ఉషస్సులకు హారతినిద్దాం..!  అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత  "  ఉషస్సులకు  హారతి " ఇక్కడ చదవండి :  

చీకట్ల ముసుగును చీల్చుకోని 
వేకువ కిరణాలు విచ్చుకుంటున్నాయి
అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న
మనస్సు ద్వారాల్లోకి జ్ఞానపు కాంతులు
వడివడిగా అడుగులు వేసున్నాయి..!

కాల వాహనంలో మనమంతా
నిత్యం పయనించే ప్రయాణికులమే
అనుకున్న గమ్యాలను చేరేవరకు
అడ్డంకులను తొలగించుకుంటూనే
కార్యోన్ముకులమై సాగుతుండాలి..!

అనుభవాలన్ని ఒక్కొక్కసారి
ఆనందదాయకము కావచ్చు
విషాదకరము కావచ్చు, ఏమైన కానీ 
జీవితమంటేనే భావజాల సంఘర్షణల
పరస్పర ఆలోచనల జలపాతాలు...!

ఏదీ శాశ్వతం కాదని తెలిసినా 
ఇక్కట్లను ధైర్యంగాఎదుర్కొంటూనే
చీవాట్ల, చీదరింపుల దుప్పటిని
కుబుసంలా విడుస్తూనే 
పదునైన చర్యలతో రాటుదేలాలి..!

అకాల రోడ్డు ప్రమాదాల మరణాలతో
క్షణికావేషాల ఆత్మహత్యలతో
ఉద్దేశపూరితమైన హత్యలతో
అతలాకుతలమవుతున్న కుటుంబాలకు 
చేయూతనిచ్చే భరోసాలే కావాలేప్పుడూ..!

విత్తు మొలకెత్తడాన్ని మరువనట్లుగానే
చెట్టు చిగురించడాన్ని వదులుకోనట్లుగానే
నది ప్రవాహాన్ని ఆహ్వానించినట్లుగానే
భూమి వర్షపు చినుకుల్ని పిలిచినట్లుగానే
నూతనోత్సాహ ఉషస్సులకు హారతినిద్దాం..!