వారాల ఆనంద్ కవిత : పులి జూదం
ఏముందిక అభివృద్ధి కొలతల్లో ఎకరాలు గజాలయి పోయాయి అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత ' పులి జూదం ' ఇక్కడ చదవండి :
పచ్చదనానికీ పిచ్చుక గూళ్లకే కాదు
వూపిరికీ నీడకూ నెలవయిన
ఆకుపచ్చని చెట్లు అదృశ్యమయిపోయాయి
గుక్కెడు నీళ్ళకూ పిడికెడు తిండికీ మూలమయిన
తల్లి లాంటి భూములు
ఎండి ఎడార్లయి బీడువడ్డాయి
ఆకాశంలో చిట్ట చివరి మేఘం
కదిలి వెళ్ళిపోయింది
రెక్కలు జాపి పెద్ద కళ్ళేసుకున్న
‘డేగ’ పైన షికారు కొడుతోంది
గుట్టలన్నీ అట్టముక్కలయి
పేకమేడల్లా కూలిపోయాయి
‘పున్జీతం’ ఆటలో పులి దెబ్బకు
మేకలు అల్లల్లాడి పోయాయి
కొన్ని సమాధుల్నీ మరికొన్ని వలసల్నీ
నమ్ముకున్నాయి
రెక్కలుడిగినవి తట్టనో బుట్టనో తల కెత్తుకున్నాయి
ఏముందిక
అభివృద్ధి కొలతల్లో
ఎకరాలు గజాలయి పోయాయి
‘నాలుగు పాదాల’పై నిలబడ్డ
బల్ల చుట్టూ కూర్చున్న ఆ నలుగురు
మహానగర రూపానికి పునాదులు తీస్తున్నారు
అరచేతిలో ‘వైకుంఠధామాన్ని’ చూపిస్తున్నారు