దేహమంతా పొక్కిలై నెర్రలు బారింది - దాహమైన గొంతును ఎడారి పలకరించింది అంటూ నల్లగొండ నుండి ప్రమోద్ ఆవంచ రాసిన కవిత ' పొక్కిలి.... ' ఇక్కడ చదవండి : 

గలమ చూరుకి చూపులు ఎగరేసిన 
కలల చప్పుడు గుండె వాకిలిని పొక్కిలి చేసింది
కంటికి కునుకు లేదు 
తల బద్దలై ముఖం కళ తప్పింది 
నూతిలోనుంచి కప్పల గోల మొదలైంది
నీళ్ళ నుంచి బయట పడ్డ చేపలా
గిలగిలా కొట్టుకుంది జ్ఞాపకం 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దేహమంతా పొక్కిలై నెర్రలు బారింది
దాహమైన గొంతును ఎడారి పలకరించింది
ప్రేమను వెతుక్కుంటూ గుండె గదంతా తిరిగాను 
చీకట్లో శూన్యాన్ని తన్నుకుంటూ కొలిచాను 
కళ్ళల్లో మెరిసిన జ్ఞాపకాలు 
మనసుకు అయిన గాయంగా ఎరుపెక్కాయి 

వియోగ గాయాలతో కన్నీళ్లు చిక్కబడ్డాయి
ఆలోచనలు కలహించుకుంటున్నాయి
రైళ్లు అతి వేగంగా పట్టాలు తప్పుతున్నాయి
లోతుల్లో ఉన్న ప్రేమ ప్రవాహం పరుగులు పెడుతుంది 

గుండెల్లో ప్రేమ కన్నీటి చెలమతో నిండింది 
తడి లేని కళ్ళు నిప్పు కొలిమిలా మండుతున్నాయి
యవ్వనపు పరిమళం క్షణాల్లో ఆహుతై 
కాల గర్భంలో కలిసిపోయింది