Asianet News TeluguAsianet News Telugu

వారాల ఆనంద్ కవిత : నేనూ- నా ఇల్లూ

నేనేమో నా ఇంట్లోనే పరాయితనాన్ని చాపలా పరుచుకుని భయం భయంగా నక్కి నక్కి కాల్రెక్కలు ముడుచుకుని కూర్చున్నా అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత  "నేనూ- నా ఇల్లూ " ఇక్కడ చదవండి : 
 

Telugu poem Nenu naa illu Written by Vaarala Anand
Author
First Published Jan 22, 2023, 10:15 AM IST

ఇంటి ముందు వాకిలి లేదు 
వెనకాల పెరడూ లేదు 
నాలుగు గోడల నడుమ స్థలానికి 
పునాదుల్లేవు 
తలెత్తి చూస్తే పై కప్పూ నాది కాదు 

దేనికీ ఎలాంటి హామీ లేదు 

ఇంట్లో గాలి ఆడదు 
అంతా వై ఫై పరుచుకుని వుంటుంది 

అందరూ ఎవరి గదుల్లో వాళ్ళుంటారు  
ఆశలు తిరుగుతూ వుంటాయి  
కోరికలు కేరింతలు కొడుతూ వుంటాయి 

అందరి నడుమా 
మౌనం వేలాడుతూ వుంటుంది
గోడలకు మాటలు ఉరి పోసుకుంటాయి 

అలారం మోతల్లాగా 
సెల్లులు మోగుతూ వుంటాయి  

వాట్స్ అప్ పలకరింపులూ 
ఇన్ స్టాగ్రామ్ పోస్టులు మెరుస్తూ వుంటాయి  
యు ట్యూబులూ, ఓ టి టి లు నాట్యమాడుతూనే వుంటాయి  

‘నగరం’ నా ఇంట్లోకి చొచ్చుకొచ్చింది  
వస్తూ వస్తూ 
ప్రపంచాన్ని తన పిడికిట్లో బిగించి 
నట్టింట్లో కుప్ప బోసింది 

నేనేమో నా ఇంట్లోనే 
పరాయితనాన్ని చాపలా పరుచుకుని 
భయం భయంగా నక్కి నక్కి 
ఓ మూలన  
కాల్రెక్కలు ముడుచుకుని కూర్చున్నా

Follow Us:
Download App:
  • android
  • ios