ఒబ్బిని కవిత : నేలతల్లి కూలీలు
జగమంతా నిత్య భారతమౌతుంది వర్ణమాలలో యుద్ధాక్షరాలే కనబడుతున్నాయి ! అంటూ ఒబ్బిని రాసిన కవిత ' నేలతల్లి కూలీలు ' ఇక్కడ చదవండి :
బుల్డోజర్లతో ఇళ్ళు కూల్చుతున్నట్లు
మానవ కంకాళాలని విరిచి పోగులు పెడుతున్నారు !
మాటలు అమృతపు జల్లులా కురవడం లేదు
గడ్డి బుంగలని దొంగతనం చేస్తున్నట్లు
మేఘాల రాశులని మూట కట్టి భుజాన మోసుకెళ్తున్నారు !
కాలం క్షణాలన్నీ
కంస శ్వాసలతో నిండిపోతున్నాయి !
పుట్టుకలన్నీ పోరాడుతున్నాయి
కనీసం సొంత పేర్లైనా మిగుల్చుకోవాలని !
రంపాలూ , గునపాలూ
క్రీనీడల విన్యాసాలు సాగిస్తున్నాయి !
పాడీ పంటా కృషి జరగడం లేదు
కొమ్ములని సానబెట్టి
కక్షా శిక్షణాలయాలు నిర్మిస్తున్నారు !
ఆరోగ్య వాహిని మాటను మూట కట్టడం లేదు
అమ్మకాల బాటలో నడుస్తూ
నిమ్మళం కోల్పోతున్నారు !
జగమంతా నిత్య భారతమౌతుంది
వర్ణమాలలో యుద్ధాక్షరాలే కనబడుతున్నాయి !
సత్యవ్రతం చూచాయగానైనా దర్శనమివ్వడం లేదు !
లోహ కవచాలు లోక కవచాలు కావడం లేదు !
ఈ నేల ఓ చెలమ , ఓ ఖని , ఓ వాణి , ఓ వని !
దళారుల్లా కాకుండా
దర్జా దర్పాలు వెలగబెట్టకుండా
నేలతల్లి కూలీలము అవ్వాలి మనం !