ఒబ్బిని కవిత : నీటిపటం

దడుల జీవితాల మీద సాగే దండయాత్రల మీద దండి యాత్రలు సాగాలి ! అంటూ ఒబ్బిని రాసిన కవిత  నీటిపటం ఇక్కడ చదవండి :
 

Telugu poem neetipatam written by obbini

బురద రంగు పులుముకుంది నీటిపటం
గోదారిలో కరిగిపోతున్నాయి గోడలన్నీ !
పైకి తేలుతున్నాయి పురాతన శిధిలాలు !
అమ్మపాలన అంతరించి
అయ్యపాలన వచ్చినట్లు
దారి దారినా దండయాత్రల దండలే విరబూసినట్లు
శిలాఫలకాలు చెబుతున్నాయి !
పుష్పించే చెట్లు
అమ్మపాలనకి ఆనవాళ్ళు !
పూలూ ఫలాలూ లేని చెట్లు
అయ్యపాలనకి గుర్తులు-
కరుణాక్షరాలు క్రూరాయుధాలుగా మారిపోయాయి !
సత్యాన్ని ఎగజిమ్మీ , సత్తువ నింపే
కాలానికో కవి, నాలుకకో కవి !
ఆనాడో కవి వీరుడు
నల్లని బొగ్గు ముక్కలతో
చెరసాల తెల్లని గోడలని అక్షరమయం చేశాడు!
నేడు బడిశాల గోడల మీద
నల్ల బోర్డులు కరువయ్యాయి
తెల్లని తెలుగక్షరాలు రాయడానికి !

నీటి ప్రవాహంలో
నీతి ముఖాలు కనిపించడం లేదు !
విపత్తుల మతులు తేలుతున్నాయి !
చదువుల ఫలితాల
సంబరాల పలుకులకీ
వరద విపత్తార్తుల గొంతు వాక్కులకీ
లంకె కుదరడం లేదు, పొత్తు కుదరడం లేదు !
నీటి పటం
బురద రంగు పులుముకుంది !
గోడలన్నీ గోదారిలో కరిగిపోతున్నాయి !
కాటుక కరిగిపోతుంది  కన్నీళ్ళకి !
మల్లెల్లాంటి ఓనమాలతో
జడలు పరిమళించాలి!
దడుల జీవితాల మీద సాగే దండయాత్రల మీద
దండి యాత్రలు సాగాలి !
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios