కందాళై రాఘవాచార్య కవిత : మెతుకు సీమ . . .

అసలు మన కడుపంతా మెతుకు సీమే! అంటూ కందాళై రాఘవాచార్య రాసిన కవిత  ' మెతుకు సీమ . . . ' ఇక్కడ చదవండి : 

Telugu Poem Metuku Seema written by Raghavacharya

మెతుకంటే బతుకు కదా
మెతుకు మెతుకు కలిస్తే  
సామూహికంగా పెద్ద గిన్నెడు అన్నం
మెతుకు మెతుకు మీద అందరి పేర్లు!

విందు భోజనాల్లో
అందరు పారేసిన ఖరీదైన ఎంగిల్లను  చూసి
దేవతలూ బాధ పడతారు
కాకుల కుక్కల రూపాలు దాల్చి ప్రీతిగా తినేస్తుంటారు 
ముక్కలైన జిలేబీలు 
లడ్డూల కోసం కోట్లాడుతారు 
కావ్ కావ్ భౌ భౌ !

ఒక్క పూట తినకండి 
మెతుకు ఫవర్ ప్లాంట్ అని తెలుస్తుంది !

ఒక్కొక్క బియ్యం గింజ ఉడుకుతూ ఉడుకుతూ
జనం ఆకలిని తీర్చాలని
ఆనంద తాండవం చేసి మెతుకులౌతాయి
ఎన్నెన్ని చెమట చుక్కలో అన్నన్నీ మెతుకులు 
వాకిట్లో చేయి విదిల్చిన మెతుకులను తింటూ
పిట్టలు ఉగాది పండగ, రంజాన్ పండగ,
క్రిస్మస్ పండగ చేసుకుంటాయి

ఒక్కోసారి తినడానికి ఏమి దొరక్కపోతే   
మెతుకు విలువ ఎవరూ చెప్పకున్నా తెలుస్తుంది
తల్లడిల్లి తల్లడిల్లి నిజంగా 
అన్నమో రామచంద్రా ! అని గొంతెత్తి 
భూమి పుత్రుడిని స్మరించుకోవాల్సిందే

అసలు మన కడుపంతా 
మెతుకు సీమే!

            

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios