నిజాని మనకు ఏ దేవుడు లేడు ఆయనే మన నిజమైన దేవుడు అంటూ నాగర్ కర్నూల్ నుండి అవనిశ్రీ రాసిన కవిత ' మన దేవుడు ' ఇక్కడ చదవండి :  

ఓ మహాశయా
నీకు ఆ మహాతల్లి 
పురుడుబోయకపోయింటే
ఈనాడు మేమంత 
ఈ నేలమీద
నిలబడకపోతుంటిమి..

నిజం చెప్పాలంటే
పుట్టిపుట్టగానే అగ్గి మండినట్లు
దొరవారి పొయ్యిలల్ల కట్టెలకు బదులు 
మా శరీరాలు కాలుతుండేవి.

నీవే జన్మించకపోయింటే
అగ్రకులస్తులు
కింది కులాలను 
మనుష్యులుగా కాక
సంతలో పశువులుగా కిలోలలెక్కన తూకమేసి అమ్ముతుండేవారు.

ముడ్డికి తాటాకులు
మూతికి ముంతలు అట్లనే ఉండి
చదువుకుంటే నాలుకలను కోసి
ప్రశ్నిస్తే గుండెలపై గడ్డపారలను దించి
ఊరికి దూరంగా వెలివేసి
అంటరానితనం 
ఆకాశమంత ఎత్తులో రెపరెపలాడిస్తుండేవారు.

ఒకవేళ అంబేడ్కరే
ఈ నేలమీద నడయాడకుంటే
ఆధిపత్య పైత్యమున్న ప్రతి ఒక్కడు 
మన జాతులను
చెప్పులు తొడిగిన పాపానికి
కాళ్లకు మొనదేలిన సూదులతో పొడిసేవారు.

అంబేడ్కరే రాకపోయింటే
ఈ భూస్వాములు
బువ్వతిన్న 
నీళ్ళు తాగినా 
చివరికి ఊపిరి పీల్చుకున్న
పాతసెప్పుల దండలేసి ఊరంత తిప్పి
రచ్చకట్టలమీద స్తంభాలకు కట్టేసి 
ఈతబర్రెలతో కొట్టేవారు.

మీరే రానట్లువుంటేనా
మన జాతులు కట్టు బానిసలుగా 
వాళ్ల కొంపలకాడా చేతులు కట్టుకొని నిలబడేవారు.

మనవారికి ఏ పదవులు కొలువులు ఉండక
తొర్రి గుడిసెలసాటున నిలువ నీడలేనికాడ
చెప్పులు కుడుతూ
బట్టలుతుకుతూ
వేటాడుతూ
రాళ్ళు కొడుతూ
అగ్రవర్ణాల కాలికింద నీచాతీ నీచంగా బత్కుతుండేవారు.

మీరొచ్చినందుకే
మన జాతుల మఖాలు తెల్లగా
మన ప్రజల బత్కులు సల్లగా 
మన భవిష్యత్తు మొత్తానికి పండగా 
నిజాని మనకు ఏ దేవుడు లేడు
ఆయనే మన నిజమైన దేవుడు.