డా॥ కొండపల్లి నీహారిణి కవిత : మాటల నిప్పులు

మాట మసిచేసే శక్తి మనుషుల నడుమ తచ్చాడుతే నిప్పులేకుండా మాటలు మంటలనే పుట్టిస్తాయి అంటూ డా॥ కొండపల్లి నీహారిణి రాసిన కవిత  " మాటల నిప్పులు " ఇక్కడ చదవండి : 

Telugu Poem Maatala Nippulu written by Kondapalli Niharika

వాచ్యాగ్ని అంటుకున్న నాలుక
కాల్చే సందర్భం చెవులకు సంచులు కట్టి 
కర్ణపేయం నుండి కఠోరానికి దారయ్యి 
మనల్నో ఆలోచనాడవి పాలచేసి
లోచనాలు తడిపేస్తుంటవి 
గుండె గుండెకో ప్రశ్న సంధించి
మనిషి ప్రకృతికి మరో వేట అవుతుంటవి
ఏవి నీలోని చీకట్లను పోగొట్టవో 
ఏవి నీలోని చెలిమి సువాసనలు వెదజల్లవో 
త్యజించని లోభ ముద్రను 
తరాజు వస్తువులుగ చేస్తుంది
ఈ తూకాలలో బాటువు నీవయ్యి
పొరబాటువూ నీవయ్యి
దారి మరచిన జగతిని నీది చేస్తుంది
కొడగట్టిన దీపంలా
చమురుపాల్జేసి అభాండాలన్నీ 
నీ మరుపు భాండాగారం లో వేస్తుంది
ఎందుకంటే ...
ఎందుకంటే 
తప్పుల తక్కెడ కథలో 
తప్పించుకోలేని ప్రధాన పాత్ర నీవైనప్పుడు
వేరుపురుగు సామెతలో 
వృక్షానివీ బీజానివీ నీవేనన్న 
మాట మసిచేసే శకైతే మనుషుల నడుమ తచ్చాడే  కనిపించని దుర్మార్గం దృశ్యం తాలూకు వాసనవేస్తున్నప్పుడు
నిప్పులేకుండా 
మాటలు మంటలనే పుట్టిస్తాయి
అడ్డుగోడలు అపనమ్మకాలు
అంతో ఇంతో ఎగదోస్తుంటాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios