సరికొత్త రాగమై... మది మదిలో ప్రతిధ్వనించడానికి త్వర త్వరగా సమాయుత్తమవుతోంది!!!  ఆ సమాయత్తమయ్యే రాగమేదో విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవితలో చదవండి :  

వాలిన పిట్ట బరువుకు వంగి
ఉలిక్కిపడ్డ ఉమ్మెత్త కొమ్మ నిశ్శబ్దనేత్రం 
ఉవ్విళ్లూరి ఉత్సుకతని పూని 
రెప్పలల్లార్చి రాత్రి పేర్చిన మంచు బొట్లను 
ఇంపుగా 'కెంపు' ల్లా విదిల్చి 
మెత్తగా మగతుగా కన్ను విప్పింది!

మూతి కంటిన మొదటి క్షీరఫేనం 
సావిట్లో మధుర గానంగా అభంగాలుగా* సాగి 
శుభంగా మదిలో సావకాశంగా గుబాళించి 
తొలిపొద్దు చినుకు దోసిట చిన్ని సూర్యుడై 
గుడి మాడవీధి గోసాయి బొట్టై 
'గోమేధిక'మై ప్రతిఫలించింది!

రోజు బరువును తగిలించుకున్న 
కాలం భుజాల మీదికి 
అవిభక్త కవలల్లాంటి క్షణాలు కమ్ముకుంటే 
జంట 'పగడం' దీవులు జగడం మాని విచ్చుకుని
సంగతులు సర్ది చెప్పి చెప్పి మురిసి 
వాకిట్లో ముగ్గులోకి 'ముత్యాలు' విసిరి వేసాయి!

ఊరేగడానికి ఏ ఊరికెళ్లాలో తెలియక 
తొట్టతొలుత తెల్లబోయిన తల్లి ఆకాశం
తొట్టి ఊయల ఊసులన్నీ తన బిడ్డలవేనని
'వైఢూర్యపు' సాంధ్యదీప విడ్డూరపు సాంగత్యంలో 
కుశలమడిగి కుదుట బడి తేరుకుని
ఉల్కాపాతాల 'వజ్ర' ఘాతాల నొప్పి నుంచి 
ఉఫ్ మని కొండగాలి ఊది ఊరట కల్గించింది!

సరిగమలతో శిశువుకు స్తన్యమిస్తున్నప్పుడు 
హృదయపంజర సూత్రాల హృద్య సౌమ్యనాదం 
రాత్రి కల్మషాన్ని కన్నుల 'నీలం'లో 
ఆర్తితో కడిగేసి ఆరబోసి
వెచ్చటి కలల 'పచ్చ' దోమతెర కట్టు విప్పేసి 
ధాత్రి నిండా పొగమంచులా కప్పి పరిపించింది!

అలా.. అలా..అలా.. 
అంతటి దూరమూ అరిగి అల్పమై...
కొంచెం కొంచెం కరిగి దుఃఖం స్వల్పమై...
పరపరాగం స్వపరాగమై సరాగమై...
కినుక లేని 'కనకపుష్యరాగ'మై... 
సరికొత్త రాగమై... 
మది మదిలో ప్రతిధ్వనించడానికి 
త్వర త్వరగా సమాయుత్తమవుతోంది!!!

 అభంగాలు - శ్రీ పాండురంగడి మీద మరాఠీ దైవ సంకీర్తనలు.