గురిజాల రామశేషయ్య కవిత : కోయిల మాట
నా పురివిప్పే స్వర సుసంగతులను కొలవలేరు అంటూ గురిజాల రామశేషయ్య రాసిన కవిత ' కోయిల మాట ' ఇక్కడ చదవండి :
నేను కోయిలను
కోరినంత పెరుగుతుంది నా గొంతు
ఇలలో నా స్వరం కిలకిల రావం
నా కూజితం వసంతామ్ర రుచిరం
ఆకుల పువ్వుల కొమ్మల నుండి నా ప్రసారం
మీకెంతో ప్రమోదం
మీరంటారు చైత్ర జైత్ర స్వరం నాదని!
నేను నలుపని నా స్వరం మెరుపు అని మీకు తెలుసు
మామిడి చిగురుల ఉత్తేజ శోభా ధనమే ఇది
నా కూహు కుహూ రావాలు విని
మీరు బదులు పలుకుతుంటారు కదూ!
నేను మిమ్మల్ని కనిపెడుతూనే
కనిపించకుండానే బదులిస్తుంటాను
చీకటి అంతరంగము తెలుసు
వెలుతురులోనే నా స్వర సంగతంతా!
ఇదంతా నా అంతరంగ
విశ్వాస తరంగ ధైర్ఘ్యం
నా పురివిప్పే స్వర సుసంగతులను కొలవలేరు
రంగుల వెనక దాగిన భావ పరంపర
పొంగినా కృంగినా బతుకు సంగతులే!
నా స్వర సౌందర్యం మీ జీవిత సన్నిహితం
సలలిత రాగ సరాగ పంచమ హిందోళనం
ఆనందాలు ఆందోళనలు
మీకు డోలికల తూలికల తారాటలు ఆరాటాలు
మీలో ఎన్ని యుద్ధాలు?
తెరలెత్తుకున్న మోహజీవులు వ్యర్థ జ్ఞానులు!
నాది మోహనరాగ స్వరం
మీకు మీరే వర్ణవర్గ భేదాలు ఖేదాలు
షట్ రుచుల శకలిత మనస్క ఇంద్రధనువులు
ఏ ప్రకృతి ఇంతటి వికృతి కాదు
మోహ బోధిని కాదు
మీరు ఎప్పుడైతే అతి మొహాన్ని తగ్గించుకుంటారో
మేము
కొండ కోనలు పంట భూములు
ఎండ వానలు నది సంద్రాలు
వనాంతర సీమలు పశుపక్ష్యాదులు
కుసుమాంజలితో మీ ముందు మోకరిల్లుతాం!
రసాత్మీయ కావ్య నిధులుగా!
మీరేపటి భవితవ్యంగా!
యశసే అర్థకృతే అంటూ
అర్థకృతే వ్యవహార విధే అంటూ
ఇక అంతా మంగళకరమే!!
నేను మీ అనురాగాన్ని పొందే పిక రాగాన్ని!!!