అబద్ధపు రేఖ మీద రాసిన వ్యాకరణం  ఇష్టం అంటూ కరీంనగర్ నుండి కె ఎస్ అనంతాచార్య రాసిన కవిత  ' ఇష్టం !! ' ఇక్కడ చదవండి :  

నిర్వచనం ఇవ్వలేని 
వస్తుగతం కానీ
విలువైన బహుమతి!

మనసు పెరట్లో మొలచిన
మందారం
దేహం చుట్టూ అల్లుకున్న 
సన్నజాజి తీగ!

తరగని 
హిమాలయల శీతల పవన మేఘం
కురిపించే నిర్విరామ 
స్వాతి చినుకు!

పెంచుకున్న యశోద
హృదయం
ఆరవ ఇంద్రియమై
మెదడు నట్టింట్లో సందడి!

ప్రభావానికి గురయ్యే 
ఎలక్ట్రాన్
చిత్రకారుడి కుంచె మీద మొలచిన
జానపద మంచె సోయగం!

కాలరీతిలో సాగుతూ
నీటి అవసరం లేక
పెరిగే పాదు
బంధం మీద గుభాలించే
హరిచందనం!

డార్విన్ కు
అందని పుట్టుక గుట్టు
ఎరువులు లేక పెరిగిన పజ్జొన్న కంకి!

చేతులమీద పాణని పెట్టుకొన్న వాత
అబద్ధపు రేఖ మీద రాసిన
వ్యాకరణం
ఇష్టం

ఎంతటి ఉపద్రవం వచ్చినా
ఎదురించలేని
మౌన శబ్ద పల్లవం
అభిమానంతో
స్వీకరించిన 
గుభాళించే ప్రేమ విడియం
ఇష్టం!

 ప్యార్, మోహబ్బత్,ఇష్క్
ఈ చెట్టు శాఖలే
రూకలకు లొంగని
స్వతoత్ర జండాలే !!