గీతాంజలి అనువాద కవిత : స్పర్శ

మీనా కందసామి " Touch " కవితను గీతాంజలి తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసిన కవిత "  స్పర్శ " ను ఇక్కడ చదవండి : 

telugu poem geetanjali

మీరెప్పుడైనా ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నించారా ?
కళ్ళు, ముక్కూ మూసుకొని ఏకాగ్రత కోసం కష్టపడ్డారా?
పుట్టుకొచ్చే ప్రతీ ఆలోచనను మూసేసి,
మీ మనసుని తెల్లటి గోడ లాగా ఖాళీగా ఉంచగలిగారా?
ప్రతీ వస్తు గత విషయాన్ని ఏమైనా  ఆపగలిగారా ? అయితే మీరు అనుభవించిన ఏకైక వైఫల్యం, ద్రోహం ఏంటో.. ఎక్కడి నుంచో మీకేమైనా తెలుసా... ఆ విశ్వాశఘాతం మీ స్వంత చర్మం నుంచే అన్న విషయం మీకు తెలీకుండా ఉంటుందా?
◆ ◆ ◆ 
నీ మొదటి ధ్యానం ఎలా భంగమైందో ... దానికి నువ్వెలా నీ స్వంత చర్మాన్నే పాపిగా నిలబెట్టావో  నీకింకా ఏమైనా గుర్తుందా?
పోనీ ధ్యానంలో నీ కుండలిని నిద్ర లేచి పైపైకి ఎగబాకి నిన్ను వణికించినప్పుడు ,
నువ్వు కూర్చున్న కాంక్రీటు నేల శీతల స్పర్శ ..
నీ చర్మానికి, నీ కుంకుమ పూల వస్రాలకి రాపిడి కలిగించినప్పుడు,
నీకు పరిచయమే లేని ఆధ్యాత్మిక లోకంలో కూడా..
అంతటా వ్యాపించిన శూన్యతమధ్య కూడా... స్పర్శ నీ ఇంద్రియాల శక్తిని ఎలా బలంగా నిలుపుకుందో ...ఈ భూమితో నిన్ను ఎలా బంధించి ఉంచిందో నీకు తెలిసే ఉంటుంది.
స్పర్శ నీలోని కోరికలను ఎలా సజీవంగా ఉంచిందో నీకు తెలియదా..?
లేదా నువ్వు రుచి అనే ఇంద్రియాన్ని గురించి కొంచెం భిన్నంగా ఆలోచిస్తే మటుకు
నాలుకకు తగిలే అత్యంత మామూలు విషయంలాగా ,
ఇదీ నీ చేతుల్లోంచి జారి పోతుంది.
అత్యద్భుతమైన స్పర్శ  విలువని..
గౌరవాన్ని కూడా తగ్గించేస్తావు.
పోనీ ఒక్క సారి జ్ఞాపకం చేసుకో...  
ఎలా ఒక కోమలమైన ..ప్రేమ.. లాలనతో కూడిన 
మానవ స్పర్శ నిరాశతో ..విషాదాలతో మునిగిన 
నీ జీవితాన్ని ఆశావహంగా   మార్చేసిందో..?
నీకు జ్ఞాపకం వచ్చిందా?
ఈ ఎరుక కలిగినప్పుడు అసలు నువ్వెప్పటికీ కావాల్సిన పాత మనిషివి కాలేవు.
★★★★★
అంతెందుకు ?
నవజాత శిశువు తొలి అనుభూతి మానవ చర్మపు స్పర్శనే కదా..                     
సమస్త ఇంద్రియాల్లోకీ స్పర్శే  ప్రాథమికమైంది కదా
ఆ స్పర్శ నీకెలా దూరం అయింది..ఆలోచించావా?
ఈ వాస్తవం ఎప్పటికీ నీ తోనే ఉంటుంది
ఈ స్పృహ నుంచి నువ్వెప్పటికీ  బయట పడలేవు
ఇది కూడా నీకు తెలిసే ఉంటుంది
నీకు తెలిసిన ప్రతీ విషయం ..నీ ఎరుకలోకి  వచ్చే ఉంటుంది
నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే ఉంటావు.
★★★★★
ఇక స్పర్శకు చెందిన ఆకర్షణలు, కోరికలు కూడా 
నీ అనుభూతిలోకి వచ్చే ఉంటాయి
స్పర్శించే వారు ఆకర్షించడమే కాదు , 
ప్రలోభ పెడతారు కూడా! 
కానీ, కానీ అసలు నీకు తెలియాల్సింది ఏంటంటే,
నీకు ఎన్నటికీ తెలీని స్పర్శ ఒకటి ఉంది అని             అవును..ఆ స్పర్శని,           
ఆ ప్రత్యేకమైన స్పర్శని ఎప్పటికీ తెలుసుకోలేవు
ఆ స్పర్శ ..                                
నీ అతీతత్వానికి..అస్థిత్వానికీ నిషిద్ధం !
అదేంటంటే
కులవ్యవస్థలో ఘనీభవించబడిన ద్వేషంతో  కూడిన స్పర్శ 
లేదా..  స్పర్శించడానికి నువ్వు అనర్హురాలివని చెప్పే ద్వేషపు స్పర్శ  !
అమానవీయ స్పర్శ !
ఆ స్పర్శ ఉంది చూడూ...
అది ఎందుకు పుట్టిందో తెలుసుకోవలసి ఉంది..!
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios