రాజేశ్వరరావు లేదాళ్ళ కవిత : డిజార్డర్
నిజంగా నేను తలుపు గొళ్ళెం వేసానో ! లేదో? కానీ గుండె గదికి మాత్రం తాళం వేసే ఉంటాను!! అంటూ లక్షెట్టిపేట నుండి రాజేశ్వరరావు లేదాళ్ళ రాసిన కవిత ' డిజార్డర్ ' ఇక్కడ చదవండి .
తలుపు గొళ్ళెం వేశానా లేదా?
రాత్రి నాలుగు మార్లు చూసి నిద్ర పోతాను!
వేసిన తాళాన్ని వేశానో లేదో
పదే పదే లాగి చూస్తాను!
నిన్న చేసిన నిరర్థకమైన
పనిని మాత్రం
తక్షణమే మరిచిపోతాను
ఎవరిపైనో కోపపు కొరడాలు ఝళిపిస్తాను
మరెవరిపైనో సాంత్వన వచనాలు కురిపిస్తాను
కొందరితో కొరకొరగా,
మరి కొందరికి అరకొరగా సమాధానమిస్తాను
నే పొందిన దానికన్నా
పక్కవాడి వాటి కోసం ఉబలాటపడతాను
ఆలోచనల గూడులో నాకు నేనే సాలె పురుగులా తిరుగాడుతుంటాను
వేడుక వెనుక తప్పుల్ని వెదికి వంకరగా నవ్వుతాను
వాడి మీద నూరుపూలు పూస్తున్నాయని
నేనొక రాయిని బలంగా విసురుతాను
వాడి నడక హుందాతనంలో తప్పటడుగులు లెక్కిస్తాను
కాకిని హంసలా పొగడుతుంటాను
హంసను అలవోకగా తీసిపారేస్తాను
పక్కింటి కిటికీలోంచో
ఎదురింటి వాకిట్లోంచో
వెనకింటి వసారాలోంచో
ఎప్పుడైనా దుఃఖం పొర్లకపోతుందా అని
చెవులు చాచి వింటూంటాను
అయినా నిజంగా నేను తలుపు గొళ్ళెం వేసానో!లేదో?
కానీ గుండె గదికి మాత్రం తాళం వేసే ఉంటాను!!