పోతుల ఉమాదేవి కవిత : అమృతభాండం
నేడు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఎన్నో మతముల భిన్న భాషల పూలమాలే భారతం అంటూ హనుమకొండ నుండి పోతుల ఉమాదేవి రాసిన కవిత " అమృతభాండం " ఇక్కడ చదవండి :
వజ్రోత్సవసంబరాలు అంబరాన్ని తాకంగా
భరతకీర్తి బావుటా గగనవీధి నెగురంగా
ఉప్పొంగే మానసముతొ వందనమిడి చేతులెత్తి
జాతి గీతమాలపించె తనూలతలు పులకించగ....
ఉగ్గుపాలతో రంగరించిన దేశభక్తే పొంగగా
గోరుముద్దల గ్రోలినట్టి ఇతిహాస విలువలు నిండగా
ఎన్నో మతముల భిన్న భాషల పూలమాలే భారతం!!
భరతుడేలిన దేశమిదెగా పుణ్య ఋషులకు పీఠమిదెగా
కవులగన్న కావ్యమిదెగా వీరమాతల గర్భమిదెగా
నాల్గు వేదముల సకల శాస్త్రముల పుట్టినిల్లే భారతం!!
మంచుకొండల కోటగోడలు జలధితీరపు కంచెకాపులు
రెప్ప వేయుట మరచినట్టి సైన్యమే మాకండదండలు
త్యాగ గుణము ఐకమత్యపు జీవగడ్డే భారతం!!
దేశ కీర్తిని ఇనుమడించే రాజ్యాంగమె మకుటమవగా
తాజ్ మహలు సౌందర్యం జగతికద్భుత సౌధమేగా
వివిధ నృత్యాలు విలక్షణాహార్య అమృతభాండమె భారతం!!
దేహమంతా సౌభ్రాతృత్వం హృదయమంతా మానవత్వం
మంచితీర్ధపు నదులని లయం అన్నపూర్ణల పల్లెసదనం
గీతబోధలు శౌర్యచరితల సందేశగ్రంథమె భారతం!!
గాలి కూడా గాత్రమివ్వగ నీరు కూడా నాట్యమాడగ
ఏకమయ్యే రాగమెత్తీ జాతిగీతపు కైదండలిడెగా
వివిధ సంస్కృతి సాంప్రదాయపు కల్పతరువే భారతం!!