దేవనపల్లి వీణావాణి తెలుగు కవిత: దూర సంకల్పం

తెలుగు సాహిత్యంలో తెలుుగ కవిత్వం విశిష్టమైంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేవనపల్లి వీణావాణి దూర సంకల్పం అనే కవిత రాశారు. సోషల్ డిస్టాన్స్ పాటించాలని ఆమె కవితాత్మకంగా చెప్పారు.

Telugu Literature: Devanapalli Veenavani Telugu poem

కాసేపు ఉగ్గ బట్టు..

తన సాలెగూట్లోకి లాగడానికి 
వీధులలో
లాలాజలం పోగేస్తున్నది..కరోనా మహమ్మారి
అది 
శవాల గొలుసు కోసం
వెతుకుతున్న లంకెవు
నువ్వే కావచ్చు

నీకు తెలియకుండానే
మృత్యుపాశంలో  పోగువవనున్న 
వేళ ఆత్మీయుల మీద చిలకరించే
ప్రేమ పలుకులు  కూడా విషపు చినుకులే అవుతాయి

రెక్కలొచ్చినా సరే
పట్టు పురుగులా గూటిలోనే దాక్కోవాలిప్పుడు
ప్రమాదం ఊహించి బొంత పురుగు ఉండచుట్టుకున్నట్టు
ముడుచుకునే  తాబేటి దేహంలా , 
నత్తగుళ్ల వ్యూహాన్ని
ప్రపంచం తలకెత్తుకుంటున్నదిప్పుడు

మరో మార్గం ఏదీ లేని చోట
కాసేపు మౌనం వహించు
సామాజిక దూరం పాటించు..

దూరమిప్పుడు అనివార్యం
దూరమిప్పుడు శిరోధార్యం
నీటి నుంచి, గాలి నుంచి
మనిషి నుంచి మనిషికి
వీధినుంచి..బాధ నుంచి
దూరమొకటే  రక్షాబంధనం
ప్రాణం నిలిపే సంకల్ప ఇంధనం

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios