Asianet News TeluguAsianet News Telugu

బిల్ల మహేందర్ తెలుగు కవిత: పంజా

తెలుగు సాహిత్యంలో బిల్ల మహేందర్ తెలుగు కవిగా ప్రఖ్యాతి వహించారు. ఆయన రాసిన పంజా అనే కవితను పాఠకుల కోసం అందిస్తున్నాం.

Telugu Literature: Billa Mahender Telugu poem Panja
Author
Warangal, First Published Jan 23, 2020, 4:34 PM IST

ఓ చిన్నవాడా
నువ్వలానే లోలోన అక్కడే ఉండిపో
నువ్వనుకుంటూ ఉన్నట్టు 
ఇక్కడ ఏమీ బాగాలేదు,ఏదీ విశాలముగానూ లేదు
ఈ మట్టి ఈ గాలి ఈ దేశం 
పదేపదే ఉనికిని ప్రశ్నిస్తూ పంజా విసురుతున్న వేళ
నువ్వక్కడే హాయిగా లోలోన అలానే వెచ్చగా ఉండిపో

కాలాన్ని మోస్తున్న అమ్మకు
పురిటి నొప్పుల భయమేమీ లేదు
ఊపిరిని ఎప్పుడు నిలబెట్టాలో తెలుసు
పొదలమాటున దాగి ఉన్న మృత్యువు నీడ కూడా బాగా తెలుసు
ఓ చిన్నవాడా,
సమయం ఆసన్నమయ్యేవరకు అమ్మతోపాటే వేచి ఉండు
ఆతురతో బయటికి తన్నుక వచ్చావో
పంజా విసిరే దెబ్బకు విలవిలలాడక తప్పదు

అమ్మ కడుపులో 
నువ్వు చెవుల్ని రిక్కరించుకొని విన్న ఆవు-పులి కథలోలాగా 
ఇక్కడేది అంత సులువుగా సుఖాంతం కాదు
నిన్ను నువ్వు ఎన్నిసార్లు రుజువు చేసుకున్నా
నువ్విక్కడ ఏ కులంగానో మతంగానో ఎప్పుడూ విడగొట్టబడుతూనే ఉంటావు
నిత్యం ఈ మట్టిమీద హత్యచేయబడుతూనే ఉంటావు

మరింత సాహిత్యం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Follow Us:
Download App:
  • android
  • ios