తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణకు కృషి చేయండి : తెలంగాణ సాహిత్య అకాడమీకి వినతి

తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణకు ప్రభుత్వపరంగా అవసరమయ్యే చర్యలకోసం తెలుగు కూటమి అధ్యక్షులు పారుపల్లి కోదండ రామయ్య మరియు కూటమి ప్రతినిధి బృందం  శనివారం తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు,  తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి‌ గౌరీశంకర్ లతో వేర్వేరుగా సమావేశమై వినతిపత్రాన్ని అందజేశారు. 
 

Telugu Kutami team meeting with telangana  Sahitya Academy president AKP

తెలుగు కూటమి ప్రతినిధి బృందం శనివారం తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావు, సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి‌ గౌరీశంకర్ లతో వేర్వేరుగా సమావేశమైంది. తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్ రావుకు వినతిపత్రాన్ని సమర్పించింది. వినతిపత్రంలోని వివిధ అంశాలపట్ల ఆయన సానుకూలంగా స్పందించారు.‌ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్లో తొలిరోజైన 26వ తేదీన భాష ప్రధానాంశంగా కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఆరోజు కూటమి‌ బాధ్యులు ఆయా కార్యక్రమాల్లో‌ పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. ఆరోజు కార్యక్రమాలకు ఆచార్య రెడ్డి శ్యామల బాధ్యులుగా ఉంటారని, ఆమెను తర్వాత సంప్రదించాలని ఆయన సూచించారు. 

అనంతరం కూటమి ప్రతినిధి బృందం సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి‌ గౌరీశంకర్ తో సమావేశమైంది. తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణకు ప్రభుత్వపరంగా అవసరమయ్యే చర్యలను కూటమి అధ్యక్షులు పారుపల్లి కోదండ రామయ్య  వివరించారు. ఆయా అంశాలపై తనతోపాటు అధికార భాషాసంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవితోనూ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అయాచితం శ్రీధర్ తోనూ ఉమ్మడిగా సమావేశం నిర్వహించాలని గౌరీశంకర్ సూచించారు. ఆ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని   హామీ ఇచ్చారు. పారుపల్లి కోదండ రామయ్య  భాష విషయంలో ‌చేస్తున్న కృషిని గౌరీశంకర్  ప్రశంసించడంతో పాటు‌ కోదండ రామయ్యను సన్మానించారు. 

ఈ సమావేశాల్లో తెలుగు విశ్వవిద్యాలయ శాఖాధిపతి ఆచార్య రెడ్డి శ్యామల, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్.బాలాచారి  పాల్గొన్నారు.‌ కూటమి బృందానికి పారుపల్లి కోదండ రామయ్య , చంద్రప్రకాశ్ రెడ్డి  నేతృత్వం వహించారు. బృందంలో డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు , గంటా మనోహర్ రెడ్డి , మేక రవీంద్ర ,  దైవాధీనం , కోదాటి అరుణ, కూచిభొట్ల శ్రీలక్ష్మి , బడేసాబ్  తదితరులు ఉన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios