"కసువు” పుస్తక ఆవిష్కరణ
తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉన్నతికి, సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతకు సంబంధించి ఒక రచయితగా, ఉద్యమకారుడిగా, అంబేడ్కరిస్టుగా, సాంకేతిక విద్యనభ్యసించిన విద్యార్థిగా గాదె వెంకటేష్ పరిశోధనాత్మకంగా, ఆధారాలతో సహా ఎన్నో కొత్త కోణాల్లో రాసిన వ్యాసాల పుస్తకం ' కసువు ' ఆవిష్కరణ వివరాలు ఇక్కడ చదవండి :
దశాబ్దంన్నరకు పైగా వివిధ సందర్భాలలో, వివిధ అంశాలపై ముఖ్యంగా తెలంగాణ పారిశుద్ధ్య వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులు, తెలంగాణ జీవితం, భాషా - మాండలిక, పర్యావరణ , జలవనరుల సంరక్షణ, రాజ్యాంగం అంబేడ్కర్ పాత్రలకు సంబంధించి ఆయా పత్రికలలో వచ్చిన చారిత్రాత్మక, పరిశోధనాత్మక వ్యాసాల సమాహారo 'కసువు' సంపుటిని తెలంగాణ మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో ముఖ్యంగా పారిశుద్ధ్య వ్యవస్థలోని సాంకేతిక అంశాలను చెబుతూనే పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను, కారణాలను "Technology with human face" వెలికి తీసే ప్రయత్నం చేశాడు రచయిత గాదె వెంకటేష్. బెజవాడ విల్సన్ లాంటి వారి పనికి, “అశుద్ధ భారత్” వంటి గొప్ప పుస్తకాలకు కొనసాగింపుగా ఈ వ్యాసాలను చూడవచ్చు. పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను ఏ కోణం (వర్గ / కుల)లోంచి అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాలు కూడా వాళ్లను నోటితో పొగిడి - నొసళ్ళతో ఎందుకు వెక్కిరిస్తున్నాయి? లాంటి ప్రశ్నలు వేసుకొని రాష్ట్రస్థాయి పారిశుద్ధ్య నిపుణుడిగా ప్రభుత్వ ప్రగతిని ప్రశంసిస్తూనే, ప్రశ్నించడం, పరిష్కారాలను సూచించడం ఈ వ్యాస సంపుటి ప్రత్యేకత. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు రచయిత గాదె వెంకటేష్.
పారిశుద్ధ్య కార్మికుల వృత్తులు, వాళ్లకు దక్కాల్సిన ఫలాల గురించి మనం , మన ప్రభుత్వాలు ఏ కోణంలోంచి అర్థం చేసుకోవాలి? అసలు ఈ పనిలో ఒక వర్గం వారే ఎందుకు తరతరాలుగా పనిచేయాల్సి వస్తుంది? వారి యొక్క నియామకాలు, నిధుల కేటాయింపునకు సంబంధించిన విషయాలు రచయిత తన అధ్యయన అవగాహన పరిధిలో చర్చించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవనికూడా ఈ పుస్తకంలో రచయిత ప్రస్తావించారు.
ఈ వ్యాసాలు సాంకేతికపరమైన వ్యాసాలుగా కనబడినప్పటికీ అంతర్లీనంగా అంతిమంగా ఉత్పత్తి కులాలకు, పారిశుద్ధ్య కార్మికులకు, సంబంధించిన ఆత్మగౌరవం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు చూడాల్సిన కొత్త కోణాన్ని రచయిత గాదె వెంకటేష్ మన ముందుంచారు. ఇందులో విమర్శ అయినా ప్రశంస అయినా యదార్థంగానే రాయడం జరిగింది. ప్రస్తావించిన అంశాల మీద వాస్తవిక సమాచారం ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న చరిత్రకు కొంత అదనపు జోడింపు అవుతుందని రచయిత నమ్ముతున్నాడు.
తెలంగాణ ఉద్యమకారుడిగా, పర్యావరణ, పారిశుద్ధ్య వేత్తగా, Swachh Bharath Mission(SBM) రాష్ట్ర సమన్వయకర్తగా గాదె వెంకటేష్ రాసిన ఈ వ్యాసాలు ప్రస్తుత కాలానికి అవసరమైనవి. ఈ సంకలనంలోని సమాచారం మరియు కొత్త కోణాలు చరిత్రకారులకు, పర్యావరణ పారిశుద్ధ్యంలో పనిచేసే వారికి, పోటీ పరీక్షలకు, ఉపాధ్యాయులకు అందరికీ ఉపయోగపడతాయి.
ఈ కార్యక్రమలో MLC దేశపతి శ్రీనివాస్ , తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలిప్, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాలస్వామి, ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్, తైదల అంజయ్య , ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొన్నారు .