'కవిత్వంతో కలుద్దాం' అంటూ... హన్మకొండలో తెలంగాణ రచయితల సంఘం సమావేశం

తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కవులు, రచయితల సమావేశం హన్మకొండలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం భవనంలో జరిగింది. 

Telangana Writers Association meeting in Hanmakonda

వరంగల్ : తెలంగాణ రచయితల సంఘం (ఉమ్మడి వరంగల్ జిల్లా) ఆధ్వర్యంలో హన్మకొండలో 'కవిత్వంతో కలుద్దాం' పేరిట ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి చెందిన భవనంలో జరిగిన కవిత్వంతో కలుద్దాం 18వ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రముఖ కవి, కథకుడు మెట్టు మురళీధర్  రచనలను తోటి కవి తాడిచెర్ల రవి సమావేశంలో పాల్గొన్నవారికి పరిచయం చేశారు.  

ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ...  కవికి నిజాయితీ, నిబద్ధత, సరయిన దృక్పథం ఉన్నప్పుడే మంచి కవిగా సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి కవి, రచయితలో విమర్శకుడు ఉంటాడని... తాను రాసిన రచనను తనలోపల ఉన్న విమర్శకుడు ఒప్పుకుంటేనే అది నిలిచిపోతుందని అన్నారు.  సృజనాత్మకమైన ప్రతిదీ రచననే అని... సమాజానికి ఉపయోగపడని ఏ రచనైనా నిరుపయోగమని రవి పేర్కొన్నారు.

పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ  కార్యక్రమంలో ఇటీవల మరణించిన అభ్యుదయ కవయిత్రి, రచయిత్రి డా. కందాల శోభారాణికి తెరసం తరపున కవులందరూ నివాళులు అర్పించారు. అనంతరం కవి బిల్ల మహేందర్ ఆధ్వర్యంలో కవులచే కవిత్వ పఠనం నిర్వహించారు. 

ఈ సమావేశంలో కవయిత్రి తిరుమలగిరి వకులవాసు సంపాదకత్వంలో వెలువడిన ' త్రిదళాలు ' పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో కవులు సిరాజుద్దీన్, కార్తీకరాజు, పల్లేరు వీరస్వామి, బైరెడ్డి రంగారెడ్డి, జంగ వీరయ్య, శనిగరం రాజమౌళి, చింతల కమల, ఆంజనీదేవి, ఎడెల్లి రాములు, రామా రత్నమాల, వందన, అస్నాల శ్రీనివాస్, పుల్లూరి సుధాకర్, జితేందర్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios