తెలంగాణా కథల పై షార్ట్ ఫిలిం సిరీస్ ఫస్ట్ సీజన్..
తెలంగాణా సాహిత్య చరిత్రలో కూడా గొప్ప స్థానం ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారి “గొల్ల రామవ్వ”, ఇంకా చెరబండ రాజు, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, జాతశ్రీ, జూకంటి జగన్నాధం తదితరుల రచనలు ఈ సిరీస్ లో భాగంగా చూడవచ్చు.
తెలుగు సాహిత్యం…ప్రత్యేకించి తెలంగాణా నుండి వచ్చిన కథా సాహిత్యం కు సంబంధించి ఈ మధ్య ఓ కొత్త ప్రయత్నం జరిగింది. వీ6 న్యూస్ ఛానల్ వారు “తెలంగాణా కథలు” పేరుతో, తెలంగాణా కు చెందిన ప్రసిధ్ద రచయితల కథలు కొన్ని ఎంచుకుని, ఒక షార్ట్ ఫిలిం సిరీస్ గా నిర్మించి, తమ ఛానల్ ఫేస్ బుక్, యు ట్యూబ్ లలో పోస్ట్ చేసారు. 1930 కాలం నుండి ఈనాటి వరకు ఉన్న కొన్ని మంచి కథల దృశ్య రూపం ఈ సిరీస్ లో భాగంగా వచ్చింది. తెలిసిన దానిని బట్టి 2014 – 15 లొనే ఈ సిరీస్ నిర్మాణం జరిగినా…ఈ మే నుండి జులై నెలల మధ్య ఈ సిరీస్ ప్రసారం జరిగింది.
తెలంగాణా సాహిత్య చరిత్రలో కూడా గొప్ప స్థానం ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారి “గొల్ల రామవ్వ”, ఇంకా చెరబండ రాజు, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, జాతశ్రీ, జూకంటి జగన్నాధం తదితరుల రచనలు ఈ సిరీస్ లో భాగంగా చూడవచ్చు. ఈ సిరీస్ లో కథల ఎంపిక, టెలీ ప్లే తో పాటు దర్శకత్వ నిర్వహణ చేసింది రఘురాం బండి. ఈ ఎనిమిది కథలు “తెలంగాణా కథలు” సిరీస్ లో మొదటి సీజన్ అని, మరిన్ని కథలతో దీనికి కొనసాగింపు ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్ ప్రాంత రంగస్థల నటులు చాలా మంది కనిపించే ఈ సిరీస్ తెలంగాణా మట్టి కథలను, మనుషులను ఆవిష్కరించిందని చెప్పవచ్చు.
తెలంగాణా సాహిత్యానికి దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నాలు గతం లో కూడా కొన్ని జరిగినా, కథా సాహిత్యాన్ని ఎంచుకుని జరిగింది ఇదే తొలి ప్రయత్నం గా ఈ కృషిని అభినందించవచ్చు. ఎంటర్టైన్మెంట్ ఛానల్ లలో ఇలాంటి సిరీస్ వస్తే మరింత మందికి చేరవచ్చు. “తీన్ మార్” లాంటి తెలంగాణా యాస బులెటిన్ లు ప్రతీ ఛానల్ లో వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి క్రియేటివ్ ప్రయత్నాలు సులభంగా ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్ళవచ్చు.