Asianet News TeluguAsianet News Telugu

దోమకొండ సంస్థాన సాహిత్యసేవ అమూల్యం: తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ సదస్సులో వక్తలు

కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో పలు సంస్థానాల్లో సాహిత్య సేవ కోసం చేసిన కృషిపై  సదస్సులో చర్చించారు.

Telangana samstanala sahitya seva meeting conducted at domakonda in Kamareddy district lns
Author
First Published Jan 11, 2024, 4:18 PM IST


కామారెడ్డి:ఈ నెల 6 వ తేదీన  కామారెడ్డి జిల్లా దోమకొండ  కోటలో  'తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ' సదస్సు జరిగింది.  ఈ సదస్సులో తెలంగాణలోని వివిధ సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత కృషిపై పలువురు సాహితీవేత్తలు పత్ర సమర్పణలు చేశారు.  ఆ వివరాలు ఇక్కడ చదవండి : 

తెలంగాణలో దోమకొండ సంస్థానం చేస్తున్న సాహితీసేవ అమూల్యమైందని పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తంగెడు కిషన్ రావు అన్నారు. ఈ నెల 6 వ తేదీన కామారెడ్డి జిల్లా దోమకొండ  కోటలో జరిగిన 'తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ' సదస్సులో ఆయన ముఖ్య  అతిథిగా పాల్గొన్నారు.  విశిష్ట  అతిథిగా  శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.జయరామరెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యంలో సంస్థానాల పాత్ర విశిష్టమైందని అన్నారు. మరొక విశిష్ట అతిథి కామారెడ్డి జిల్లా పూర్వ పాలనాధికారి డాక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రసంగిస్తూ దోమకొండకోటలో పలు సామాజికాభివృద్ధి కార్యక్రమాలు జరగడం హర్షణీయం అన్నారు. 

Telangana samstanala sahitya seva meeting conducted at domakonda in Kamareddy district lns

సభకు స్వాగతం పలికిన సంస్థాన పాలకుల వారసులు అనిల్ కామినేని మాట్లాడుతూ తమ పూర్వికులు నడచిన మార్గంలో సాహిత్యసేవను కొనసాగించడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు.  ప్రముఖ కవి  డా.ఏనుగు నరసింహారెడ్డి సంస్థాన సాహిత్య వికాసంపై విపులంగా ప్రసంగించారు. ప్రముఖ చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డా.లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.‌

ప్రముఖ నృత్య దర్శకురాలు మధుమతి కులకర్ణి శిక్షణలో పలువురు నృత్యవిద్యార్థినులు చేసిన స్వాగత నృత్యం అందరినీ ఆకట్టుకొన్నది. అనంతరం ప్రారంభమైన తొలి సదస్సుకు డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, బాబ్జీ జాలాది సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ప్రముఖ పరిశోధక పండితుడు వైద్యం వేంకటేశ్వరాచార్యుల అధ్యక్షతన  పలు సంస్థానాలలోని సాహిత్యసేవలపై వక్తలు ప్రసంగించారు. ప్రముఖ పరిశోధకులు, రచయితలు  డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు,  డాక్టర్ అంబటి భానుప్రకాశ్, అబ్దుల్ అజీజ్, డాక్టర్ జి.శ్యామసుందర్, డాక్టర్ నాయకంటి నరసింహశర్మ, డాక్టర్ ఎం.అనంతకుమారశర్మ, డాక్టర్ తాడేపల్లి పతంజలి, డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, శాస్త్రుల రఘురామశర్మ, బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ వడ్ల శంకరయ్య తదితరులు వివిధ సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత కృషిపై పత్ర సమర్పణలు చేశారు. ఈ సదస్సుకు వేదార్థం మధుసూదనశర్మ అనుసంధానకర్తగా వ్యవహరించారు. సదస్సులో పత్ర సమర్పణలు చేసిన పరిశోధకులను దోమకొండ  సంస్థానాధీశులు  అనిల్ కామినేని ఘనంగా సత్కరించారు. 

ఈ సదస్సుకు ఆత్మీయ అతిథులుగా అమరచింత, ఆత్మకూరు, ఆలంపూరు, ఆనెగొంది, గద్వాల, గోపాలపేట, జటప్రోలు, కొల్లాపూరు, సిర్నాపల్లి, నారాయణపేట, పాపన్నపేట, పాల్వంచ, మునగాల, బేతవోలు, రాజాపేట, సురపురం  సంస్థానాల వారసులు హాజరయ్యారు.  

Telangana samstanala sahitya seva meeting conducted at domakonda in Kamareddy district lns

అనంతరం జరిగిన కవిసమ్మేళనానికి ప్రముఖ విద్వత్కవి, దాశరథి సాహితీ పురస్కార గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అధ్యక్షత వహించారు. డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కవిసమ్మేళనంలో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, గుమ్మన్నగారి బాలసరస్వతి, బండకాడి అంజయ్యగౌడ్, డాక్టర్ శాస్త్రుల రఘుపతి, సాయిప్రసాద్,  మంచినీళ్ల సరస్వతీరామశర్మ, కొరిడె విశ్వనాథశర్మ, ప్రసాదం స్వాతి, చింతా రామకృష్ణారావు, పబ్బా విజయశ్రీ తదితరులు కవితాగానం చేశారు. 

సదస్సు ముగింపులో సాయంకాలం ఆరుగంటలకు  'ప్రతాపరుద్ర విజయం' సాహితీరూపకప్రదర్శన జరిగింది. డాక్టర్ సంగనభట్ల నరసయ్య రచించి, దర్శకత్వం వహించిన ఈ రూపకానికి మరుమాముల దత్తాత్రేయశర్మ నిర్వాహకులుగా వ్యవహరించారు. హైదరాబాదులోని అభ్యుదయ కళా వికాస్ సంస్థ నిర్వహణలో కొనసాగిన ఈ రూపకానికి ప్రముఖ సంగీత దర్శకులు దేశపతి శ్రీనివాస్ శర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఎం.ఆనంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించి రక్తి కట్టించారు.

దోమకొండ సంస్థాన వారసుల నిర్వహణలో  జరిగిన సాహితీ సదస్సు ఎన్నో మధురానుభూతులను పంచింది. ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ సంస్థానం పక్షాన అనిల్ కామినేని సత్కారాలు చేసి, కృతజ్ఞతలను చెప్పగా ఈ సదస్సు అద్వితీయంగా ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios