మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా "శతక షోడశి" పుస్తకావిష్కరణ

ప్రతి ఒక్కరూ తమ మాతృభాష   చదవాలనీ, రాయాలనీ  అలాంటప్పుడే తెలుగు భాషను పరిరక్షించడం సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు.

Telangana minister Niranjan Reddy releases sataka sodasi book

తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం బీసీ కమిషన్ కార్యాలయంలో తెలుగు ప్రపంచ వేదిక, అక్షర యాన్ సంయుక్త ఆధ్వర్యంలో "శతక షోడశి" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాతృ భాషలో నిష్ణాతులైన వాళ్ళుకు ప్రపంచంలో ఏ భాషలోనైనా అవలీలగా నేర్చుకునే శక్తి వస్తుందని  మాతృభాష పరిరక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ముందుకు రావడం అభినందనీయమన్నారు.   ఉపాధ్యాయులు అందరూ  నడుం బిగించి మాతృభాష పరిరక్షణ గ్రామ గ్రామానికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి బిసి  సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం   అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి, విశిష్ట అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ హాజరై 16 మంది సాహిత్యకారులు రాసిన 16 సరళ శతకాల సమ్మేళనం "శతక షోడశి " పుస్తకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యధికులు మాట్లాడుతున్న 12వ భాషగా తెలుగు గుర్తింపు ఉందని అన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా మాతృభాష తీవ్ర వివక్షతకు గురి అయిందని అన్నారు. ఇప్పటికైనా మేల్కొని భాష పరిరక్షణకు నడుం బిగించి కపోతే పెనుప్రమాదం ఎదుర్కోక తప్పదని అన్నారు.

భాషపై పట్టు ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నారులకు మాతృభాష విశిష్టతను తెలియజేస్తూ మాతృభాషలో రాణించేలా తోడ్పాటు అందించాలని బుర్రా వెంకటేశం కోరారు. మాతృభాషలో చదవడం రాయడం రానివారి   సంఖ్యను తగ్గించాలని, ప్రతి ఒక్కరూ తమ మాతృభాష   చదవాలనీ, రాయాలనీ  ఆయన సూచించారు. భాషలో భావం బందీ కావద్దని,  భాష -  భావం కలిసినప్పుడే ఆ భాష నిలుస్తుందని ఆయన అన్నారు.‌ లక్ష బాల కవులను తయారు చేయాలన్న లక్ష్యంలో ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.‌

అందరికీ అర్థమయ్యే సాహిత్యం రావాలని బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ అన్నారు. సరళంగా ఉన్నప్పుడే సాహిత్యం ప్రజలకు చేరుతుందన్నారు.‌ సరళ వచనంలో శతకం రచించిన రచయితలను ఆయన అభినందించారు.‌ ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, సుభాష్, అక్షర యాన్ వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి , సభ్యులు సమ్మెట విజయ, విశ్వైక, యశోద, శుభ పేరిందేవి, రాజశ్రీ, సరళ శతక రచయితలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన తెలుగు రచయితలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.‌  ఈ సందర్భంగా శతకాలు రాసిన బాల కవులను మంత్రి సత్కరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios