Asianet News TeluguAsianet News Telugu

తగుళ్ళ గోపాల్ కు పాలమూరు సాహితి అవార్డు ప్రదానం

తగుళ్ల గోపాల్ కు పాలమూరు సాహితీ అవార్డును ప్రదానం చేశారు. బుర్రి వెంకటరాం రెడ్డి చేతుల మీదుగా ఆయన ఆ అవార్డును అందుకున్నారు.

Tagulla Gopal presented Palamuru Sahithi award
Author
Mahabubnagar, First Published Feb 15, 2021, 2:06 PM IST

తెలుగు సాహిత్యరంగంలో విశేషకృషి చేస్తున్న కవులకు గత పది సంవత్సరాలుగా ఇచ్చే పాలమూరు సాహితి పురస్కారాన్ని 2019 సంవత్సరానికి గాను "దండకడియం" రచించిన యువకవి తగుళ్ళ గోపాల్ కు అందజేశారు. ఫిబ్రవరి 14 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాలలోని కాళోజీ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పురస్కారంతో పాటు 5,116/- నగదు, శాలువా, మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించి వారి కీర్తిని అజరామరం చేశారన్నారు. ఆ మార్గంలో పాలమూరు సాహితి తెలుగు సాహిత్యంలో వెలుగొందుతున్న కవులకు పురస్కారాలను అందజేయడం అభినందించదగ్గ విషయమన్నారు. 

పాలమూరు జిల్లా కవులకు పెట్టని కోట అని, అది పాలమూరు మట్టికున్న బలమని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం లేదన్నారు. విశిష్ట అతిథిగా డాక్టర్ బోగ కోదండపాణి మాట్లాడుతూ పాలమూరు జిల్లా కవుల ఖిల్లా అని దానిని సార్థకత చేకూర్చడానికి ఎంతోమంది నవయువ కవులు నిరంతరం కవిత్వం రాస్తుండడం సమాజం పట్ల వారికున్న అభిలాషను తెలియజేస్తుందన్నారు. కవిత్వం ఎవరు రాసినా సమాజాన్ని సంస్కరించే విధంగా ఉండాలన్నారు. అలాంటి కవిత్వమే నిలుస్తుందన్నారు. 
సభాధ్యక్షులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ తగుళ్ళ గోపాల్ కవిత్వం పాలమూరు మట్టిని, పల్లె సౌందర్యాన్ని పట్టిచూపుతుందన్నారు. నిరంతరం తనదైన శైలిలో కొత్తగా రాస్తున్న యువకవి అని ప్రశంసించారు. పాలమూరు సాహితి పురస్కార వ్యవస్థాపకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న కవులను చంద్రునికో నూలుపోగులా గత పది సంవత్సరాలుగా పాలమూరు సాహితి పురస్కారాలను అందజేస్తున్నామన్నారు. మంచి కవిత్వం రాస్తున్న కవులందరికీ పాలమూరు సాహితి ఎప్పుడూ  ప్రోత్సహిస్తుందన్నారు.

వేముల కోటయ్య "నవరత్నాలు (మొగ్గలు)" ఆవిష్కరణ

Tagulla Gopal presented Palamuru Sahithi award

ఈ సందర్భంగా యువకవి వేముల కోటయ్య రచించిన "నవరత్నాలు (మొగ్గలు)" కవితాసంపుటిని బుర్రి వెంకట్రామారెడ్డి ఆవిష్కరించారు. పుస్తకాన్ని ప్రముఖ యువకవి బోల యాదయ్య సమీక్ష చేస్తూ సమాజాన్ని సంస్కరించిన తొమ్మిదిమంది జాతీయ ప్రముఖుల గురించి వేముల కోటయ్య నవరత్నాలు గా ఆవిష్కరించారన్నారు. 

ఈ పుస్తకంలో బుద్ధుడు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, స్వామి వివేకానంద, ఠాగూర్, అంబేడ్కర్, గాంధీజీ, మదర్ థెరిసా, అబ్దుల్ కలాం వంటి గొప్పవ్యక్తుల గురించి మొగ్గల్లో చక్కగా రచించారన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు సాహితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుంటి గోపి, రంగినేని మన్మోహన్, విఠలాపురం పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios