కుక్క తోక వంకర అంటాం కానీ మరి మనిషి బుద్ధి .... ఆసక్తికరంగా కొనసాగిన సుధామురళి కవిత " చిట్టి " ఇక్కడ చదవండి.

చిట్టి

అవును
తాను
నేడో రేపో కాలం చేస్తుంది

ఎంతలా నేను మిగిలిన ప్రేమలో
కాస్త అన్నాన్ని కలిపి ముద్ద విసిరితే మాత్రం
కలకాలం నాతో ఎలా ఉండిపోతుంది

ఇకపై
ఇంటి చుట్టూ 
రక్షణ గోడ ఉండదు కాబోలు
తానుండదుగా

కడుపు కరువుని ఎదిరించేందుకు
ఊరంతా తిరిగి వీధి గడప మీదకి 
కాలుని చేర్చీ చేర్చగానే
చెమట వాసనకు బానిసైనట్టు నన్ను చుట్టేసేది
ఈసడింపులు అదిలింపులు
నేనిచ్చే ఈ బహుమతులను
ఏ చెవిలో వేసుకుని ఏ చెవిలోంచి వదిలేసేదో
ప్రేమ కారుతున్న నాలికతో నా పాదాలు తుడిచేది
సాంత్వన భాషను రాసేది

అర్ధరాత్రీ పట్టపగలూ
నిద్రా భంగానికి 
నా ఆస్తి నాస్తి కాకుండా ఉండడానికి
తన నిద్రను విశ్వాసం కిందకు తొక్కి
తన చూపును డేగ కళ్లలోంచి ఎత్తుకొచ్చి
ఎన్ని జిత్తులతో కాపు కాసేది

తనిప్పుడు
కాలం చేస్తే
తన తోక వంకర పోతుందేమో
తనను తనలా ఆదరించని
నా బుద్ది వంకర........!?