సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీ
సింగమనేని నారాయణ కథల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఇతర సాహితీ వార్తలను కూడా ఇక్కడ చదవండి.
కీర్తి శేషులు సింగమనేని నారాయణ ఎనిమిది దశాబ్దాల జీవన క్రమంలో ముప్పాతిక పై భాగం సాహిత్యజీవిగా కొనసాగారు. ప్రసిద్ద కథకులుగా, విమర్శకులుగా, ఉపన్యాసకులుగా, సంపాదకులుగా తనదైన ముద్ర వేసారు. నమ్మిన ఆశయాల కోసం జీవితాంతం నిబద్ధతగా నిలబడ్డారు.
ప్రజాస్వామిక, శాస్త్రీయ, సమసమాజ భావనలకు ఆయన రచనలు అద్దం పడతాయి. మనుషుల మధ్యే కాకుండా ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండాలనేవారు. రాయలసీమ ప్రాంత సామాజిక, సాహిత్య వికాసానికి కృషి చేసారు. సీమ ప్రాంతీయ నిర్దిష్ట జీవితాన్ని, భాషను తన కథల్లో చిత్రీకరించారు. వ్యాసాలలోనూ వివరించారు. "సీమ కథలు" అనే కథల సంకలనం కూడా వెలువరించి సీమ జీవన సంఘర్షణను ప్రపంచానికి పరిచయం చేసారు. కేవలం రచనలు, ఉపన్యాసాలకే పరిమితం కాక సీమ సమస్యల పరిష్కారానికి కొనసాగే కార్యక్రమాలలోను భాగమయ్యేవారు. వైవిధ్యమైన సింగమనేనిని ఇటీవల కోల్పోవడం బాధాకరం. సీమ సాహిత్యానికి తీరనిలోటు.
సింగమనేని నారాయణ సీమ కథాసాహిత్యానికి విశేషంగా కృషిచేసిన నేపథ్యంలో రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం పక్షాన రాయలసీమ కథల పోటీలను నిర్వహించి, వారి స్ఫూర్తిని కొనసాగించాలని భావిస్తున్నాం.
రాయలసీమ నిర్దిష్ట జీవనగతులు ఇతివృత్తంగా, కథా ప్రక్రియ లక్షణాలను అనుసరించి, కొత్తగా రాసిన కథలను 31 మే 2021 లోగా దిగువ చిరునామాకు పంపాలి. న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు మొత్తం "పదివేల రూపాయల బహుమతులను" కథకులకు అందచేస్తాము.
* వై. శైలజ, 13-2-7, ఆంధ్ర ప్రగతి బ్యాంక్ పక్క వీధి,రామచంద్రనగర్, అనంతపురము, పిన్: 515001.
మైల్ ఐడి : seemakathalu@gmail.com
సమన్వయకర్త: డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
9963917187.
పీచర సునీతా రావు అవార్డుల కోసం రచనలకు ఆహ్వానం .
ఇటీవలే స్వర్గస్థులైన శ్రీమతి పీచర సునీతా రావు పేరుతో ఆమెభర్త విజేందర్ రావు సాహితీ నిష్ణాతులకు అవార్డులు ఇవ్వ సంకల్పించారు . కవిత్వం, కథ , విమర్శ మూడు విభాగాల్లో ఒక్కొక్క విశిష్ట గ్రంథానికి రూపాయలు 15,౦౦౦/- నగదు మరియు సత్కారం ఉంటుంది. ఈ అవార్డులకు గాను 2018 నుండి ఇప్పటి వరకు వెలువడిన కవిత, కథ, విమర్శ గ్రంథాలు మూడు చొప్పున ఈ క్రింది చిరునామాకు పంపించవలసినదిగా కోరుతున్నాం. పుస్తకాలు పంపించవలసిన చివరితేది ఏప్రిల్ 12, 2021.
- కాంచనపపల్లి గో.రా. కన్వీనర్, అవార్డు కమిటీ.
చిరునామా: టి.మన్మోహన్ రావు , ఇంటి నెంబర్ 1-5-431/2/16, రామేశ్వర్ నగర్ కాలనీ, జొన్నబండ , ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్ - 500010. సెల్.9848698699.
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2020 ప్రదానం
తేదీ 28/03/2021 ఆదివారం ఉదయం 10 గంటలకు రంగినేని ట్రస్ట్ ఆవరణ సిరిసిల్లలో రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2020 ప్రదానం జరుగుతుంది. సిరిసిల్ల పురపాలక సంఘం చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి జ్యోతి ప్రకాశనంతో ప్రారంభమయ్యే ఈ సభకు జూకంటి జగన్నాథం సభాధ్యక్షత వహిస్తున్నారు. సాక్షి దినపత్రిక సంపాదకులు వర్థెల్లి మురళి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ సభలో పురస్కారానికి ఎంపికైన 'సోల్ సర్కస్' కథా సంపుటి రచయిత వెంకట్ శిద్దారెడ్డికి ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్ రావు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పుస్తక పరిచయం పెద్దింటి అశోక్ కుమార్, వందన సమర్పణ కోశాధికారి రంగినేని నవీన్ చేస్తున్నట్టుగా రంగినేని ఎల్లమ్మ పురస్కార కమిటి కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ తెలిపారు.