శిఖామణి కవిత : అమృతోత్సవ కల....

ఖండిత శిరస్సులై రాలిపడుతున్నా గుండెను దిటవు చేసుకుని గుట్టుగా దేశం పరువును గుప్పిట పట్టి నిలబడ్డాను అంటూ శిఖామణి రాసిన కవిత   " అమృతోత్సవ కల...." ఇక్కడ చదవండి

Sikhamani Telugu poem Amruth Mahotsav dream

అమృతం కోసం కలగంటున్నాను
ఒకటా రెండా
శిలాజ సదృశ్యమైన 
డభ్భై అయిదు సంవత్సరాల నుంచీ
అమృతం కోసం కలగంటున్నాను...
పంపకాలు జరిగిన ప్రతిసారీ
నాకు తెలియకుండానే
నేను రాక్షస పంక్తిలోకి నెట్టి వేయబడుతున్నాను
నీటికీ భూమికీ సరిహద్దు రేఖలు గీసినట్టు
మనిషికీ మనిషికీ మధ్య
ఎన్ని ఆంక్షల ముళ్ళ కంచెలు
ఎన్ని అసమానతల అగడ్తలు...?
అందరం ఒక తల్లి బిడ్డలమే
అందరం ఒక తాను గుడ్డలమే
నీకే మో తల్లిపాలు
నాకేమో పోత పాలా?
నీ వొంటి మీద
రాజసంగా కులికే కులం చొక్కా
నాకే కురచై
బొడ్డు పైకెక్కి
ఎందుకు అవమాన పరుస్తోంది??
ఎవరి గాయం  చిమ్మిన రక్తమైనా ఎరుపే
ఏ కాలికి గాయం తగిలినా పిలిచేది అమ్మనే
అయినా
శతాబ్దాలుగా నా విస్తరి
ఊరికి దూరంగా  విసిరివేయబడింది
అమృతం కోసం కలగంటున్నాను!
జాతీయతను మనసు నిండుగానే కాదు
రక్తం అణువణువునా నింపుకున్నాను
జాతీయ జెండాను నా గుండె గుడిసె మీదనే కాదు
నా వెన్నెముకను జెండా కర్రను చేసుకుని
నన్ను నేను ఎగరేసుకున్నాను
అయినా ప్రశ్నించండి
గుళ్ళోకి ప్రవేశించి నందుకే
మల మూత్రాలు తాగించిన
దేశంలో
రేండుమామిడి కాయల దొంగతనానికే
చెట్టు నుండి కాయను తెంపినంత
సులువుగా ప్రాణాన్ని తెంపిన ఈ దేశంలో
ప్రశ్నించండి...
రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లనీ...
ఎన్నేళ్ళనీ తప్పక ప్రశ్నించండి!!
శతాబ్దాలుగా
వివక్షతల జడివాన
ముంచెత్తుతున్నా
దశాబ్దాలుగా
అవమానాల సర్ప బంధనాలు
కాళ్ళను చుట్టుముడుతున్నా ...
నాలోనుండే
కోటేసులూ...సునీతలూ..
రోహిత్‌ లూ...మధుకర్‌ లూ..
ఖండిత శిరస్సులై రాలిపడుతున్నా
గుండెను దిటవు చేసుకుని 
గుట్టుగా దేశం పరువును గుప్పిట పట్టి నిలబడ్డాను
నాలుగు కాళ్ళ పశువును పూజించండి
కానీ ప్రక్కనున్న రెండుకాళ్ళ 
బక్క మనిషిని కూడా
బతకనీయండి
తాడిచెట్టు ప్రమాణంలో 
మువ్వన్నెల పతాకాల్ని
ఎగరేయడాన్ని కన్నప్పుడు
నూట ఇరవై అడుగుల ఎత్తులో
అంబేద్కర్‌ విగ్రహాలు నిర్మిస్తున్నారని విన్నప్పుడు...
ఇదిగో...ఇప్పుడు
ఈ మట్టి కాళ్లమనిషి కూడా
తలెత్తుకు నిలబడతాడనీ...
ఆకాశమే హద్దుగా
నిలువెత్తు ఆత్మ గౌరవ పతాకంలా
రెపరెప లాడతాడనీ...
ఒక అమృతోత్సవ కల కంటున్నాను...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios