చంద్రయాన్ - 3
ఆగామి సౌధాల అవకాశాల నిగ్గు తేల్చడానికి అదిగదిగో వచ్చింది చంద్రయాన్ - 3 అంటూ విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత చంద్రయాన్ - 3 ఇక్కడ చదవండి :
దూరపు కొండవో దిక్కుమాలిన చలువ బండవో
శూన్యంలో శైతల్యం చిట్లించే చిట్టి ఉండవో
అబ్బో! నిన్ను చూసేగా కథలు కవితలు కావ్యాలు
నిజం చెప్పాలంటే నీవన్నీ గుంటలు గోతులు
ఉడికిపోయిన ఉదజని ఆమ్లజని ఊటలు!
నువ్వు జాల్వారే వెన్నెలవో
జాజిపూ విభ్రమానివో ననుకోకు
నువ్వొక స్వయంప్రకాశకం కాని విగ్రహానివి
ఉత్తుత్తి ఉపగ్రహానివి!!
రాత్రికి రారాజునని విర్రవీగకు
ఒక పగలు నీ ఉపరితలంతో సహవాసం చేసి
నీ రాళ్ళూరప్పల రంగు చరిత్ర మళ్ళీ విప్పేందుకు
నీ బండారం బయట పెట్టేందుకు
చుక్క నీరే లేని ఐదు సంద్రాల ఖైదును
మరోమారు విడుదల చేసేందుకు
తన సహోదరుడి సంగతుల సందేశం పొందేందుకు
బెంబేలెత్తించే నీ బేతాళుడి భరతం పట్టేందుకు
తన ప్రజ్ఞ తో పక్షం రోజుల పరీక్షకై సర్రున దూసుకొస్తున్నాడు విక్రమ్
తమ్మీ! ఇక నువ్వు జర భద్రం!!!
నిదానమే ప్రధానమని నినదిస్తూ
భూమండలాన్ని వదలడానికి
మండలం దీక్ష మౌనంగా తీస్కుంటూ
నీ దక్షిణ ధ్రువానికి చేరడానికి ఏ దక్షిణా అడగకుండా
ఆల్ఫా కణాల ఆరాటాన్ని ఆరా తీయటానికి
సూక్ష్మతరంగాల సుడిగుండాల చిక్కు విప్పడానికి
అతినీలలోహిత కిరణాల అంతు తేల్చడానికి
మానవ సాహసంతో
ఆగామి సౌధాల అవకాశాల నిగ్గు తేల్చడానికి
ప్రక్షేపణాలను పేల్చి వైఫల్యాలను పటిష్టంగా వేర్పర్చి
నీ లలాటంపై లేజర్ గీతలతో కొత్త గీతను సృష్టించేందుకు
అదిగదిగో వచ్చింది చంద్రయాన్ - 3
నీ గుండెపై గౌరవంగా
భారతీయ జయపతాకం ఎగురుతుంది చూడు !!!