సావిత్రి భాయి ఫూలే జయంతి ప్రత్యేకం... డా. సిద్దెంకి యాదగిరి 'దీనజన కల్పవల్లీ' కవిత
హైదరాబాద్: ఇవాళ (సోమవారం,జనవరి 3) భారత తొలి ఉపాధ్యాయిని, సంఘ సంస్కర్త, సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా సిద్దిపేట నుండి డా. సిద్దెంకి యాదగిరి రాసిన కవిత "దీనజన కల్పవల్లీ" ఇక్కడ చదవండి.
దీనజన కల్పవల్లీ
కాలంతో కలెబడడానికి ఆత్మ గౌరవం
పంకిలం అంటని కుమ్మరి పురుగులా
ఉద్యమం ఊపిరి ఉన్నంతవరకూ సాగింది
కసిరి బుసకొట్టే కట్టుబాట్లు
ఆచారాల ఆధిపత్యాలు
మూఢనమ్మకాల మురుగులో ఉద్భవించిన తామర
ఆమె జీవితం అజరామరం
చల్లిన పెండ నీళ్లల్లో తడిసిన బోధ
రేపటి పరిమళం కోసం
ఇంధనమైన రేపటి మూలధనం
అవమానాలు భరించినా
నిరక్షరాస్యతకు వెలుగులు తొడిగిన
అక్షర యోధ
ఆదర్శ ఉద్దీపన
మనిషిని పసరంకన్న హీనంగా
అంకుశమై పొడిచే
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో
నిరాశల ఈసడింపుల నడుమ
ఆశయంగా అంకురించిన ఆశ
ఎదురుపడి నిందలు నిరసిస్తున్నా
ఆచారం కట్ల పామయి కరుస్తున్నా
బాధితుల బలమైన గొంతుక
సంస్కరణ శ్వాస
సమానత్వమే ధ్యాస
బహుజన సమరమైన తల్లి
దీనజన కల్పవల్లీ
సావిత్రి భాయి ఫూలే.