ఓటేశేదాక తలమీన పూలు జల్లుతరు అవ్వంగనె కాళ్ళకింది నేల గుంజేస్తరు  అంటూ డా. సరోజ వింజామర రాసిన కవిత  ' జర జాగ్రత్త  ' ఇక్కడ చదవండి

డా. సరోజ వింజామర కవిత : జర జాగ్రత్త

ఓటేశేదాక తలమీన పూలు జల్లుతరు అవ్వంగనె కాళ్ళకింది నేల గుంజేస్తరు అంటూ డా. సరోజ వింజామర రాసిన కవిత ' జర జాగ్రత్త ' ఇక్కడ చదవండి : 

పాలకులది కాదు పాపం ప్రజలది
ఎవరన్నారు నోటుకు అమ్ముడుపొమ్మని
కల్లు సుక్కలకోసం ఎవరాశపడమన్నారు
చీర చేతికియ్యంగానే
విలువల వస్త్రాలొదిలేస్తివి
సుక్కబొట్టు గొంతుల వడంగనె 
బుద్దీ జ్ఞానం విడిస్తివి
గంటకో రంగు మార్చే 
ఊసరవెల్లి ఆదర్శంగా
పూటకో సభకు వొయ్యి 
నోటుకు జై కొడ్తివి 
ఐదు రూపాలకోసం 
ఐదేండ్లను గిరివికి వెడ్తివి
నీకు ఈ రోజు గడ్సుడే ముఖ్యం
వచ్చే తరం ఎట్లపోతే నీకేం నష్టం
ఇయ్యాల పథకాల పట్టెమంచం మీన పండుకోవెడ్తరు 
వాటిగురించి రేపటేళ అడ్గినవో పాడెమీద పండవెడ్తరు
ఓటేశేదాక తలమీన పూలు జల్లుతరు 
అవ్వంగనె కాళ్ళకింది నేల గుంజేస్తరు
బడా బడా సాబ్ లంత సూట్కేస్ లేస్కునొస్తరు
నీతో తోలుబొమ్మలాట ఆడిస్తరు
నీ ఆటకు వచ్చిన పైసల్తోటి 
సందూక్ లు నింపుకవోతరు 
ఓట్ల పండుగ ఎల్లేదాకా నీవే దేవునివి
అయినంక ఐదేండ్లూ 
అనుమతి లేని భక్తునివి
బిడ్డా! జర జాగ్రత్త! 
రోడ్లమీన గుంతవైతవ్
పన్ను పోటుకు ఎరవైతవ్
నింగినంటే ధరవైతవ్
నెర్రెలిడ్శిన నేలవైతవ్ 
తెలివిగా మసలుకో
నీ విలువను కాపాడుకో
చీకట్లను చీల్చే కార్తీకవేళ
ఎన్నికల దారిదీపానీవై
జాతి విలువను నిలబెట్టు 
ప్రజలకోసం నిలబడే నాయకులకే పట్టం కట్టు