సంధ్య సుత్రావె కవిత : ఊహల డోలిక
హైదరాబాద్ నుండి సంధ్య సుత్రావె రాసిన కవిత "ఊహల డోలిక" లో కథలోని గొప్ప తనాన్ని ఏ విధంగా చెప్పారో ఇక్కడ చదవండి.
వస్తువు ఏదైనా
అలనాటి నుండి
కమ్మనైనది కథ!
నిద్రపుచ్చాలంటే పాపాయికి
కావాలి కథ
కథ కళ్ళకు కట్టినట్లు
చెప్పటం గొప్ప కళ
ఆసక్తిగా ఆర్తిగా వినటం
ఓగొప్ప దృశ్యస్వప్నం
విలువలు నమ్మకాల పరిచయం
ప్రపంచ జ్ఞానసముపార్జనం
పరసంస్క్రతిపట్ల ప్రశంసాతత్వం
పెంచేది కథ
గొప్ప సందేశాత్మకం
చిన్నారులకు జ్ఞానతృష్ణ పెంచి
జ్ఞాపక శక్తిని ఉత్తేజ పరచేది కథ
అభ్యసనాభివృధ్ధి సాకారం
భాషాభిమానం పుస్తకప్రియత్వం
పఠనాసక్తి కల్గించి
ఊహల డోలనం చేయించేది కథ
మెదడుకు మేతవేసి
ఏకాగ్రత ఆత్మవిశ్వాసం
పెంచేది కథ
"అనగనగా" మొదలు తోనే
పిల్లల్ని తీసుకెళ్తుంది
ఊహల లోగిలిలోకి
పాత్ర ప్రవేశానుభూతి కల్గిస్తుంది
కథ చెప్పటం చదువటం
వినటం వల్ల పిల్లల్ని
కాల్పనిక జగత్తులో విహరింపచేసి
ప్రశ్నించేతత్వం హేతువాదం
అలవర్చి మంచిపౌరులుగా
చేస్తుంది కథ, అందుకే
కథాసుధతో సంస్క్రతి
వారసత్వం అందించి
కథల పుస్తకాలనే అరుదైన
అపురూప అమూల్యమైన
కానుకలుగా అందించటం
ఆనవాయితీ కావాలి
బామ్మ అమ్మమ్మ తాతయ్యేగాక
వీలైనంతవరకు
నాటి నేటి రేపటి అంశాల
జోడింపుతో కథాసుధాధారలో
బాలల్ని ఓలలాడించి
నవ సమసమాజ నిర్మాతలు కావాలి
బాలల స్వప్నసాకారం చేయాలి.