అల్పాక్షరాలలో అనల్పార్థ రచన.. జీవనలిపి నానీలు
ఆచార్య ఎస్ .రఘు "జీవనలిపి" ఒక సతత హరిత జ్ఞాపకం అంటూ సంబరాజు రవి ప్రకాశ్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
ఎస్ .రఘు పేరు వింటేనే నా మటుకు నాకు ఎప్పుడో చదివిన "జీవనలిపి" గుర్తుకొస్తుంది. "జీవనలిపి" నాణ్యమైన నానీల పంట. అవి రాసినప్పుడు రఘు ఉపాధ్యాయుడుగా ఉండేవాడు. ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో బోధకుడుగా ఉన్నాడు. నా దృష్టిలో మాత్రం ఆయన జే.ఎల్. రఘు. జే.ఎల్ అంటే "జీవనలిపి". వారి జీవనలిపి నానీలు నానీల ప్రక్రియకు ఉత్తమోత్తమ ఉదాహరణలుగా ఆనాడే కనపడ్డాయి. ఇప్పటికీ అవి అలాగే సజీవంగా వెలుగొందుతున్నాయి.
ఆచార్య గోపి నానీలను "నావీ నీవి వెరసి మనవి" అని, 'చిన్నపిల్లలని' నిర్వచించాడు. తన గురువు గోపి ద్వారా నానీల నిర్మాణశైలిని , రూప విశిష్టతను, కవిత్వ సౌందర్యాన్ని అవగాహన చేసుకున్న రఘు తనదైన శైలిలో వాటిని రచించాడు. అవి కవిత్వసుగంధాలను వెదజల్లేలా ఉన్నాయనటంలో అతిశయోక్తి లేదు. నానీలను ఎవరైనా నూతన కవులు రాయదలుచుకుంటే వారు రఘు రాసిన జీవనలిపిని తప్పకుండా చదవాలని నేనంటాను.
పాల్కురికి సోమన 'అల్పాక్షరములలో అనల్పార్ధ రచన' తన కవితా లక్షణమని చెప్పుకున్నాడు. సరిగ్గా అదే లక్షణమే నానీలకు ఉంది. నాలుగు పాదాలలో 40 పాదాల వచన కవితా సారాన్ని ఒదిగేలా రచన చేయడం కత్తి మీద సాము. అనితర సాధ్యమైన నానీల రచనా యజ్ఞాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో రఘు అగ్రేసురుడుగా ఉన్నాడు. ఈ విషయంలో రఘు 'గురువును మించిన శిష్యుడు' . ఈ మాట రఘుకు నచ్చకపోవచ్చు. దానికి ఆయనకున్న గురుభక్తి కారణం.
జీవన లిపి నుండి ఉదాహరణలు ఇవ్వాలంటే ప్రయాసతో కూడిన పని. ఉదాహరణగా ఇవ్వచూపిన నానీని ఎంచుకోవడంలో ఆ ప్రయాస ఉంది. దేనికదే విశిష్టమైన నానీగా విరాజిల్లుతుంటే 'ఈ జీవనలిపి కావ్యంలో ఇదిగో ఇది అందమైనది' అని ఎలా చెప్పగలను? అయినప్పటికీ కొన్ని నానీలను చూపించే ప్రయత్నం చేస్తాను.
నేటి యువతకు సందేశాన్నిచ్చే ఒక నానీ చూడండి.
"కాలయాపన
ఖరీదైన దుబారా!
సమయపాలన
అమూల్య చైతన్యం!!"
గడిచిన సమయాన్ని వెనక్కు తీసుకురాలేము. ఇది ప్రాపంచిక సత్యం. అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ టైంపాస్ పేరుతో అధిక శాతం సమయాన్ని వృధా చేస్తుంటారు. చాలామందిలో సమయపాలన అనే లక్షణమే ఉండదు. అలాంటి వారికి ఉత్తమోత్తమ సందేశం పైన తెలిపిన నానీ. కాలయాపనను ఖరీదైన దుబారా అనడంలో కవి ప్రతిభ కనబడుతోంది. సమయపాలనను అమూల్య చైతన్యంగా పేర్కొనడం ఆయన క్రమశిక్షణను తెలుపుతూ ఉంది.
"అక్కడో జనం పాట
వినిపిస్తుంది
ఎక్కడో
భూకంపం తప్పకా పుడుతుంది"
ఈ నానీ లో రఘు పాటకుండే శక్తిని తెలుపుతున్నాడు. పాటది కదిలించే గుణం. కరకు రాతి గుండెలలో సైతం దయా గుణాన్ని నింపగలదు పాట. అజ్ఞానంలో తూలుతున్న జనంలో విజ్ఞానపు వెలుగులను ప్రసరింప చేయగలదు పాట. జరుగుతున్న అన్యాయాన్ని అలతి అలతి పదాలతో నేరుగా గుండెల్లోకి చొచ్చుకుపోయేటట్లు చేసి విన్నవారిలో కన్నవారిలో చైతన్యాన్ని రగిలించగలదు పాట. మొన్నటి తెలంగాణ ఉద్యమంలో పాట శక్తిని మనమంతా చూశాము. ప్రత్యక్షంగా అనుభవించాం కూడా. అలాంటి జనం పాట లోంచి విప్లవం తప్పకుండా పుడుతుంది. అక్రమార్కుల సామ్రాజ్యం కింద భూకంపం పుడుతుంది. కూకటి వేళ్లతో అది కూలిపోతుంది. ఇంతటి విస్తృతార్థం ఈ నానీలో ఉందని నాకనిపించింది.
"బయట అమావాస్య
ఇంట్లో వెన్నెల
ఆషాడం వెళ్లి
మా ఆవిడ వచ్చింది"
సరిగ్గా ఇప్పుడు కూడా ఆషాడమే. నూతన వధూవరులకు ఇది ఎడబాటు మాసం. ఈ ఎడబాటును రఘు కూడా అనుభవించినట్టున్నాడు. చాలామందికి తప్పని భాగ్యం ఇది. ఆషాడాన్ని అమావాస్యతోను, దాని తర్వాతి కాలాన్ని వెన్నెలతోనూ కవి పోల్చడం సమంజసంగా ఉంది.
"కొత్త దినపత్రిక
వచ్చింది
చూద్దాం! ఏ పార్టీకి
కరపత్రమవుతుందో?"
ఇది ఏ కాలానికైనా మారని సత్యం. పత్రికలు పార్టీలకు పుత్రికలుగా ఉండడాన్ని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నిజానికి రఘు ఈ నానీలను రాసిన 2004 నాటికి ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 'కవయః క్రాంతదర్శః'అన్నమాట అందరికీ తెలిసిందే. రఘు భవిష్యత్తును ఊహించగలిగాడు. ఇప్పుడున్న పత్రికలన్నీ పార్టీలకు కరపత్రాలుగా ఎంతగా మారిపోయాయో మనందరికీ తెలిసిందే. ప్రజలు పత్రికలను ఏవగించుకునే స్థాయికి వచ్చారంటే వాటి రాతలు ఎంత అధమ స్థాయికి దిగజారాయో చెప్పనక్కర్లేదు.
"నిత్యం
ఎన్నో కథలు చెబుతుంటాడు
వాడి ఊరు
కంచి కాదు గదా!"
ఈ నానీ లో ఒక చమత్కారం ఉంది. కథ పూర్తయిన తర్వాత 'కథ కంచికి మనం ఇంటికి' అని అంటారు. ఆ లోకోక్తిని తీసుకొని రఘు చమత్కార భరితంగా పై నానీని రాశాడు. ఇలాంటి భాషా చమత్కారం మరికొన్ని నానీలలో కూడా ఉంది.
"బాల్యంలో
కప్పగంతుల్లో ఘనుడు
అందుకే
రాజకీయుడయ్యాడు"
"కాలి మీద
ఎర్ర చీమ
శివుడాజ్ఞ కోసం
ఎదురుచూస్తుందా?"
ఇంకొక నానీని పేర్కొని ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇది జీవనలిపి నానీల సంపుటిలో మొదటిది.
"కొండమీద
ఆ గుడి చిన్నదే
కానీ
భక్తుడి భావం కొండంత!"
నానీల కవితా ప్రపంచంలో రఘు రచించిన జీవనలిపి చిన్న పుస్తకమే కావచ్చు. కానీ దానిని చదివిన నాలాంటి పాఠకుడి భావం మాత్రం ఎప్పటికీ కొండంతలా ఉంటుంది. ఇది ఆరిపోని తడి. ఒక సతత హరిత జ్ఞాపకం. కాలంతో పాటు నడిచే ఇలాంటి నానీలను రచించిన ఆచార్య రఘుకు అభినందనలు.