Asianet News TeluguAsianet News Telugu

తడి ఆరని కవిత్వం - మంచు పూల వెన్నెల

తడవడం బావుంటుంది....! నీళ్ళలోనైన...కవిత్యంలోనైన అంటూ నూతన అభివ్యక్తిని వ్యక్తీకరిస్తున్న యువకవి బెల్లంకొండ రవికాంత్ కవితా సంపుటి  "మంచు పూల వెన్నెల " పైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ఈ. వెంకటేష్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
 

review on bellamkonda ravikanth manchu poola vennela poetry book
Author
Hyderabad, First Published May 22, 2022, 10:24 AM IST

చరిత్రను చదివే ముందు చరిత్రకారుడిని చదవమన్నాడు ఇ.హెచ్.కార్.  అలాగే కవిత్వం చదివే ముందు కవిని చదవాలి. కవిని చదివేముందు కవికాలం నాటి సామాజికతను చదవాలి. అప్పుడు ఏ కవి కవిత్వాన్నైన విశ్లేషించుకోవడానికి ఒక నిర్ణయానికి రావడానికి వీలు ఏర్పడుతుంది.  సాధారణంగా పాఠకుడు కవిత్వాన్ని కేవలం కవిత్వం కోసమే చదవడు.  కవి తన కవిత్వంలో ఏమి చెప్పాడో, ఎలా చెప్పాడో, ఎందుకు చెప్పాడో అర్థం చేసుకునేందుకు చదువుతాడు.  "కవిత్వమంతా దాని లోతైన స్థాయిల్లో ఒక నిర్దిష్టమైన చారిత్రక విభాత సంధ్యల్లో రచయిత రూపొంది చైతన్యాన్ని పొంది వ్యక్తికరిస్తాడు" అని స్టాన్ స్మిత్ చెప్పిన అంశాలు యువకవి "బెల్లంకొండ రవికాంత్" కు సరిగ్గా సరిపోతాయి.

బెల్లంకొండ రవికాంత్ మృధుస్వభావి.  కాస్త మొహమాటస్తుడు. ఈయన తాజాగా వెలువరించిన కవితా సంకలనం "మంచుపూల వెన్నెల".  ఇందులో 30 కవితలు ఉన్నాయి.  వాస్తు రీత్యా విలక్షణత ఈ కవితల సుగుణం.  రచయిత శైలి మృదుమధురంగా ఉంటుంది.  విడవకుండ చదివించే నైజం ఈ కవితలలో ఉంది.  ఇందులోని కవిత్వం ప్రధానంగా బాల్యం, జీవితం, ఉద్వేగం, తత్వం, ఏకాంతంతో ముడిపడి ఉన్నాయి.

ప్రస్తుత విద్యావ్యవస్థలో పరీక్షలు ఒక నరకాన్ని తలిపిస్తున్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.  ఈ పరిస్థితిని గమనించిన కవి పరీక్షల తీరుతెన్నులను, వాటి లోటుపాట్లను "కాపలా" అను కవితలో సమర్థంగా వ్యక్తీకరించాడు.

భూపాల రాగం భూపాల రాగం
ఈ మూడు గంటలు గడుయారంలో క్షణాలకు ముళ్ళు మొలుచుకొస్తాయ్ / గది మొత్తానికి నేనొక్కడినే చక్రవర్తిని / కాపలా కు....క్క....ని కూడ....!  / మనిషిని మనిషే నమ్మకూడదనే సిద్దాంతాన్ని వాడికిక్కడి నుంచే అలవాటు చేస్తున్న / నా ముఖం మీద ఎవడన్న ఖాడ్రించి ఉమ్మితే బాగుండు"  అని వ్యవస్థ వైఫల్యాన్ని ఆత్మాశ్రయం చేసుకుంటూ ప్రశ్నిస్తాడు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు యూనివర్సిటీలలో ఇంగ్లీషు రాక పడుతున్న ఇబ్బందుల్ని రవికాంత్ శక్తివంతంగా అక్షరీకరించాడు -   "అంతా ఆంగ్లమే" అను కవితలో.  ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ ఇప్పుడు తప్పని సరి అవసరం. ఈ కవితలో తెలుగు భాష పట్ల మమకారం వెల్లడిస్తున్నాడు.

"అన్నీ వదిలేశాక ఇంకా తెలుగుతో పనేముంది  / ఇక్కడ నవ్వినా ఏడ్చినా.....అంతా ఆంగ్లమే"  ఇలా సాగుతుంది కవిత.... నాకెవరన్నా ఆంగ్లం నేర్పండయ్యా.....!  /నావాళ్ళ మధ్యే నేను అపరిచితుడనైతున్నాను  - అని రవికాంత్ తెలుగు మీద ప్రేమను చంపుకోలేక అటు ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడే విద్యార్థుల భాధలను కవిత్వీకరిస్తున్నాడు.

ఆర్థిక సరళీకృత విధనాల వల్ల "మొబైల్ విప్లవం" బయలుదేరింది.  సెల్ పోన్ లు వచ్చిన తరువాత మనుషుల మధ్య దూరం పెరగసాగింది.  మనుసులు విప్పి మాట్లాడటం లేదు.  ఉత్తరం ఎప్పుడో ఉత్తర దిక్కుకు పారిపోయింది.  "సెల్ ఫోన్ పలకరింతలు" ఎక్కువయ్యాయి.  దీనిని చిత్రిస్తూ  కవి అభివృద్ది మాటున మానవ సంబంధాలు ఎలా చిధ్రం అవుతున్నాయో "ఎస్సెమ్మెస్" కవితలో ప్రతిభావంతంగా వ్యక్తీకరించారు.

ఏ రంగుల ప్రపంచంలోనో విహరించే నేను  / నా మాటల యత్రం శబ్దానికి ఉలిక్కిపడి మేల్కొంటాను /  సంకేతాల నందు కోవడంలో రాత్రిని మించిన జాణ లేదు -  ఇలా కవితను ఎత్తుకొని హృదయంతో మాట్లాడుకోవాలని అంటాడు.  తుషారమంతా అమాయకంగా ఇక హృదయంతో మట్లాడు కుందాం  / ఒక అందమైన స్వేచ్ఛ భావ ప్రపంచంలోకి ఎగిరిపోదాం  - అంటూ కవితను ముగిస్తాడు.  రచయితకు బాల్యం పట్ల మమకారం ఉంది. చిన్నప్పటి స్నేహాలను, దొంగిలించిన గోలీలను "వరదపూలు" కవితలో చూపిస్తాడు.  తడవడం బావుంటుంది....! నీళ్ళలోనైన...కవిత్యంలోనైన అంటూ నూతన అభివ్యక్తిని వ్యక్తీకరిస్తున్నాడు.

ఈ సంపుటిలో ఉత్తమ కవిత  " పుట్టిల్లు" .  వస్తు రీత్యా, శిల్ప రీత్యా కొత్త పుంతలు తొక్కిన కవిత.

అమ్మ వెళతానంటుంది /  ఇష్టం లేని బల్లోకి పిల్లాడిని పంపిస్తే  / అక్కడ వాడు మారాం చేసినట్టు  / అమ్మ తన పుట్టింటికి వెళతానంటుంది. ...................... అన్ని క్షణాలు మాకోసం త్యాగం చేసి  / చివరికిలా మిగిలిపోయిన అమ్మ ఋణాన్నెలా తీర్చుకోవడం / అమ్మకు నాన్ననై పుడితే తప్ప ....!

మొత్తానికి బెల్లంకొండ రవికాంత్ "మంచుపూల వెన్నెల" మన హృదయాంతరాల్ని తాకుతూ మంచుపూల వెన్నెల్లో తడిపేస్తుంది.  ప్రతి ఒక్కరు చదవవలసిన మంచి కవితా సంపుటి ఇది.

ప్రతులకు:  ఎ-26 ,  యూనివర్సిటీ ప్యాకల్టీ క్వార్టర్స్ , యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ,  గచ్చిబౌలి ,  హైదరాబాద్.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios