Asianet News TeluguAsianet News Telugu

అమృతాన్ని కురిపించిన ఒక బాల్యం జ్ఞాపకాలు

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ తన చిన్ననాటి జ్ఞాపకాలతో రచించిన 'అమ్మా నాన్న' పుస్తక ఆవిష్కరణ రేపు సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా విశాఖపట్నం నుండి డా. కె.జి. వేణు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :

Retired High Court judge Justice B. Chandrakumar's book 'Amma Nanna' - bsb
Author
First Published Jun 24, 2023, 11:55 AM IST

ప్రతి మనిషికి జ్ఞాపకాలు ఉంటాయి. అక్షరాలు వాటికి తోరణాలను నిర్మించినప్పుడు జీవితంలోని సంఘటనలు, సన్నివేశాలు, సందర్భాలు గొంతులు సవరించుకుని గుండెలోపలి నాళాలలోని సంగతులకు స్వరకల్పన చేసి, సామూహిక బృందగానాలకు సన్నాహాలను సిద్ధం చేసుకుంటాయి. వాస్తవాల చిత్రాలను గీస్తూ కలం విదిలించిన పదాలు, కదంత్రొక్కుతూ  పాఠకుడితో కరచాలనం చేస్తాయి. మనిషి నేర్చుకోవాలనుకునే తపనకు, పాఠశాలలుగా మారే పేజీలన్ని ఉపాధ్యాయుడి పాత్రను సమర్ధవంతంగా పోషిస్తాయి. ఒక ప్రయోజనాన్ని చివరిదాకా మోసుకొచ్చిన రచన, నీటిమీది రాతల్లా కాకుండా  కలకాలం నిలిచే శిలాక్షరాల సరసన నిలిచిపోతుంది. ఈ సర్వ సులక్షణాలను సంపూర్ణంగా కలిగిన పుస్తకం, జస్టిస్ బి. చంద్రకుమార్ తన చిన్ననాటి జ్ఞాపకాలతో రచించిన 'అమ్మా నాన్న' పుస్తకం.

గతంలో జస్టిస్ చంద్రకుమార్ అద్భుతమైన అనేక పుస్తకాలను రచించారు. ఆ వరుసలో ఇప్పుడు ఆణిముత్యంలాంటి 'అమ్మా నాన్న' అనే పుస్తకాన్ని వెలువరించారు. ఆయన ఈ పుస్తకాన్ని రాయటం అంటే, శ్రావణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టి మోసుకెళ్లిన దృశ్యాలతో సమానం. అమ్మ కడుపున పుట్టినందుకు ఆ తల్లిని తన అక్షరాలతో నిలువునా పాలాభిషేకం చేసిన గొప్ప సందర్భం ఇది. నాన్న తనను భుజాల మీద జాతరలో మోసినందుకు కృతజ్ఞతగా,  అలసిపోయిన నాన్నకు ఏకంగా ఆకాశాన్ని విసనకర్రగా మార్చి,  విసిరిన సందర్భాన్ని గుర్తుచేస్తున్న పుస్తకం 'అమ్మా నాన్న'.  ఈ పుస్తకంలో అక్షరాలు ఉండవు. అన్నీ జస్టిస్ చంద్రకుమార్ అనుభవాలే. ఇందులో పేజీలు ఉండవు. అన్నీ మానవసంబంధాల ప్రేమలే. పుస్తకం నిండా తెలంగాణ గ్రామీణ అస్తిత్వపు సువాసన, పాఠకులతో నేరుగా శాశ్వత సహవాసం చేస్తుంది. గ్రామాలలో వరుసలతో వినిపించే పిలుపులు వాకిళ్లుగా మారిపోయి  మానవత్వపు మందిరాలకు ద్వారాలుగా మారడం 'అమ్మా నాన్న' పుస్తకంలో మనం చూడవచ్చు.

ఈ పుస్తకానికి 'అమ్మా నాన్న' అనే పేరుతో పాటుగా - నా చిన్ననాటి జ్ఞాపకాలు - అంటూ ట్యాగ్ కూడా ఉంది. వాస్తవానికి ఈ పుస్తకంలో ఉన్నవి చిన్ననాటి జ్ఞాపకాలు కాదు. తరతరాలకు అవసరమైన అద్భుతమైన జ్ఞానసంపదలు. మనిషిని మహామనిషిగా తీర్చిదిద్దే గొప్ప పరికరాలు. వెరసి జస్టిస్ చంద్రకుమార్ జీవితాన్ని ఒక గొప్ప అందమైన శిల్పంగా తీర్చిదిద్దడానికి ఆ అమ్మా నాన్నలు పడిన కష్టం తాలూకు చెమట చుక్కల సమూహాలే ఈ జ్ఞాపకాలు. ఒకరకంగా దీనిని జస్టిస్ చంద్రకుమార్ స్వీయచరిత్ర అంటున్నారు.  ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన చరిత్ర కాదు. ఒక ప్రాంతానికి చెందిన చరిత్ర. ఒక కాలానికి చెందిన చరిత్ర. ఒక సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన చరిత్ర. పేదరికాన్ని జయించిన ఒక దృఢసంకల్పం ఎంత గొప్పదో తెలియజేసే చరిత్ర ఇది.

ఈ పుస్తకంలో ప్రధానమైన పాత్రలు  జస్టిస్ చంద్రకుమార్ తండ్రి రామచందర్, తల్లి శ్రీమతి భాగీరతి బాయి. తండ్రి రామచందర్ ను మహోన్నత వ్యక్తిగా నిలబెట్టిన సంఘటనలు కోకొల్లలుగా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఆయన గొప్ప స్వతంత్రభావాలు కలిగిన వ్యక్తి. తన పెళ్లి విషయంలో తండ్రి నిర్ణయాన్ని విభేదించి  మానవతా విలువలను గౌరవిస్తూ  ఆదర్శవంతమైన ఆలోచనలతో వివాహం చేసుకుంటారు. ఫలితంగా 100 ఎకరాల ఆస్తి కలిగిన కుటుంబంనుంచి  కట్టుబట్టలతో బయటికి వస్తారు. సరైన ఉద్యోగం దొరక్క  పేదరికాన్ని అనుభవించినా,  పూటకు గంజి మాత్రమే దొరికే రోజులు ఎదురైనా, నీతి నిజాయితీలకు ఎదురులేని మనిషిలా నిలిచారు.

ఏ.ఎస్ఐ ఉద్యోగానికి ఎంపిక కాబడి, శిక్షణకూడా పూర్తి అయ్యాక, ఆఖరిసారిగా ఎస్.పి. ఇంటర్యూలో - గతంలో రామ్ చందర్ నేతాజీ సైన్యంలో వాలంటరీగా పనిచేశారని, తెలంగాణలో జరిగిన రజాకార్ల వ్యతిరేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని, ఆ కారణాలచేత ఆ ఉద్యోగానికి అర్హత కోల్పోయారని ప్రకటిస్తారు. అందుకు ఆయన ఏ మాత్రం బాధపడలేదు. ఉద్యోగం రానందుకు వాళ్ళు చూపించిన కారణాలవల్ల తాను పాల్గొన్న ఉద్యమాలకు, పోరాటాలకు విలువ అమాంతం పెరిగిందని సంతోషపడతారు. ఆ తరువాత ఉపాధ్యాయుడిగా స్థిరపడి, దేశానికి అవసరమైన పౌరులను తయారుచేయడంలో ఉత్తమ ఉపాధ్యాయుడి పాత్రను చాలా సమర్థవంతంగా పోషిస్తారు.

ఒక  ఇల్లాలుగా పరిపూర్ణమైన బాధ్యతను నిర్వర్తించిన వనిత జస్టిస్ చంద్రకుమార్ తల్లి భాగీరతి బాయి. ఆమెకు జాలిగుణం ఎక్కువ. ఆకలితో శత్రువు ఇంటికి వచ్చినా, సంతృప్తిగా భోజనం వడ్డించేతత్వం ఆమెది. సరుకులు లేక ఆకలితో అల్లాడే కుటుంబాలకు ఇంట్లోని సరుకులు అందజేసి సహాయపడేవారు. ఎందరో పేదపిల్లలకు పుస్తకాలతో పాటు, రోజూ భోజనసదుపాయం కల్పించి, ఆదుకున్న మహాతల్లి ఆమె. భర్త ఆదర్శాలకు అడుగడుగునా తన సహకారాన్ని అందజేస్తూ వచ్చిన ఉత్తమ ఇల్లాలు ఆమె. చేయిసాచి ఎవరు ఇంటికివచ్చి అడిగినా, లేదనుకుండా  ఆదరించిన అపురూపమైన మహాగుణం ఆమెది.

రామచందర్ కు ఉపాధ్యాయ ఉద్యోగం దొరికిన సమయంలోనే జస్టిస్ చంద్రకుమార్ పుట్టారు. ఎవరైనా తమ కొడుకు గొప్ప ధనవంతుడు కావాలని కోరుకుంటారు. చంద్రకుమార్  తల్లిదండ్రులు కోరుకున్నది ఒక్కటే. తమకు పుట్టిన బిడ్డ మానవత్వానికి ప్రతినిధిగా నిలబడితే చాలు, కరెన్సీ నోట్లను సంపాదించడం కాదు, కష్టాల్లో ఉన్న పేదల కన్నీళ్లను తుడిచే చేతులుగా మా బిడ్డ మారితే చాలనుకున్నారు. అందుకే పుట్టిన బిడ్డను కులం,  మతం, వర్గం, వర్ణం... ఈ అంటురోగాలకు దూరంగా ఉంచి పెంచారు. మనుషుల్ని మనుషులుగా ప్రేమించే అస్తిత్వాన్ని ఆస్తులుగా రాసి ఇచ్చారు.  స్నేహానికి చిరునామాగామారే చిరునవ్వును శాశ్వత  కానుకగా ఇచ్చారు. దయకు దారులు చూపించినట్లే, ధైర్యానికి సింహం జూలును ఏకంగా తమకు పుట్టిన బిడ్డకు అంగవస్త్రంగా తొడిగారు.

జస్టిస్ చంద్రకుమార్ కూడా తల్లిదండ్రుల ఆశయాలను తన ఊపిరిగా మార్చుకుని పెరిగారు. న్యాయశాస్త్రం పట్టాను పుచ్చుకున్న తరువాత, 'నా ఊపిరితిత్తుల్లో గాలి ఆడినంత కాలం నా 'లా' పట్టా పేదలకే అంకితం...' అంటూ మనస్సాక్షికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అందరిచేత ప్రశంసలు పొందారు. అంతేకాదు చేతిలోని 'లా' పట్టాను కర్రగా నిలబెట్టి న్యాయం అనే జెండాను ఆకాశం ఎత్తులో ఎగరవేసిన న్యాయ కోవిదుడుగా కీర్తించబడ్డారు. పేదల భూముల్ని ఎక్కడ ఎవరు ఆక్రమించినా, పోరాటానికి తాను సిద్ధమయ్యేవారు.

అమాయక గ్రామప్రజల్ని నక్సలైట్లన్న అనుమానంతో పోలీసులు నిర్బంధించినప్పుడు అది అన్యాయం అని నిరూపించి ఆ ప్రజలకు అండగా నిలిచిన మానవతావాది జస్టిస్ చంద్రకుమార్. మోసపోయిన ఎంతోమంది గిరిజన కుటుంబాలకు న్యాయం అందేలా కృషిచేసిన కార్యశూరులు చంద్రకుమార్. కులాంతర వివాహానికి,  స్టేజి వివాహానికి తల్లిదండ్రులను ఒప్పించి, ఆదర్శ వివాహం చేసుకున్నారు. తన జీవితంలోని ప్రతిఅంశం మీద తన తల్లిదండ్రుల ప్రభావం ఉందని గర్వంగా చెప్పుకునే మాటను రుజువుచేస్తూ ఆయన రాసిన పుస్తకమే 'అమ్మా నాన్న'.

ఎక్కడైనా తలుపులు తెరిస్తే ఇల్లు మనకు కనిపిస్తుంది. ఈ పుస్తకంలోని పేజీలు తెరిస్తే నేరుగా మనకు మన తల్లి వొడి కనిపిస్తుంది. నాన్న పాలనలో మనం పెరిగిన రోజులు, మన తలపాగాలై మెరుస్తూ మన ముందు వాలిపోతాయి. అడుగడుగునా ప్రేరణను కలిగించే పందిళ్లను విస్తారంగా కలిగిన ఈ పుస్తకాన్ని అందించిన రచయిత జస్టిస్ చంద్రకుమార్ ఎంతైనా అభినందనీయులు.

Follow Us:
Download App:
  • android
  • ios