“అమ్మేకదా ఎక్కడ వోతదనుకున్న
ఇయ్యాల నా భుజం మీదనే వాలి
ఒడ్డులేని వాగు పక్కన చేరి
బూడిదకుప్పై కొట్టుకుపోయింది.....
ఎవరో అంటున్నరు 
ఒక్క పండుటాకు రాలితే 
చెట్టేమన్నా పడిపోతదా అని...
అమ్మ
ఉత్త పండుటాకేనా...?!”---- 
….ఈ కవితా పంక్తులను చదివి, ఎద తడవని వారెవరుంటారు? ‘పండుటాకు’ అన్న ఈ ఖంఢిక, ఇటీవలే వెలువడిన, ‘శిలాఫలకం’ అన్న కవితా సంపుటి లోని పంక్తులు. మొన్నటి సిరి కోన సాహిత్యోత్సవంలో తన తొలి కవితా సంపుటి ‘నిక్వణం’కు రుక్మిణమ్మగంగిశెట్టి స్ఫూర్తి అవార్డును అందుకున్న దేవనపల్లి వీణావాణి గారి రచన!

పాంచభౌతికమైన జీవితంలో, వేదనో, ఆనందమో కలిగినపుడు, శ్వాసించేది కవిత్వాన్నే! కను కొలకులలో మెరిసే కన్నీటి చుక్కలా, వేళ్ళ కొసలనుండి జాలువారే అక్షరాల నునులేత చివురుల మెత్తందనంలా, అంతటా వ్యాపించి, అందరినీ స్పందింపజేసేది కవిత్వం. ప్రకృతితో స్నేహం చేస్తూ, ఆకాశంలోని చుక్కలను లెక్కిస్తూ,  ఆరణ్యక వృక్షాలను అతిథులుగా భావిస్తూ, వాటిమధ్య సేదతీరుతూ, జీవితాన్ని నిత్యం పండుగలా గడిపేసుకుంటున్న కవయిత్రి అందించిన ఈ కవిత్వం, ప్రాకృతిక సౌందర్యంతో తులతూగుతున్న అటువంటి అచ్చమైన కవిత్వమే!

“ఒక సంధికాలపు పదును, కాళ్లని కోస్తుండగా,  ఎటువైపు నిలబడాలని, నాలో నేనే గింజుకున్నపుడు, మౌనంగా ఉండలేక పెకలించుకున్న విత్తనంలా, మగ్గిన ఒక మాట రాలిపడింది.” అంటారు కవయిత్రి.  మనసు పడిన వేదనలోంచి, ఏమీ చేయలేని నిస్సహాయమైన  మూగ ఆవేదనలోంచి, మనసును కలిచివేసి, అక్కడా మౌనంగా ఉండలేక, రాలిపడిన విత్తనాలే యీ శిలాఫలకంలోని కవితలన్నీ! అయితే విత్తనాలుగానే ఉండిపోక,  మొలకెత్తి, మారాకు తొడిగి, ఎదిగి, విస్తరించి, ఆకాశమంతటా వ్యాపించి, మనలను ప్రశ్నిస్తూంది. నిలదీస్తోంది. ఓదార్చుతుంది. ప్రకృతితో స్నేహం చేయమంటూంది. కాళ్ళక్రింద నేలను త్రవ్వుకున్నట్లు, మనకాళ్లని మనమే నరికి వేసుకుంటున్నట్లు, బాధ్యతా రహితంగా ఉండక, ప్రకృతిపట్ల,  ప్రకృతిలో భాగమైన చరాచర జీవరాశులపట్ల, స్నేహంతో మసలమంటుంది. ఉపదేశాత్మకంగా చెప్పడం గాక, శిథిలమవుతున్న ప్రకృతిని,  మానవ సంస్కృతిని, మానవ సంబంధాలను ఉదాహరణంగా చూపి, జాగ్రత్త పడమంటుంది. సృష్టిలోని ప్రతిజీవి, తనకు అవసర మైనంత వరకే, ప్రకృతినుండి సేకరిస్తుంటే, మనిషి మాత్రం, ప్రకృతిని విచ్ఛేదపరచడం ఎంతవరకు సబబు?,అని ప్రశ్నిస్తుంది. 
 
“ఒక్క మొలక కూడా తలెత్తకుండా/కప్పుకున్న గచ్చుదుప్పట్ల నుంచి/సహచర మృణ్మయదేహాన్ని /తడపలేక విషణ్ణమయి/ఆమె వెళ్లిపోతోంది ...”అంటూ, తన చినుకులతో జీవామృతాన్ని కురిపించిన వాన తల్లి, మనిషి చేసిన తప్పిదాలకు చివరి కన్నీటి బొట్టై  వెళ్లిపోతోంది అంటూ...తన భవిష్యత్తరాన్ని మరిచిపోతున్న మనిషిని ఆలోచించమంటుంది. 

 అంతర్లోకాల అలజడిని, లోతైన సంవేదనల్ని వ్యక్త పరచేదే కవిత్వం. అనుకుంటే, ఈ పుస్తకం అచ్చమైన కవిత్వంతో కూడుకున్నది అని అంగీకరిస్తాం. అంతేగాదు, జీవన తాత్వికతను కూడా చెప్పకనే చెబుతుంది. టెర్మినేటెడ్ విత్తనాల గురించి చెబుతూ, “ఋతువుకోసారి, రైతు మరణిస్తుంటాడు/ యుగాల ధారమోసిన విత్తనం వంథ్యమై/అవతరిస్తుంది/ మనిషి...అంతరిస్తాడు ”  అంటుంది. సముద్రం గురించి చెబుతూ, ఒడ్డున నడుస్తున్న మన పాదాల గుర్తుల్ని, చెరిపేస్తూ. మన జీవన అల్పత్వాన్ని, తన జీవత్వాన్ని చూపే సముద్రం, ఒకేచోట ఉన్నట్లు కనిపించినా, ‘ప్రతివానచినుకులో, ప్రతి కణంలో, రెప్పచాటు ఉప్పుకయ్యల్లో,తడి తడి గుండెలో, నిజానికి సృష్టి అంతటా వ్యాపించి ఉంది’,,,,అంటూ , ప్రకృతి ముందు మనిషి జీవనమెంత అల్పమో చెబుతుంది. “అమ్మపొత్తిలి  లేక, నాన్న గొడుగులేక, మొలకగా మొదలై మోడువారేదాక ఒంటరిపోరాటం చేస్తాయి” అంటూ, నర్సరీ మొక్కలపట్ల బాధపడే, ఈ పుస్తకం, ‘బడిపిల్లల’ గురించి, ‘మల్లెమొగ్గలు వాళ్ళు, పిల్లకలువలు, గ్రీష్మవనాల తొలి చిగుళ్లు’ అంటూ, ‘పరనిందలూ, పల్లేరు కాయలు ఏరలేరు కనుకనే, ముళ్లు మొలవని వెలుగుతీగెలై పోగలరు వాళ్ళు’ అనడం, ఎంత అందమైన ఇమేజరీలు! 

కూలిపోనున్న వంతెన మీద నడవాల్సి వచ్చినపుడు, ‘కడగబడిన హృదయం/లోచూపును అలుముకుంది/.....వంతెన కూలలేదు/ నడకనేర్పింది, అంతే(పు.51)అనడం,  ‘అంతర్ముఖీనులమైనపుడు, మన ఆలోచనలను, కష్టాలను, సానుకూలదృక్పథంతో ఎలా సాదువుగా మలుచుకోవచ్చో చెబుతుంది.  కూలితాతను, కలలబరువు తెలియని వాడు, ఈర్ష్యాద్వేషాలూ, సడిలేని మోసాలు ఎరుగనివాడు, దేనినీ కలుపుగా గుర్తించని అడవిమొక్కలా  ఎదిగినవాడు ....అంటూ, ‘అతడు వానచినుకు/ కంచెకట్టుకోవడం తెలియని నేల/...నిజంగా అతనే జీవించడం తెలిసిన వాడు’ అనడం, కల్మషం లేకుండా, జీవవైవిధ్యంతో (bio - diversity)కలిసి బ్రతకడం లోని స్వచ్ఛందతను చెబుతుంది...

కవిత్వానికి కొలతలు ఏవీ లేవు, మనిషిని, సమాజాన్ని మరువనంతవరకు....ఈ కవితలలో నున్న మరో సుగుణం, ప్రకృతిని కూడా మరువకపోవడం. ఈ లక్షణమే, ఈ కవితలకు మార్మికతను అద్దాయి. అందుకే, సముద్రం నుంచైనా, కూలీతాత  నుంచైనా జీవితాన్ని దర్శింపజేస్తాయి. వడగాలికి నీరసించి, వానపడగానే పచ్చగా నవ్వుతూ, పక్షం రోజుల్లో, పురుగులవలన, జల్లెడలా మారిన ఆకులు, పక్షులు తినేయగా మిగిలిన పురుగులు, సీతాకోక చిలుకలుగా మారడం, ఆగస్టు వానలకు, నిండుచూలాలిలా, వేలాడుతున్న పిందెలు, కాయలతో చెట్టూ....మళ్ళీ, ఈ క్రమం ... అంటూ (దొండపందిరి.పుటలు..45-47) ముడుచుకున్నమనం,  చెట్టు నుంచి జీవన కళను నేర్చుకోవచ్చునని చెబుతాయి.
తన కవిత్వం  గురించి, ‘కాళ్లకు గుచ్చుకున్న ముళ్లు, ప్రేమకూర్చిన చదరంగపు గళ్లు’ అని చెప్పుకున్న వీణావాణి గారు, తమ కవితలను ఆర్ద్రతతో నింపారు..”అరచేతుల్లో విద్యమాత్రమే అక్షయ పాత్ర... అభిమానాన్ని నిలబెట్టే వెన్నెముక..”అంటూ జీవన సూత్రాన్ని చెప్పగలిగారు.

 “మున్నెన్నడో,...అంటే ఎన్ని ఏళ్లోలెక్క తెలియదు , కానీ/ ఎంత సంబరం అది!” అని ఆనాటి వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ, “చుట్టూ లేచిన పొదలు, /ఆకుపచ్చ దుప్పటి చుట్టాయి /మట్టి మోకాళ్ళు కప్పింది /శునకాల లఘుశంక వెక్కిరిస్తుంది....... /ఏకాకిలా ఇలా యెన్నాళ్లు/ మూలగవలసి ఉందో...!” అని బాధపడుతున్న శిలాఫలకం, నాయకుల ఆరంభశూరత్వానికి, వారి అలసత్వానికి కూడా ప్రతీకే అన్న విషయాన్ని చెబుతారు. 

గిరిగీసుకున్న తోటల్లో గాజుపువ్వుల్లా బ్రతుకుతున్న మనుష్యులమధ్య, ‘చిమ్మిన దుఃఖజలాల్లో మునిగిన మెదడు/ పట్టుకోసం పరితపిస్తుంది ...అంటూ 
ఇక
కృష్ణుడి ఏ మంత్రంతోనో
నాతోనేను యుద్ధబోధచేసుకోవాలి
బుద్ధుడి ఏ మాటతోనో 
ఆత్మగీతికి జ్ఞానగంధం అద్దుకోవాలి” (గాజుపూలు..పుట.61)అంటూ తమను తాము స్వాంతన పరచుకుంటారు...
ప్రకృతీ, ప్రకృతిలో భాగమైన మనిషీ, మానవ సంబంధాలూ, సంస్కృతీ, ప్రకృతి నుండి  మనిషి నేర్చుకోగలిగిన జీవనసారం మొదలైనవాటితో నిండిన ఈ ‘శిలాఫలకం’ బాహ్య జగత్తుకు సంబంధించిన సంవేదనలనే గాక, ఆంతరిక కల్లోలాలకు కూడా అద్దం పడుతూంది అనడం, అక్షర సత్యం. 

“శిలాఫలకం”
దేవనపల్లి వీణావాణి
సెల్:09951331122
ప్రతులకు:24-3-29, Darga Kazipet, Hanamkonda, Warangal, Telangana-506003

- రాయదుర్గం విజయలక్ష్మి