సామాజిక పరిస్థితులపై సామాన్య పరుగు: సుషుప్తి నుంచి
‘సుషుప్తి నుంచి’ అనే పేరు చూడగానే ఒల్లెరుగని నిద్ర నుండా లేక నిద్రాణమైన సమాజం నుండా అనే సందేహం కలగకమానదు కానీ, పుస్తకం చదివితే ఈ రెండూ కాకుండా ఇంకో అర్థం స్ఫురిస్తుంది.
ఒక పుస్తకం చూడగానే ముందుగా ఆకర్షించేది ముఖ చిత్రం అయితే లోపల ఏముందో చూడాలని ఆసక్తి కలిగించేది ఆ పుస్తకాని పెట్టిన పేరు. ఈ రెండు చూసాక కూడా పుస్తకం లోపలికి వెళ్ధామంటే ఇంకా దేని కోసమో వెతుకుతుంటాయి కళ్ళు ..
‘సుషుప్తి నుంచి’ అనే పేరు చూడగానే ఒల్లెరుగని నిద్ర నుండా లేక నిద్రాణమైన సమాజం నుండా అనే సందేహం కలగకమానదు కానీ, పుస్తకం చదివితే ఈ రెండూ కాకుండా ఇంకో అర్థం స్ఫురిస్తుంది.
నిద్రనుండి మెలకువలోకి అనే అధ్బుతమైన ఆలోచనే కాకుండా తెలియనితనం నుండి ఏదో తెలుస్తున్న తనంలోకి పరిగెత్తుతోన్న గొప్ప పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. కవి తన అంతరాల్లోని అనేకానేక ఆలోచనలను అక్షరాల్లో పొదిగి కవితగా మలిచి హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు. అనేక సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన మామిడి హరికృష్ణగారు తన గురించి తన కవిత్వం గురించి రాస్తూ ఓ దగ్గర ఇలా ప్రస్తావించారు . ఒక కవి ప్రస్తానాన్ని , పరిణామ క్రమాన్ని ఎలా తెలుసుకోవాలి ? ఏ ప్రమాణాల ప్రాతి పదికగా బేరీజువేయాలి అనే ప్రశ్నల పరంపరకు నావల్ల నానుండి, నాతో నాకు దొరికిన సమాధానమే ఈ ‘సుషుప్తి నుంచి’ అంటాడు.
నిజాయితీ, నిబద్దత, స్పృహ,సామాజిక స్పృహ లాంటి బరువైన సూత్రాల జోలికి వెళ్లకుండా , తేలికైన పదాలతోనే బరువైన భావాన్ని కలిగించాడు . తను నిత్యం చూస్తున్న, తను అనుభవిస్తున్న జీవితంలోంచి మొలిచిన ఘటనలు , సంఘటనలను తన, తనవాళ్ళ, మనః ప్రవృత్తులనూ చేదుకొని అలా అలా అలవోకగా అద్భుతమైన శైలిలో రాసుకున్న కవితలే సుషుప్తి నుంచి. ఇవి ఓ కవి రాసిన కవితలు అనుకోవడంకన్నా, ఓ కవితా ప్రేమికుడు చెక్కుకున్న శిలాకవితలు అనుకోవచ్చు . శిలాకవితలు అని ఎందుకు అంటున్నానంటే ఈ పుస్తకం కవి యొక్క స్వదస్తూరితో నిక్షిప్తం చేసుకున్న అరుదైన అద్భుతం.
గతంలో శ్రీ శ్రీ మరియు కొంతమంది కవులు రచయితలు ఇలాంటి ప్రయోగం చేసిన దాఖలాలు ఉన్నా, పుస్తకం అంతా కాకుండా, యేవో రెండూ లేక మూడు కవితలు స్వదస్తూరితో ఉండడం చూశాం . ఒకవేళ అన్ని కవితలతో వచ్చినా ఇప్పటి తరానికిదో బహుమతే అని చెప్పొచ్చు .
స్వదస్తూరి వల్ల ప్రయోజనాలు ఏంటో ఈ కవి స్వయంగా తన మాటలో చెప్పుకున్నారు గనుక ఇక్కడ మళ్ళీ చెప్పడం అప్రస్తుతం .
ఇందులో చేర్చిన 61 కవితలు 1986-89 మధ్య కాలంలో రాసినట్టు కవి చెప్పుకున్నారు. కొన్ని కవితలకు తనే చిత్రాలు గీసినట్టు, చివరగా కొన్ని illustrations అనుబంధంగా పెట్టడం వల్ల కవి మంచి చిత్రకారుడని తెలుస్తుంది
సమాజాన్ని కళ్ళతో కాకుండా మనసుతో రచయితలే చూడగలరని ఈ కవి నిరూపించాడు. కవి తనలోని మనిషిని వివిధ కోణాల్లోంచి సున్నితంగానూ ,సూచనప్రాయంగానూ బహిర్గతం చేశాడనిపిస్తోంది . ఎందుకంటే జీవిత పాఠం అనే మొదటి కవితలో కవి ఒక అద్భుతమైన భవిష్యత్తును కలగన్నాడు .
ఒక మనిషిగా
సాటిమనిషికి
నేనేమీ చేయగలను ?
అని అప్పటికప్పుడే సమాధానాన్ని వెతుక్కున్నారు . ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఎందరో కళాకారులకు తన వంతుగా సహాయం చేయడం చూస్తుంటే అప్పుడెప్పుడో రాసుకున్నట్టుగా కవి తన కవితను ఇప్పుడు నిజం చేసుకున్నారనిపిస్తోంది . కవిత్వానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని బలంగా నమ్మేకవి మామిడి హరికృష్ణ .
సైనిక కవాతు అనే కవితలో
కవాతు జరుగుతోంది
నువ్వూ
నేనూ
అందరం అందులో ఉన్నాం తెల్సా ?
మరో కవితలో
రక్తం ఇంకా పారుతూనే ఉంది
కానీ ,
రక్త స్పర్శ మనకు తెలీటమ్ లేదు . అంటాడు
ఈ రెండు కవితలలో ఒకే పరిస్తితి కనిపిస్తుంది . ఒక ప్రత్యేక పరిస్తితికి స్పందించినదైనా అందులో అద్బుతమైన భావుకత కనిపిస్తుంది .
సమాజ సమస్యలపై ఎంత కరుకుగా కలాన్ని కదిలిస్తాడో , ప్రేమ కవిత్వానికి వచ్చేసరికి అంతకన్న మృదువుగా కవిత్వాన్ని ఒలికిస్తాడు . “భావగీతం-మౌనస్వరం” అనే కవితలో ప్రేమకు సంబంధించిన ఏవో ఆస్పష్టభావనలు అలల మాదిరి మదిలో దోబూచులాడుతూ పద లావణ్యన్ని కోరుకుంటాడు కళ్ళలో, పెదవుల్లో,భంగిమల్లో, నుదిటిలో , సింధూరంలో, చెక్కిళ్లలో, ప్రేయసిని వర్ణించుకుంటాడు. ఇవన్నీ నాకు దక్కితే బావుండుననే స్వార్ధం లేదు కవికి, అందుకే చివరగా అంటాడు
చెవులలో .
ఝంఝామారుతంలా వనిలో అవనిలో ఆమనిలొలుకు నవబాణులు చివరకు ఎవరికి దక్కుతాయో అని ఒక ఆశావాదాన్ని వదిలేశాడు. ఇక్కడ కవి తనతో పాటు చుట్టూ ఉన్నవారికి ఒక అవకాశం ఇచ్చాడు . నాకే కావాలనుకునే ఆ యవ్వన వయసులో కూడా ఒక అద్భుతమైన ప్రేమను పొందే ఆశను పంచాడు. అలాగే ఈనాడు అర్హులైన ఎందరికో ఎంచుకున్న వృత్తిలో అవకాశాలు కల్పిస్తున్నాడు అంటే అప్పటి ఆ కవితకి ఓ ప్రయోజనం చేకూరినట్లైంది .
పదాలు సాదాసీదాగా అనిపించిన కూర్పులో ఉన్న కవి నేర్పు అద్భుతం అందులో భావం అత్యద్భుతం అనిపిస్తుంది .
జనరల్ గా కవులు ,కళాకారులు తమ పేరు మార్చుకోవడమో లేక కొంత కొత్త అర్ధం స్ఫురించేలా ఉన్న పేరును చిన్న చిన్న మార్పులు చేసుకోవడం సహజంగా జరుగుతుంది అలాగే యవ్వనంలో కవిత్వం రాయడం మొదలెట్టాడు.కాబట్టి తన పేరును ‘తపస్వి’ గా కొన్ని కవితలపై చెక్కుకున్నారు .
‘నిశ్శబ్ద నిశీదిలో
ఒంటరి పయనం
ఎక్కడికో అగమ్యగోచరం
‘అర్దరాత్రి’ అనే కవితను మొదలెట్టి ఎక్కడెక్కడో కదల లేకుండా చీకట్లో తిరుగుతూ చివరకు
‘వెనక్కి తిరిగి చూస్తే
అంతా చీకటి
నేనెక్కడికీ చేరుకోలేదన్నట్లుగా! అంటాడు
పుస్తకానికి పెట్టిన ‘సుషుప్తి నుంచి ‘అనే పేరుకు సరిగ్గా సరిపోయే కవిత ఇది . ఎందుకంటే ఈ కవితా నిర్మాణం ఒక కలలా ఉంటుంది . కలలు నిద్రలోనే కదా వస్తాయి .
‘అవలోకన’ కవితలో కవి యొక్క విస్తృత పరిజ్ఞానం కనిపిస్తుంది .
కవికి దీపం తో ఎక్కువ అనుబంధం ఉన్నట్లు కన్పిస్తుంది . దీపం అంటే వెలుగు మాత్రమే కాదు చైతన్యానికి ,జ్ఞానానికి ప్రతీక . కొన్ని సందర్భాల్లో విప్లవానికి జోడిస్తారు అందుకే ఆ పదాన్ని చాలా కవితల్లో దివిటీలా వెలిగించారు.
ఇంకో ఆలోచించే ఆసక్తికరమైన కవిత ‘సుషుప్తి నుంచి చేతనలోకి’ ఇందులో ఒకే ఒక వాక్యం ఓ కవితను తలపిస్తుంది .
‘మన గుండెలు మండటాన్ని నేర్చుకుంటాయ్’ అంటాడు
రేపటి నీ వాళ్ళను మండిస్తాయి
అపుడు సూర్యుడితో పనుండదు
నీవాడు,నావాడు
ప్రతి ఒక్కడూ
సూర్యుడై
ప్రపంచాన్నే జయిస్తారు ! అని ముగిస్తాడు
ఇక్కడ సూర్యుడిని ఒక విప్లవ వీరుడికి ప్రతీకగా చెప్పుకోవచ్చు .
ఈ కవి ఒకే అర్ధాన్నిచ్చే పదాలను వెంటవెంటనే వాడుతుంటాడు .బహుశ గట్టిగా చెప్పాలన్న ఆలోచన అయిఉంటుంది ఉదాహరణకు
స్వేచ్ఛగా , యదేచ్చగా
అమాంతంగా ,ఆసాంతంగా
చెరుగని, తరగని
అనుక్షణం ,ప్రతిక్షణం
ఒక విషయాన్ని ఎదుటి వారి మస్తిష్కం లోకి ఎక్కించాలన్నప్పుడు ఒక పదానికి వాడే అనేక పర్యాయ పదాలను ఉపయోగించడం ఉపన్యాసంలో చూస్తుంటాం . కవి మంచి వక్త కాబట్టి కవితల్లో మనకి అలా కనిపిస్తుంది అనుకోవచ్చు .
మంచీ చెడూ ,నీతి న్యాయం ,చీకటి వెలుతురుల మధ్య మానసిక సంఘర్షణను ప్రతి కవితలో చిత్రించే ప్రయత్నం చేశారు .
మామిడి హరికృష్ణ గారు నిజాయితీ పరులైన అధికారి మాత్రమే కాకుండా నిబద్ధత నిండిన కవి ,చిత్రకారుడు ఇందులోని ప్రతి కవితలో ఆయన వ్యక్తిత్వం తొంగి చూస్తుంది . వీరు తమ అనుభవంనుండి తమదైన భాషలో, అనుభూతిలో, అభివ్యక్తిలో ఆవిష్కరించాలన్న తపన ఈ పుస్తకం నిండా బలంగా కన్పిస్తుంది .
జీవిత పాఠం నుండి ప్రారంభించిన ఈ పుస్తక ప్రస్థానం రైల్వే ఫ్లాట్ మీదుగా సామాన్యుడి తాత్విక జిజ్ఞాసను నెమరేస్తూ , ఎన్నెన్నో ప్రయోగాత్మక మనోరీతుల్ని వివరిస్తూ, పరిణత మార్గాల వైపు పయనిస్తూ ‘సుషుప్తి నుంచి’ చేతనలోకి సాగుతుంది
కొన్ని ప్రేమ,వైరాగ్యాలు
ఇంకొన్ని సమాజ దుఖాలు
వీటి మధ్య నలిగే మనిషి అంతర్మధన ప్రతిమలు ‘సుషుప్తి నుంచి’లో మనల్ని ప్రశ్నిస్తుంటాయి .
- రవీంద్రసూరి నామాల