Asianet News TeluguAsianet News Telugu

రంగరాజు పద్మజ కథ : రెండవ బాల్యం

మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి అసలు సమస్య ఎక్కడుందో, దానికి చికిత్స ఏమిటో  రంగరాజు పద్మజ రాసిన "రెండవ బాల్యం"  కథలో చదవండి

Rangaraju Padmaja Telugu Short Story Rendava Balyam
Author
Hyderabad, First Published Oct 4, 2021, 4:11 PM IST

స్నేహిత తన క్లినిక్ లో ఏదో మెడికల్ జర్నల్  తిరుగేస్తున్నది.  మొబైల్ అదేపనిగా మోగుతోంది. ఎవరో పేషెంట్ తాలూకు వారై ఉంటారని కాసేపు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఈ వ్యాసం చదివిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తానని అనుకుంటుండగా... ఆగకుండా పోన్ రింగ్ అవుతూనే ఉన్నది. లిఫ్ట్ చేసి కాస్త చిరాగ్గా హలో! అనగానే అవతలి వైపు నుండి అర్పిత హలో అన్నది. ఖాళీగా ఉండవు కానీ నేను చెప్పేది కాస్త నిదానంగా విని, సలహా ఇవ్వమని కాస్త బతిమిలాడు తున్నట్లుగా అన్నది అర్పిత.
 
ఒక డాక్టర్ గా నా వంతు"డిమెన్షియా"వ్యాధిగ్రస్తులకు సేవ చేయాలనే తపనతో ముగ్గురు డాక్టర్లం కలిసి డిమెన్షియా, అల్జీమర్స్ రోగులకు , వారికి సహాయంగా ఉండే ( care givers) వారికి అవగాహనా ( awareness) తరగతులను నిర్వహించాలని  నిర్ణయించుకొని కొంత మంది సిబ్బందితో ఒక కార్యాలయం ఏర్పాటు చేశాం. ఆ సెంటర్లోకి అర్పిత తన భర్తను తీసుకొని చాలా దూరం నుండి వచ్చేది. రావడమే కాదు భర్త అల్జీమర్స్  పేషెంట్ అని కనీసం డాక్టర్లకు కూడా తెలియనంతగా సాధారణ వ్యక్తిగా భర్తను తయారు చేసి జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా నచ్చింది. అందుకే  తనకన్నా కాస్త వయసులో పెద్దదైయిన అర్పితతో  స్నేహం చేయాలనిపించింది. ADRSC  సేవా నిలయంలో ఒక మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న రోగి భార్యగా పరిచయమైనా ... ఆ స్నేహం అలాగే బలపడింది.  తీరిక దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాము. ఆమె భర్త  'ఉత్తమ్' ను చురుకుగా  ఉంచేందుకు  శిక్షణ ఇస్తున్నానని గతాన్ని గుర్తు చేసుకుంటున్న డాక్టర్ స్నేహితకు  ఫోన్ లో   'స్నేహా !  ఏమిటి? హలో అని మాట్లాడటం లేదు.. ' అనేసరికి అప్పుడు వాస్తవంలోకి వచ్చింది స్నేహిత.

చెప్పు అర్పితా! ఫోన్ ఎందుకు చేశావు? అనగానే మళ్లీ ఒక గడ్డు సమస్య వచ్చింది. ఉదయం నుండి మా వారు ఆగకుండా గోల చేస్తున్నారు. తనకు మెడిసిన్లో సీట్ వచ్చిందని.... ఫీజు కట్టమని... తను కాలేజీకి వెళ్లి చదువుకుంటానని.... ఆ గోల అంతా ఇంతా కాదు భరించలేనంతగా ఉంది.. ఏం చేయను? అన్నది అర్పిత.

బాపురే!  ఈసారి పెద్ద చిక్కే  తెచ్చారే ? ఏం చేయాలనుకుంటున్నావు?  ఒక డిమెన్షియా పేషెంట్ గా  అనుకుని, అరచి అరిచి ఊరుకుంటాడులే అనుకుంటున్నావా? లేక ఈ ప్రపంచపు కొద్దిరోజుల అతిథికి అతని మనసు కుదుట పడేలా ఏదైనా చేయాలనుకుంటున్నావా ? నీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది అన్నది స్నేహిత.
    
స్నేహితా ! నువ్వు అన్నట్టు నా భర్త ఈ లోకానికి అతికొద్ది రోజుల అతిథి.  ఒక కృత్రిమ మెడికల్ కాలేజీ సెట్టింగ్ వేస్తాను. ఇలాంటి వ్యాధిగ్రస్తులు నీ సెంటర్ లో ఉన్నారు కదా! ఒకరోజు కొరకు వాళ్లను క్లాస్ రూమ్ లో వైద్య విద్యార్థుల వలె కూర్చో పెడదాము.  నువ్వు ఎలాగూ డాక్టర్ కనుక... ఒక క్లాస్ తీసుకున్నట్టు... సెంటర్లో ఏదైతే సమయం వెచ్చిస్తావో... అదే సమయం పాఠాలు చెప్పినట్లు... వాళ్లకు నచ్చే విషయాలు చెప్పుతానంటే ... నేను ఒక క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తాను అన్నది అర్పిత.  డాక్టర్ స్నేహిత సరే అని ఒప్పుకోగానే  ఈ మధ్యనే తమ పక్క పోర్షన్ ఖాళీ అయింది... దాన్లో చకచకా  ఏర్పాటు చేసేందుకు  bedside అసిస్టెంట్ కు తన భర్తను అప్పచెప్పి, పక్కింటి ముందు  అడ్మిషన్ రూమ్ అని ఒక బోర్డు పెట్టి, కొన్ని ఫైల్స్, తన కంప్యూటర్ అన్నీ అచ్చంగా  మెడికల్ కాలేజీలో అడ్మిషన్ రూమువలె తయారుచేసి, ఇంటికి వచ్చి నర్సుకు నువ్వు కాసేపు కౌంటర్లో కూర్చో!  సార్ ను తీసుకొని నేను కాసేపటికి వస్తాను అన్నది అర్పిత.

ఎందుకమ్మా? ఇంత శ్రమ పడుతున్నారు. ఈ ఒక్కరోజు సార్ అలాగే అరచీ .. అరిచీ.. రేపటికి మర్చిపోతారు... అనవసరంగా శ్రమ ఎందుకు? అనగానే ఇలారా! వచ్చి ఇక్కడ కూర్చో! నీకు పేషెంట్ వలె కనిపించే ఇతను సమాజానికి ఎంత సేవ చేసాడో తెలుసా? అతనికి చదువు మీద ఉన్న ఇష్టం, చదువుకోవడానికి సరిపడని పరిస్థితులతో కష్టపడుతూ, ఒక్క డ్రెస్సుతో చదువుకుని ఉన్నత స్థాయికి వచ్చారు. అయినా నేను చెప్తుంటే నీకు అనిపించవచ్చు... అందరూ అలానే పైకి వస్తారని కానీ అలా కాదు... అరకొర సంపాదనలోనే తన వలె చదువు కోసం ఎవరూ బాధపడవద్దనీ,  గ్రామాల నుండి బస్తీకి వచ్చి, గదులు అద్దెకు తీసుకొని,ఫీజులు కట్ట లేక తనవలె చదువుకోవాలని ఉన్నా... చదువుకోలేని వారు ఎందరో ఉంటారనీ... వారి కోసం పల్లెటూర్లకు దగ్గరగా ఉన్న పట్టణంలో పాఠశాల ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుందనీ, పూర్తిగా మూతబడి పోయిన ఒక పాఠశాలను పునరుద్ధరించి, ఎందరో అధికారులతో మాట్లాడి... పోట్లాడి... నిరుద్యోగ ఉపాధ్యాయులను కూర్చుకొని పాఠశాల చక్కగా నడిచే దాకా సగం జీతాలు ఇస్తానని ఒప్పించి... మీ విద్యాబోధనే పెట్టుబడిగా... ఇందులో చదివిన వారికి పైచదువులకి ఫీజులు కట్టకుండా సీట్లు రావాలని, అందుకే  మీరు అదనపు సమయం కేటాయించాలని, ఆ ఉపాధ్యాయులకు ఎంతో ధైర్యం చెప్తూ ఎప్పుడూ పరిస్థితులు ఇలా ఉండవనీ.... విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటే.... వారి ఫీజులతో  మీ జీతాలు పూర్తిగా చెల్లిస్తామని చెబుతూ... వారు అంకితభావంగా పని చేసేలా ప్రోత్సహించి, తరగతి గదులను బాగు చేయించి అలా కష్టపడి మంచి ఉత్తీర్ణత ,పాఠశాల అభివృద్ధిని సాధించారు.

కానీ ఏం లాభం? తిరిగీ అదే సమస్య.... పదో తరగతి పాసైన వారు ఏ పట్టణానికో వెళ్లి చదువుకోవాలి? అసలే కరవు ప్రాంతంగా ఈ తాలూకాను ప్రకటించింది ప్రభుత్వం... వ్యవసాయానికే కాదు... తాగునీటికే సమస్య ఎదుర్కొంటున్న ఆ సమయంలో... తమ పిల్లలను పట్టణానికి పంపించి ఎలా చదివించగలరు? దిగువ మధ్య తరగతివారు. మరలా ఈ పేషెంట్ వలె కనబడుతున్న ఇతనే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి ఇంటర్మీడియట్ తరగతులు నడిపేందుకు అనుమతి తీసుకొచ్చారు.  అనుమతైతే వచ్చింది కానీ, కాలేజీకి కావలసిన వనరులు లేవు .. తరగతి గదులూ లేవు... కాలేజీని ఎలా నిర్వహించడమని, ఆలోచించి ఆ పాఠశాలనే ఉదయం పూట పాఠశాల తరగతులుగా, మధ్యాహ్నం కాలేజీ తరగతులుగా షిఫ్ట్ పద్ధతిలో నిర్వహించాలని, పట్టణంలోని  నిరుద్యోగ పట్టభద్రులను పార్ట్ టైం లెక్చరర్లుగా పని చేయమని ఒప్పించి వారితో ఇంటర్మీడియెట్ తరగతులు ప్రారంభించారు.
   
అధ్యాపకుల అంకితభావం, విద్యార్థుల కృషి అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఇంటర్ లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, మధ్య మధ్యన సమావేశాలు ఏర్పాటు చేసి చదువు ఆవశ్యకత- మనకున్న వనరులు వీటి దృష్టితో ఎలాగో ఓపిక పడితే జీవితాలు మారతాయని... ఎంతో ప్రేరణాత్మకమైన ఉపన్యాసాలు ఇచ్చి , వారందరికీ పిల్లలు ఎంత కష్టపడి అయినా సరే చదువు కోవాలనే ఆలోచనకు మళ్లించారు. ఎంత ఉపన్యాసాలిచ్చినా... కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి పోతే ఏం లాభం? అదే ఎవరిదగ్గరైనా నౌకరికి కుదిరిస్తే  నాలుగు డబ్బులు వస్తాయి... ఈ కరువుకాలంలో ఒక పూట అయినా కడుపునిండా తినవచ్చని పిల్లలను అర్ధాంతరంగా చదువు మానిపించే వారు. మళ్లీ వాళ్లకు దీర్ఘకాలిక ప్రణాళికలో ఎలా లాభపడవచ్చో అని  ఎంతో మంది జీవితాలను ఉదాహరణలుగా చూపించి, వారిని తిరిగి పాఠశాలలకు, కళాశాలలకు వచ్చేటట్లుగా చేసేవారు. దాని కోసం ఇల్లిల్లు తిరిగి వాలెంటరీల సహాయంతో విద్యావశ్యకతను తెలియజేసి చాలా మందిని తిరిగి కళాశాల వైపు నడిచేలా ప్రోత్సహించారు.

 ఇదంతా చాలాకాలానికి ప్రాంతీయ పాలకుల దృష్టిలో పడి నిజమే మన ప్రాంతానికి ఒక కళాశాల రావాలని వారి పలుకుబడితో డిగ్రీ కాలేజీ కూడా ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చింది కూడా "ఈ మీ పేషెంటే". అందుకోసం  ఎందరినో వివిధ రకాల పురప్రముఖులను కూడగట్టుకొని పనులైయ్యేలా చేశారు. మరి ఇప్పుడు చెప్పు!  అతను సమాజానికి చేసిన ఆ కృషి వల్ల ఆయా పాఠశాలలో, కళాశాలలో చదివి, మంచి ఉద్యోగాలు  సంపాదించిన వారు  అతని సేవలు...మరిచిపోతే మరచి పోవచ్చు గాక !!

కానీ జీవిత భాగస్వామినైన  నాతో, పిల్లలతో కూడా అంత సమయం గడపక వందలాది మంది ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం శ్రమించిన అజ్ఞాత వ్యక్తి ఈయనే ! ఇప్పుడు చెప్పు ఇతని కోసం ఆ మాత్రం చేయడం తప్పా? ఒప్పా??

బెడ్ సైడ్ అసిస్టెంట్  తాను ఎందరో రోగుల దగ్గర పని చేశాను.. చాలామంది ఇంటివారే రోగులను ఏవగించుకునే వారినీ చూశాను... కానీ ఎవరూ  ఇలా ఒక రోగిని అతని జీవిత కాలం  సమాజానికి చేసిన  ఉపకారాన్ని తలుస్తూ... రెండవ బాల్యం శాపం కాదని... వారికి వచ్చిన రుగ్మతలు దైవవశాత్తూ వచ్చినవే కాని... వారి దోషం ఏమీ లేదనీ గొప్ప వ్యక్తిత్వం ఉన్న  అతను ఒక చిన్న పిల్లవాడివలె ఇలా ప్రవర్తిస్తూ ఉంటే  అతనితో పరిచయం ఉన్నవారికి  భరించడం కష్టం.

ఇరవైనాలుగు గంటలు నేను మెడికల్ కోర్స్ చేస్తాను... నాకు ఫీజు కట్టమ్మా!   అనిఎంత వేధించినా.  చిన్నపిల్లవాడి మారాము వలే భరిస్తూ... జబ్బు ప్రభావంతో ఇలా చేస్తున్నాడు... అనుకొని ఎంత కష్టపడుతున్నది ఈ అర్పితమ్మ...
  
తాను వచ్చిన కొత్తలో ఒక నర్స్ గా డ్యూటీ చే‌స్తూ... అతను రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఇంతకాలం నిర్లక్ష్యంగా  చూశాను... అనుకొని, తన కళ్ళలో తిరిగిన నీరు అర్పితకు కనిపించకుండా వీల్ చైర్ నెట్టుకుంటూ అవతలకు వెళ్ళింది.

అర్పిత తానే స్వయంగా భర్తకు షేవ్ చేసి, నర్స్  సహాయంతో స్నానం చేయించి,  మంచి డ్రెస్ వేసి, కళ్ళద్దాలు పెట్టి... తదేకంగా చూస్తూ ఈ వయస్సులోనూ... ఈ వ్యాధితోనూ ఎంత అందంగా ఉన్నారు? అనుకొని ఒక నిట్టూర్పు విడిచి, నర్స్ తో సార్ రోజు పట్టుకొని తిరిగే ఆ ఫైల్ ఇలా పట్టుకురా ! అన్నది.

నర్స్ ఆ ఫైల్ తెరచి చూసి అమ్మా! ఇవి సర్టిఫికెట్ల జిరాక్సులు... అన్నది... అవును అందుకే తెమ్మన్నాను.ఒట్టితెల్లని పేపర్లు అతనికిస్తే... అవేమిటో చదువు వస్తుంది కనుక అవేమిటో అతనికి తెలుస్తుంది... కనుక ఆయనకు సబ్ కాన్ షస్ మైండ్ పనిచేస్తున్నది.. అని అంటూండగానే... నర్స్ అమ్మా! అని గట్టిగా అరిచింది. ఏమైంది అంటుంటే..ఇది గోల్డ్ మెడల్ వచ్చిన సర్టిఫికెట్, ఇది రాష్ట్ర స్థాయిలో రెండోర్యాంక్  వచ్చిన కార్డు, ఇది ఇంటర్మీడెయెట్  బోర్డు వారి మెమొకార్డు !  ఎన్ని మార్కులు??? ఎన్ని మార్కులు? అని ఆశ్చర్యంతో రోజూ సార్ ఈ సర్టిఫికెట్లను ఫైల్ లో నుండి తీసి కళ్ళద్దాలు పెట్టుకుని, చదివి గుండెలకానుంచుకొని, కాసేపు అలాగే ఉండి... మళ్లీ జాగ్రత్తగా అవన్నీ ఆ ఫైల్ లో పెడుతుంటే అది జబ్బులో భాగమే అనుకున్నామ్మా!  అన్నది నర్స్.
   
కాదు దానికీ ఒక కథ ఉన్నది.  తాను చదువుకో లేకపోయినా తన కొడుకును మెడిసిన్ చదివించాలని వాడికి ఊహ వచ్చినప్పటినుండి... నువ్వు పెద్ద అయిన  తరువాత ఏమవుతావు? అని వాడిని ప్రశ్నించి ప్రశ్నించీ... డాక్టర్ నవుతాననే సమాధానం కొడుకు నోట విని, విన్నావా? వీడు డాక్టర్ అవుతాడని నాకు చెప్పి తెగ సంబరపడి పోయేవారు. అందుకోసం అహర్నిశలు తాను కష్టపడటమే కాదు, తెల్లవారు జామునే వాడిని లేపడం, చదివించమని చెప్పడం, వాడికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం ఇలాంటి  బాధ్యతలు నాకప్పగించి, తన కల- నా కల రెండు వాడిని వైద్యుడిగా తీర్చిదిద్దడంలోనే గడిపాము. వాడు తండ్రి కోరిక నెరవేర్చాడు. మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. అత్యుత్తమ స్థాయిలో ఫలితాలు సాధించడం అందరు కలగనే ఆక్స్ఫర్డ్ నుండి రెండు పట్టాలు ఒకేసారి పొందడం గర్వకారణం. అందుకే ఆయన ఆ జిరాక్స్ పేపర్లు డబ్బుల కన్నా ఎక్కువ జాగ్రత్తగా పెట్టుకుంటారు... అవి ఒట్టి చిత్తు పేపర్లు కావు... ఆయన కలల సాకారాలు.... కొడుకుకు ప్రతిరూపాలు..అని అంటూనే భర్త ఉత్తమ్ వీల్ చైర్ దగ్గరకు లాక్కుని ఇవాళ మీరు మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు. కాలేజీలో ఫీజు చెల్లించి, వైద్యవిద్యను అభ్యసించేందుకు పోతున్నారు... అంటూంటేనే  అప్రయత్నంగా అర్పిత ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా చేర్చుకుంటూ... అవునా? మరి ఫీజుకు డబ్బు ఉందా? అని ఉత్తమ్ అడిగితే... ఇదిగో అని వందనోట్ల కట్ట, తెల్లని కోట్ ( apron) (stethoscope) "ఆలా"  అతని చేతికిచ్చింది అర్పిత.

ఎంతో అపురూపంగా ఆ డబ్బులు, ఆ సర్టిఫికెట్లు ఉన్న ఫైలును పట్టుకొని, ఆలాను మెడలో వేసుకుని, తెల్లకోటు భుజాన వేసుకుని, అర్పితను గుండెలకు అదుముకున్నాడు.

ఎప్పుడు వచ్చిందో?  డాక్టర్ స్నేహిత ఈ దృశ్యం చూసి కళ్ళు చెమరుస్తుంటే.... అర్పితను  చేతితో తాకితాకనట్టుగా స్పృశించి, సాధారణ గృహిణిగా ఉన్న నీవు ఇలా అల్జీమర్స్ పేషెంట్ ను  హ్యాండిల్ చేస్తున్నావంటే... సైకియాట్రీ కోర్సు చేసిన వారు కూడా ఇంత చక్కగా చేయరని ఉత్తమ్ కు  వినపడకుండా అని, నేను పక్కింట్లో కౌంటర్లో కూర్చుంటాను... అతనిని అక్కడి తీసుకొని వచ్చేయ్ ! అని చెప్పి పక్కింటికి వెళ్ళిపోయింది స్నేహిత.
 
అర్పిత వీల్ చైర్ నెట్టుకుంటూ వెళ్ళింది.

అచ్చంగా అడ్మిషన్ ఇచ్చే క్లర్కు ప్రశ్నలడుగుతూ ... మీ సర్టిఫికెట్లు డబ్బు ఇవ్వండి... అనగానే ఒక్కసారిగా లేచి నిలబడి ఆ రెండు టేబుల్ మీద పెట్టాడు సంతోషంగా  ఉత్తమ్!

అర్పిత ఆశ్చర్యపోయింది.. తాను, నర్సు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఎన్నో సార్లు అతనిని నిలబెట్టాలని  ప్రయత్నించినా లేచి నిలబడలేదు. కానీ అలాంటిది ఈ వేళ ఎలా లేచి నిలబడ్డారు? అని ఆశ్చర్య పోతుంటే డాక్టర్ స్నేహిత ఇలా అన్నది.

అందరికీ బాల్యం అనేది ఒక గట్టిపునాది!  అందులో ఎందరికో వాళ్లు అనుకున్నట్టు జీవితం సాఫీగా జరుగదు. తల్లిదండ్రులు అతిగా పట్టించుకోవడమో?

అస్సలు పట్టించుకోకపోవడమో? జరిగి వారు కోరుకున్న చదువు కానీ, కోరుకున్న ఉద్యోగం గానీ, కోరుకున్న జీవిత సహచరి కానీ దొరకవు.  ప్రేమించడం నేరమో, దోషమో కావు. కాని ఒకరిపట్ల ఒకరికి అవగాహన ఉన్న పెళ్ళిళ్ళను ప్రోత్సహించక పోవడం వల్ల జీవితంతో రాజీపడి బాధలోనే జీవితం గడుపుతూ కాలక్రమేణా పనులలో పడి తాత్కాలికంగా మర్చిపోయినా... ఇలా రెండో బాల్యంలో వాళ్ళు చిన్నప్పుడు కోరుకున్నవన్నీ అంతర్గత హృదయం నుండి బాధ ఇలా బయట పడతుంది. వయస్సులో ఉన్నప్పుడు అణచి పెట్టినట్లుగా ఈ వ్యాధి కారణంగా వాటిని ఇప్పుడు అణిచి పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే మెదడు"  డిమెన్షియా"  లేక " అల్జీమర్స్"  వంటి  వ్యాధులతో నియంత్రణలో ఉండక వారి సబ్ కాన్షస్ లో ఉన్న బాధను ఇలా బయట పెడతారు.

నువ్వు చేసినట్టు ఇలా కృత్రిమంగా రోగిని సంతోషపెట్టడం అందరి వల్లా కాదు కానీ, పిల్లలను వారికి ఇష్టం ఉన్న చదువులు చదివిస్తూ,  వారి  పూర్తి ఇస్టానుసారంగా జీవించే స్వాతంత్రమిచ్చి ప్రోత్సహిస్తే జీవితాంతం సంతోషంగా ఉండడమే కాకుండా... ఇలా జీవిత చరమాంకంలోనూ... ఒక సంతృప్తితో నాకు నచ్చిన చదువు చదివాను... నాకు నచ్చిన ఉద్యోగం చేశాను... నాకు నచ్చిన జీవిత భాగస్వామిని పొందాననే తృప్తి మిగులుతుంది..

హాట్సాఫ్ !  అర్పితా !  ఈ లోకం నుండి త్వరలో వీడ్కోలు తీసుకోబోయే ఒక వ్యాధిగ్రస్తుడికి  చక్కని వీడుకోలు ఇస్తున్నావు. నీ ధైర్యానికి అంకితభావానికి జోహార్లు.. అని చకచకా వెళ్ళిపోయింది డాక్టర్ స్నేహిత.

మరీ !  అనాటమీ పుస్తకం కొన్నావా? అని అడుగుతున్న భర్తను అతని అమాయకతను చూస్తూ కళ్ళల్లో తడి అతను గమనించకుండా...  పక్కకు తిరిగి ....ఉంది కొన్నాను కదా? అలమరలో? చూడలేదా? అని ఒక మందపాటి డిక్షనరీని గుడ్డ సంచిలో  చుట్టి చేతిలో పెట్టింది అర్పిత.
  
మిలమిలా మెరుస్తున్న కళ్ళతో సంచీని అందుకున్నాడు ఉత్తమ్ ! ఇక ఆ దృశ్యం చూడలేక బాత్రూంలోకి వెళ్లి బావురుమంది... Bedside అసిస్టెంట్. అర్పిత భర్తను ADRS  సెంటర్ కు తీసుకొని వెళ్లేందుకు అన్ని సర్దుకుంటోంది  గుండె నిబ్బరంగా...

Follow Us:
Download App:
  • android
  • ios