పొద్దటినుండి ముసురు పడుతున్నది. పెద్దవాన పడిపోతే బాగుండు... ఈ ముసురు ఏ పని చేయనివ్వడం లేదు. బజార్లన్నీ రొంపిరొంపిగా ఉన్నాయి. నడిచేటట్టే లేదు. ఐదారిండ్లల్లో  పని చేస్తేనే కానీ ఇల్లు గడవదు. కానీఈ" కరోనా" ఏం రోగమో గానీ, అందరూ ఎవరికి వారే పని చేసుకుంటామని పనిలోకి రానివ్వడం లేదు.పని లేకపోయేసరికి ఇల్లు గడవడం కష్టమైపోతున్నది. పాపం ఈ టీచరమ్మ మాత్రం ఇంట్లో పని చేయకున్నా జీతం ఇస్తున్నది. మరి అమ్మగారు అంత మంచిది.ఇంటి మూడు చుట్లు శుభ్రం చేసి పోతానని వచ్చింది యాదమ్మ.

యాదమ్మ పని చేస్తున్నది కానీ మనసు మాత్రం కొడుకు గురించే ఆలోచిస్తున్నది. తను చదువుకోక కొలువు లేక ఇల్లిల్లు తిరిగి పని చేసుకొని బతికే పరిస్థితి... తన కొడుకుకు రావద్దని... వాడు మంచి బతుకు బతకాలని బడికి పంపిస్తే మంచిగానే పోతుండే... ఈ ఆరునెలల నుండి బడిలేదు గిడిలేదు. ఇంట్లో కూర్చొని సోపుతోళ్ళతోటి  ఒక్కటే ఆడుకునుడాయె !  వచ్చిన నాలుగక్షరాలు మర్చి పోతాడేమోనని రంది అయితున్నది.

హమ్మయ్య ! మంచిమాట విన్న! బడి తెరుస్తరట...

అన్నంతసేపు పట్టలేదు. అదిగా పంతుళ్ళకే తెరుస్తరట..
పిల్లలు ఇంటి కాడనే ఉండి టీవీలల్ల,  ఫోన్ లల్ల  సదువుకోవాల్నట... నా దగ్గర ఫోన్ ఏది? పంతులమ్మను అడుగుదామంటే ఇదివరకే ఎంతో సాయం చేసింది. మల్లా ఏ ముఖం పెట్టుకుని అడగను??

మా ఇంట్ల టీవీ లేకపోయే ! గా పటేల్ అమ్మ ఇంట్ల పని చేస్తుంటే నేను  పనికిరాన్నాడు... ఎందుకు రాలేదని అడగడానికో... రమ్మని పిలవడానికి వాళ్ళ ఇంట్ల ఉన్న పాత ఫోను నాకు ఇచ్చిండ్రు... కానీ ఇంకా ఫోన్లో  గా వాట్సప్ ఏందో  ఉంటదట.. అదేందో గీ ఫోన్ల రాదట .. వాట్సప్ వచ్చే ఫోన్ కొనాలంటే పదివేల రూపాయలు కావాల్నట ... ఇప్పుడు ఏడ్నించి  దేను?  పెనిమిటికి పని లేక, రెండు పూటలా తిండే కరువాయె!  ఏం చేతును? అని ఆలోచిస్తూనే దబదబ పనులన్నీ చేసి, ఎవరన్నా చేబదులు ఇస్తారేమో అడిగి పిల్లగానికి గా ఫోన్ కొందామని... ఇంటికిపోయింది యాదమ్మ.

యాదమ్మ పనిచేసి వెళ్ళిపోగానే వాగ్దేవి టీచర్ ఆలోచనలో పడింది. మా ప్రభుత్వ పాఠశాలలకు మారుమూల గ్రామాల నుండి  పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. ఈ మహమ్మారి రావడం వల్ల పాఠశాలలన్నీ మూతబడ్డాయి. ప్రైవేట్ పాఠశాలలు నడిపే యాజమాన్యాలంటే.." ఆన్లైన్ క్లాసులు" నడిపి వాళ్లు వాళ్ల సెలబస్ ను పూర్తి చేస్తున్నారంటే ఆ పాఠశాలలకు ధనికుల పిల్లలు స్కూల్ ఫీజు చెల్లించి వస్తారు కాబట్టి.... వారి తల్లిదండ్రులు  వాళ్ల పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోన్లు కొనిపెడతారు. వాళ్ళ  ఇళ్లల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. మరి  యాదమ్మ వంటి వారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తున్నది వాగ్దేవి టీచర్.

మా ప్రభుత్వ పాఠశాలలో చదువు కొనసాగించాలని చేసిన  కృషి ఫలితమే దూరదర్శన్, సప్తగిరి ఛానల్, విద్యావారధి మొదలైన వాటిలో మొదటి తరగతి నుండి పదవ తరగతి వరకు తరగతులలోని పాఠాలు చెప్తున్నారు. నీతి కథలు, పద్యాలు ఆయా తరగతికి సంబంధించిన పాఠాలు చెప్తున్నారు కానీ, టీవీలు ఉండాలి... కేబుల్ కనెక్షన్ ఉండాలి.. యాదమ్మ వారి లాంటి వారికి ఎలా సాధ్యం అవుతుంది? పిల్లవాడి చదువు, వాడి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది యాదమ్మ. నిన్న పనికి వచ్చినప్పుడు నాతో అన్నది.  వాళ్ల బస్తీలో ఉండే ఒకామె  తన తాళిబొట్టును తాకట్టు పెట్టి, బ్లాక్ అండ్ వైట్ టీవీ కొని తెచ్చినదట.  యాదమ్మ మొగడు తన మెడలో తాళి ఏనాడో అమ్మేసి తాగుడుకు ఖర్చు చేశిండు.  ఇక అమ్మటానికంటూవిలువైన వస్తువు ఏమీ లేదు. మా ఊర్లో ఇంకొకతను తను వ్యవసాయం చేసుకొనే  ఎద్దులు అమ్మి మొబైల్ కొన్నానని చెప్పాడట మావారికి. ఎద్దు లేకుంటే వ్యవసాయం ఎట్లా నడుస్తుంది? వ్యవసాయం లేకపోతే పంట పండదు, ఇల్లు ఎలా గడుస్తుంది ???

ఇంకో టీచర్ చెప్పింది ముదిమి వయసులో అక్కరకు వస్తుందని ఎన్ని సమస్యలు వచ్చినా అపురూపంగా చూసుకునే తన బంగారు గాజును అమ్మి, మనవడికి టీవీ కొని ఇచ్చిందట ఒక బామ్మ.

ఇవన్నీ వింటుంటే ఎంత సంకట పరిస్థితి వచ్చింది. అసలే యాదమ్మ బస్తీల వంటి బస్తీలలో పెరిగే పిల్లలకు చదువు ధ్యాస ఉండదు. చదువుకోమని వాళ్లకు చెప్పే వాళ్ళు ఉండరు.. ఎక్కడనో ఒక చోట.. ఎవరో ఒకరు యాదమ్మ  కొడుకులాంటి పిల్లలు చదువుకోవాలంటే ఎన్ని అవస్థలు పడాలి.  పిల్లలకు ఇలా విద్య బోధిస్తే వస్తుందా? అంటే చెప్పలేం ! ఒక్కొక్క పిల్లవాడికి వాట్సాప్ చూసి, తన తరగతి పాఠం ఎప్పుడో తెలుసుకోవడం కష్టం. ఒక్కొక్క పిల్లవాడికి మొబైల్ ఆన్ చేయగానే ఏవైనా ఆటలు కంట పడ్డాయో ఇక అంతే సంగతులు. వాడు ఆటలో లీనమై పాఠం సంగతి మరచేపోతడు. ఆది మా ఉపాధ్యాయులం  తరగతి గదులలో ఎదురుగా కూర్చుంటే  చూసి హెచ్చరిస్తాం ! ఒక్కొక్క పిల్లవాడు వీడియో కాల్ ఆన్ చేయడం అవతల పిల్లవాడు పాట వింటున్నాడా? లేడా? అనేది మాకు తెలియదు. కాస్త చదువుకున్న తల్లిదండ్రులు అయితే పిల్లవాడి మీద దృష్టి పెట్టి కని పెట్టుకొని ఉంటారు. కానీ పనులకు పోయే తల్లిదండ్రులకు  ఈ విద్యాబోధన అర్థం కాదు. పిల్లవాడిని హెచ్చరించ లేరు.

మొన్న పత్రికలో చూశా! తల్లి ఉద్యోగానికి వెళుతూ బిడ్డకు ఆన్లైన్లో పాఠాలు వినమని చెప్పింది. వాడు పోన్ ఆన్ చేయగానే ఏవో ఆటలు వచ్చినయట , అవి డబ్బులు కట్టి ఆడే ఆటలంట.  అది వాడికి తెలియక ఆటలో లీనమై ఆడుతుండగా ఉన్న డబ్బులన్ళీ పోయినయట. అమ్మ దగ్గర తిట్లు ఇది ఈ నాటి చదువులు.

పై తరగతుల పిల్లలైతే అశ్లీల చిత్రాలు చూడడం అలవాటైందని చెప్పుకోగా విన్నాం.  ఉపాధ్యాయులు ఏమి చెబుతున్నారో... పిల్లలకు అర్థం కాదు. పిల్లలు ఏం చేస్తున్నారో టీచర్ కు తెలిసే అవకాశం లేదు.  టి.విలో చెప్పే వేగాన్ని అందిపుచ్చుకోలేక పోతున్నరు. మొక్కుబడిగా ఏదో రాస్తున్నరు.  కొన్ని కొన్ని గ్రామాలలో గంటల కొద్దీ కరెంటు ఉండదు.  టీవీ నడవదు. ఇంటర్నెట్ ఉండదు. కొన్నిచోట్ల సిగ్నల్ సరిగా లేక యూట్యూబ్ లో పాఠాలు వినలేక, చదవలేక పోతున్నరు... పిల్లల పాట్లు ఇవైతే...

ఇక మా ఉపాధ్యాయుల కష్టాలు ఆ దేవుడికే ఎరుక! మొదలు నివసించే ప్రాంతం నుండి పాఠశాల చేరడమే ఒక గగన గండం ! మగవారైతే సొంత వాహనాలలో వెళ్ళవచ్చు .. సీనియర్ మహిళా టీచర్లకు వాహనాలు నడపరాదు.  ప్రైవేటు రవాణా వ్యవస్థలో  ప్రయాణించాలంటే అంతకుముందు ఆటోలో ఎవరు ప్రయాణించారో ?ఏమో? ఒకవేళ కోవిడ్  వ్యాధిగ్రస్తులు ప్రయాణిస్తే... అది కాస్తా అంటితే ఎలా? ఆటో డ్రైవర్ ఎలాంటివాడో? తీర ఎలాగో ఒక లాగ వెళితే .. 60, డెబ్భై మంది పిల్లలకు ఫోన్ కాల్ చేసి, వాట్సాప్ లో ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో నేర్పించి... చెప్పి యాదాద్రిలో, డి డి ఛానల్ లో పాఠాలు వస్తాయని చదువుకొని, పరీక్షలు రాయమని చెప్తే... పిల్లల తల్లిదండ్రులు సవాలక్ష ప్రశ్నలు వేసి విసిగిస్తారు.

అటువంటి సంఘటనే ఇవాళ జరిగింది. పాఠశాల విద్యార్థి తల్లికి ఫోన్ చేసి పిల్లవాడికి పాఠాలు మొదలైనాయి... అతనికి ఫోన్ ఇవ్వు అని అంటే.. ఎంత మంచి పంతులమ్మవూ...? నెల రోజులకు సరిపోయే బ్యాలెన్స్ ఫోన్ లో వేస్తే పది రోజులలో అయి పోగొట్టిండు మా పిల్లగాడు. గివేమీ చదువులు చెప్పుడమ్మా ? మళ్లీ  యాడ నుండి  పైసలుతేము? అని ఫోను పగిలిపోయేలా, చెవి చిల్లులు పడి బద్దలయ్యేలా అరిచింది.. మాకు గా పెద్ద ఫోన్ లేదు... ఈ కరోనా చేయబట్టి పక్కింట్లో టి. వి. కిరానిస్తలేరు...

మీరు మంచి చెప్తరు... టీవీ లేకుంటే పక్కింట్లో చూడమని... ఏందవ్వా? ఏదన్నా  పనికొచ్చే ముచ్చట చెప్పు! ఇంట!  ఇంట్ల మస్తు పని ఉన్నదని అరచి గోల పెడుతుందో తల్లి....

పిల్లలది ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితి.... ఒక్కొక్కళ్ళది... ఒక్కొక్క తీరు బాధలు.. చెప్తే వినివిని మాకు తలనొప్పి రావాల్సిందే కానీ... మేం చెప్పే పాఠాలు పిల్లల తలకెక్కేలా లేవు... అసలు మొదటి సమస్య ఫోనే ఎత్తరు.. ఎందుకంటే మీకు లోన్ కావాలా అనే  చెత్త ఫోన్ కాల్స్  వినివిని ఫోన్ కాల్ కూడా అటువంటి పని చెడగొట్టే ఫోన్ కాలే అని ఫోన్ ఎత్తరు.
   
కొందరేమో వాళ్లకు అవసరం ఉన్నప్పుడే ఫోన్ ఆన్ చేస్తరు... లేకుంటే మిగతా సమయమంతా స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తరు.  ఇక ఆపిల్లవాడికి పాఠాల వివరాలు తెలిసే అవకాశం ఉండనే ఉండదు.  ఇంకా కొందరు పోకిరి పిల్లలు చేతిలో పోన్ ఉన్నా మా నాయన తీసుకొని పోయిండు అని అబద్ధాలు చెప్తరు. కొందరు ఇంటర్నెట్ లేదని అబద్ధాలు చెప్తరు. వాళ్లని ఏమనగలం? క్లాసులో సగం మంది పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఇందరిని ఎలా కూడగట్టుకుని రావడం??? కొందరి ఫోన్లలో ఒక రికార్డు వినబడుతుంది... ఈ నెంబర్ కు సర్వీస్ బందు చేయడమైనదని... ఇక వారితో ఎలా మాట్లాడాలో తెలియదు... క్లాసులో ఎదురుగా కూర్చోబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్తేనే కొన్ని పాఠాలు అర్థం కావు కొందరికి... ఇంట్లో తల్లిదండ్రులు చదువుకున్న వారైతే ఎంతో కొంత నేర్పిస్తరు.  కానీ యాదమ్మ లాంటి వారు వారి పిల్లలకు ఎలా చెప్తరు? వాళ్ళ పరిస్థితి ఏమిటి? తలచుకుంటేనే ఎంతో బాధ అవుతుంది... ఇంకా కొంతమంది ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలే తీసుకోలేదని సమాధానం ఇస్తరు.  పుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా చెప్పడం? అవి తీసుకోవడానికి  రవాణా సౌకర్యం లేక  ప్రభుత్వం ఇచ్చే ఆ పుస్తకాలు అక్కడే పడి ఉంటున్నాయి.
  
తల్లులు టీచర్ అమ్మలను అమ్మా!  మా పిల్లలకు మధ్యమధ్యలో ఫోన్ చేయండి... మీ మాట వింటరు చదువుకుంటరు.. మేం చెప్తే వినరు...  అని అంటరు.

ఇప్పటికే చాలా సమయం వృధా అయింది.  ఇంకా వాళ్ళు ఆ పుస్తకాలు ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేసి పాటలు వినాలి?  ఎప్పుడు నేర్చుకోవాలి?  నా వంతు కృషిగా ఈ వీధి లోని పిల్లలను మాస్కులు వేసుకుని రమ్మని, వాళ్లు మా పాఠశాల విద్యార్థులు కాకపోయినా... రోజు పాఠాలు చెప్తున్నాను.... ముందు నలుగురైదుగురుతో ప్రారంభమైన నా ట్యూషన్  ఇప్పుడు ఇరవై మందికి చేరింది.  ఆ ట్యూషన్ లో ఒక అమ్మాయి చెప్పిన మాట విని నివ్వెర పోయాను... ఆ అమ్మాయికి స్కూల్ టీచర్ మొబైల్ కొనుక్కో అమ్మాయి అని అంటే... పైసలు లేవని అంటుండగా పక్కింటి అబ్బాయి నా ఫోన్ తీసుకో... మొత్తం వాడుకో... నా ఫోన్ నీదే అనుకో! అనగానే చక్కగా చదువుకోవచ్చు అనుకున్నదట ఆ అమ్మాయి. ఇంతలో ఆ పిల్లవాడు ఒక మెలిక పెట్టాడు.

( మా అమ్మానాన్న పొలం పనులకు పోతారు కదా) ఆ అబ్బాయి చెప్పినట్లు చేస్తే... అతని పోను నాకు ఇస్తాడట... ఆ అన్న చూపులు అర్థమై... ఆన్లైన్ పాఠాలు లేకున్నా ఫర్వాలేదని చదువుకోడానికి నా దగ్గరకు వచ్చిందట... ఈ పరిస్థితులను కొంతమంది ఆకతాయిలు ఇలా వినియోగించుకుంటున్నారు.  ఇంకా కొందరు పిల్లల తల్లిదండ్రులకు టీచర్లు ఫోన్ కాల్ చేస్తే... మా పనులు ఎందుకు పాడు చేస్తుంరు? మేము పనులు చేసుకోవద్దా? అని గొడవకు దిగుతుంరు.

ఈ రోజు పాఠశాలకు వెళ్లి చదువు చెప్పే ఉపాధ్యాయులు పై అధికారుల ప్రశంసల కన్నా... విద్యార్థులు మనస్ఫూర్తిగా మా ఉపాధ్యాయులే మా జ్ఞానానికి మూలం అని అనుకుంటే చాలని అనుకొనే ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నరు.

ఉపాధ్యాయ దినోత్సవం రోజు పిల్లలతో శుభాకాంక్షలు చెప్పించు కోలేదని కంటతడి పెట్టిన టీచర్లు; టీచర్లకు ఒక పువ్వో, ఒక గ్రీటింగ్ కార్డో ఇచ్చి నమస్కరించ లేక పోయామని వాపోయే పిల్లలు ఉన్నరు...  ఎదురుగా తరగతి గదులో కూర్చోబెట్టి పాఠాలు చెప్పినప్పుడే ఇద్దరి మధ్య మమతా అనుబంధం ఏర్పడుతుంది... ఆ మధురమైన అనుభూతులు  అంతా ఈ  విద్యా సంవత్సరం కోల్పోయినట్టే..

ప్రభుత్వం మిగతా సంక్షేమ పథకాలు ఆపేసి అయినా సరే, పేద పిల్లలకు  ట్యాబ్ లు గాని, లాప్ టాప్ లు గాని ఇస్తే... మిగిలిన ఈ బోధనా సంవత్సరం  ఫలవంతమౌతుంది .  సంక్షేమ పథకాలు ఇవ్వకున్నా కొంపలు అంటుకు పోవు... కానీ ఒక విద్యా సంవత్సరం కోల్పోతే పిల్లల భవిష్యత్తు అంధకారమే...