నీటిరంగులతో చెక్కే బొమ్మలమీద వాలి కవికోకచిలుక ఆలోచనల మీద అద్దిన వర్ణశోభల జాడలు వెతుక్కుంటూ అంటూ శ్రీరామోజు హరగోపాల్ రాసిన కవిత 'ఉభయకుశలోపరి' ఇక్కడ చదవండి 

వాన కురిసిపోయినంక
ఆకుల మీద నీటిబిందువులు
దోసిలిపట్టి తిరుగుతున్న గాలి
చెక్కిలిమీద గడ్డకట్టిన తాజ్ మహళ్ళెన్ని?

అడివికాయాల్సిన వెన్నెల
కాంక్రీటు అరణ్యాల్లో కాలిపోతున్నది
దూపకొచ్చిన నదులు నిట్టూరుస్తున్నయి
ఇండ్లతలల మీద దుఃఖాలు రాలిపడుతున్నయి

చేతిరాతలేని ఉత్తరాలలో గాత్రస్పర్శ కొరకు
మౌనతప్తస్పృహతో అలికిడి కొరకు
విరహవిషాదనిషాతో హమేషా కృ.శా.లెక్క
నిర్ణిద్రాదహన స్వప్నాలతో విల్లమ్ముల్లెక్క

చాచిన చేతులెంతెంత దూరాలు సాగుతాయో
ఉలిపిరి ఊపిరిమీద రాసుకొన్న చిట్టి వాగ్దానాలు
నీటిరంగులతో చెక్కే బొమ్మలమీద వాలి కవికోకచిలుక
ఆలోచనల మీద అద్దిన వర్ణశోభల జాడలు వెతుక్కుంటూ

అంతా బాగే...నువ్వు కనిపించినట్లనిపించి
తిరుగుటపాలో నన్ను నేనే...