ఫూణ్ది : రమేష్ కార్తిక్ నాయక్ కవిత
ప్రకృతితో మమేకమైన జ్ణాపకాల రెక్కల చప్పుడును రమేశ్ కార్తిక్ నాయక్ రాసిన కవిత " ఫూణ్ది" లో చదవండి..
నానమ్మ చేతి బొక్క గాజులు
ఒకదానిపై ఒకటి యుద్ధాన్ని ప్రకటించుకున్నాయి
రేలపూల తాకిడికి
తండా వైపు వచ్చిన గాలి
ఆమె చేతి పైనున్న
రెండు తెల్ల వెంట్రుకలకు తగలగానే
ఒకింత మెరుపు రెట్టింపైయింది
గాలిలోనే తేలుతూ వచ్చిన ఫూణ్ది
బొక్క గాజులపై వాలేసరికి
యుద్ధం సమాప్తమై
ఆమె చేతి మాంసంలోని
కొన్ని గాయాల్లో శూన్యాన్ని నింపి
చేతి చివర గోర్లలో నిద్రపోయింది.
వాలిన ఫూణ్ది దీర్ఘంగా చూసింది.
నల్లని గీతలు పచ్చని రంగుని చీలుస్తూ, సరిహద్దులు గీస్తూ
అవే తన కంటికి రోజు అడ్డుపడేవిగా గుర్తించింది.
ఇంకా కొంత పరీక్షగా చూసింది.
నాలుగు రెక్కలు పారదర్శకంగా తన ఎముకలనే చూపించాయి
గమనిస్తూ గమనిస్తూ
తన బాల్యంలోని
పచ్చని అడవుల్ని
నల్లని సరిహద్దు కొండల్ని
నది, కాలువల్ని దర్శించింది.
ఇప్పుడు ఎక్కడ లేవు
ఒక్క సారైనా స్పర్శిద్దామనుకుని
ఫూణ్దిని ముట్టింది
అంతే తన ఘుంగ్టోలోంచి
రంగు రంగుల తుమ్మెదలు పైకెగిరాయి
వీపును తాకిన చల్ల గాలి స్పర్శ
తుమ్మెద రెక్కల చప్పుడు గమనించి
తిరిగి చూసుకునేలోపు
ఆ వాలిన ఫూణ్ది మాయమైపోయింది.
*ఫూణ్ది - తూనీగ
* ఘుంగ్టో - తల పైనుండి కప్పుకునే రంగుల ముసుగు