కన్నులున్న చోట మాటలెందుకు మాటలన్నీ ఇప్పుడు కరిగిపోయే మంచు ముక్కలు అంటూ రామ్ పెరుమాండ్ల రాసిన కవిత ' నీ సంతకం ' ఇక్కడ చదవండి

నిశ్శబ్దం ప్రవహిస్తున్న నా గదిలో 
నేను పుస్తకాలతో జీవిస్తుంటే 
మెల్లిగా నీ మువ్వల అడుగులతో 
వెనక నుంచి వచ్చి 
నా నుదురును నెమరుతావు
చిరుగాలిలా......

నువ్వు వచ్చిన వేళ 
ఎపుడో నే రాసుకున్న కవిత 
నా పెదవులపై పూస్తుంది 
లేలేత చిగురుటాకులా.....

కన్నులున్న చోట మాటలెందుకు 
మాటలన్నీ ఇప్పుడు 
కరిగిపోయే మంచు ముక్కలు 
చూపులే ఇరు హృదయాలలో
మధుర భావాలను చిత్రిస్తుంటే 
మౌనంగా ఎన్ని పాటలు సాగుతున్నాయో ...

కదిలే ఈ కాలాన్ని 
కాసేపు దాచేసి 
మౌనరాగాలతో పయణమై
నువ్వు - నేను - కొన్ని పేజీలతో 
ఈ లోకమంతా స్వేచ్చగా విహరిద్దామా ....

***
ఆమె తడి కన్నులతో 
అతని అరిచేతులను తీసుకొని 
కన్నీటి వాగ్దానం చేసి వెళ్ళిపోయింది -
అతను రాసే కాగితం 
కాసేపటికి తడిసిపోయింది -
కాలం ముసుగులో 
ప్రేమ సంతకం చెదిరిపోయింది.