రాజేశ్వరరావు లేదాళ్ళ కవిత : వలస
ఇప్పుడు ఊరి బళ్ళన్నీ మోడులైపోతున్నాయి వాళ్ల జ్ఞాపకాలలో గదుల గుండెలు నిశ్శబ్ద దుఃఖాలవుతున్నాయి అంటూ రాజేశ్వరరావు లేదాళ్ళ రాసిన కవిత ' వలస ' ఇక్కడ చదవండి :
నిన్న రాత్రంతా విడవని వర్షం
ఒడవని దుఃఖంలా
అనాసక్తంగా
బడికి వెళ్లాను
బిలబిలమంటూ కడిగిన ముత్యాల్లా పిల్లలొచ్చారు
ఓ అమ్మాయి చేతిలో మిఠాయితో నవ్వుతూ ఎదురొచ్చింది
హ్యాపీ బర్త్డే అన్నాను నవ్వుతూ
'కాదు సర్' అన్నది
ఏమిటన్నట్లు కళ్ళు పెద్దవి చేశాను
'నాకు గురుకులంలో సీటొచ్చింది'
సంబరంగా చెప్పింది
అభినందించాను
పేద పిల్ల కాస్త తిండయినా సరిగ్గా తింటుందని
ప్రార్థన ముగిశాక
అన్యమనస్కంగా కుర్చీలో కూర్చున్నాను
రక్తాన్నెవరో ఒక్కోబొట్టూ తోడేస్తున్నట్టు
ఏదో భయద విహ్వలిత భావన
ఒక్కో సంఖ్య తగ్గిన కొద్దీ
పిల్లలు మరింత పలుచబడుతున్నారు
సాన బెట్టిన వజ్రాల్ని ఎవరెవరో
దొంగిలించుకుపోతున్నారు
మెరిగల్లాంటి పిల్లల్ని మెరికలుగా చేస్తున్నాం
అయినా ప్రతి సంవత్సరం తలదించుకు నుంచుంటున్నాం
చదువు చెప్పలేక కాదు
డబ్బున్నోళ్ళు ప్రైవేట్ కు అర్రులు చాస్తే
మిగతా పిల్లలు గురుకులాల వైపు వలస పోతున్నారు
ఇప్పుడు ఊరి బళ్ళన్నీ మోడులైపోతున్నాయి
వాళ్ల జ్ఞాపకాలలో
గదుల గుండెలు
నిశ్శబ్ద దుఃఖాలవుతున్నాయి
వణికే చేతితో టిసి రాస్తున్నడు సారు