కొంగలు వాలిన నల్లతుమ్మ కొమ్మలను నరికేసిందెవరంటూ ప్రశ్నిస్తూ రాజేశ్వరరావు లేదాళ్ళ రాసిన కవిత  ' తుమ్మ చెట్టూ, రెండు కొంగలు ' ఇక్కడ చదవండి 

నల్లతుమ్మ చెట్టంటే ప్రాణం కొంగలకి
చలి విరుచుకుపడుతున్న ఉదయాల్లో
పొగమంచును పోలిన దేహాలతో
నీళ్లు కట్టిన పొలాల మడుల్లో గింజలేరుకు తినేవి

భారంగా తమ శ్వేత దేహాల్ని మోసుకొని
నల్ల తుమ్మ చెట్టును గాఢంగా కౌగిలించుకునేవి

తుమ్మ చెట్టేమో
చిన్న ఆకుల పచ్చని పండ్లతో పకపకా నవ్వేది

ఇంత తెల్లని కొంగలకి 
అంత నల్లని తుమ్మతో సాంగత్యమెందుకో ? 
అర్థమయ్యేది కాదు నాకు

ఏ పచ్చని రావి చెట్టో,
గాలికి ఒయ్యారంగా నాట్యం చేసే మామిడి చెట్టో
దానికెందుకని నచ్చదు?

ఆకులన్నీ రాలిన ముళ్ల కొమ్మల సందుల్లోని 
గూళ్ళలో నుంచి చిన్న కొంగలు కిచకిచలాడేవి

కొంగలు పూచిన నల్లతుమ్మ
దూరం నుంచి 
కళ్ళను నమ్మలేనంత సంబరపరిచేది

కొమ్మలన్నీ ఎవరో నరికేశారు చెట్టువి
ఇప్పటికిది మూడోసారి ఆ దారిన వెళ్లడం
కొమ్మలు లేని పొడవాటి నల్లని కాండమ్మీద కూర్చుని 
దీనంగా రెండు తెల్లకొంగలు
వాటినోదార్చే వారెవరు?