రాజేందర్ జింబో తెలుగులో పేరెన్నిక గన్న కవి. ఆయన కవిత్వం అలతి అలతి పదాలతో పాఠకుని ఊహాశక్తిని పెంచుతుంది. తాజాగా ఆయన రాసిన తిరునామం కవిత చదవండి.

మా ఇంటి కడప మీదే కాదు
మా దేవునర్ర ముందు కూడా
నిలువు నామాలే !

మా కుల దైవం నిలువు నామాల
వేంకటేశ్వరుడే 
కాని
మా ఇష్ట దైవం రాజేశ్వరుడే !

తిరుపతి లో పనిచేసినప్పుడు
దాదాపు రోజూ తిరు నామ దర్శనమే
కొత్తగూడెం లో వున్నప్పుడూ అంతే
రామ దర్శనమే !
నా కథలు మాత్రం మా వేములవాడ కథలే !

అన్నపూజ
కోల్యాగ మొక్కులు
మా శివరాత్రి గురించి అద్భుత వర్ణనలు
మా బాపు వైద్యం
మా వూరి ప్రజలందరూ
నా కథల్లో....

మా గుడి హరునిదే కానీ
హరికి
మా గుడిలో
మా ఇంటిలో
ఆ మాటకొస్తే
మా వూరిలో
ఏమీ తక్కువ లేదు

మా రాజేశ్వరుని సేవతో
హరి సేవ కూడా
తరలి వస్తుంది

నాకు
తిరునామాల అవసరం ఎప్పుడూ
కలుగలేదు

ఇప్పుడు మాత్రం తిరునామాలు లేక పోతే
కష్టమేమోననిపిస్తుంది

నా వరకైతే పర్వాలేదు
మా రాజేశ్వరుడు కూడా
తిరునామాలు
పెట్టుకోవాలని అంటారేమోనని 
భయం వేస్తుంది