కందాళై రాఘవాచార్య కవిత : అంగడి ప్రశ్నలు??
వేయి ప్రశ్నల వెనుకే కదా వేడుకైన జీవితం ! అంటూ నిజామాబాద్ నుండి కందాళై రాఘవాచార్య రాసిన కవిత "అంగడి ప్రశ్నలు?? " ఇక్కడ చదవండి.
అంగడి ప్రశ్నలు ??
పాఠం కిందే ప్రశ్నలుంటాయి
పాఠం విన్నాకా ప్రశ్నలడిగితే
జవాబులు తడబడవు జయప్రదం
క్లాసులో మాస్
నూటికి నూరు చప్పట్లు !
రోజూ ఎన్నెన్ని ప్రశ్నలో
రాత్రి అయ్యిందంటే రెప్పలపై
రేపటి కోసం కలతగా ప్రశ్నలు
జీవితం మనకు కొడవలంత ప్రశ్న ?
ప్రశ్నలే కదా మన పరీక్షలన్నింటికీ
సమాధానం రాయించింది
మన డిగ్రీలు
ప్రశ్నలు పెట్టిన కిరీటాలు !
పుట్టక ముందే ప్రశ్నలు
ఔను ! కడుపులో ఉన్నప్పుడు
ఎలా వస్తానో రానో ప్రశ్న ?
మన రాక - అమ్మ కడుపుకు కోత
బాల్యంలో పెద్దగా పెరగడానికి
ఎన్ని తరగతులు దాటాలో
పుస్తకాల మోత వీపు మీద ప్రశ్న ?
యౌవ్వనానికి వచ్చాకా
ఉద్యోగానికి ఎన్ని బేతాళ ప్రశ్నలో ?
పెండ్లి అయినాకా భార్య భర్తలకు
ఉమ్మడి ప్రశ్నల సంసారం శకటం ?
పిల్లలైనాకా స్కూల్ బస్సు నిండేలా
కిక్కిరిసిన మెడకు టైలా ప్రశ్నలు ?
పిల్లలను ప్రశ్నించనివ్వండి
శాస్త్రజ్ఞులౌతారు !
వేయి ప్రశ్నల వెనుకే కదా
వేడుకైన జీవితం !
అంగడి అంగడిగా ప్రశ్నలు ముందుంటేనే కదా జీవితం సాహసంగా క్రియా శీలంగా పరి పూర్ణం !