Asianet News TeluguAsianet News Telugu

వాస్తవికవాద రచయిత కేతు విశ్వనాథరెడ్డి

ప్రముఖ తెలుగు కథారచయిత కేతు విశ్వనాథరెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ప్రసిద్ధ తెలుగు సాహిత్య విమర్శకుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన వ్యాసం చదవండి.

Rachapalem Chandrasekhar Reddy on Telugu short story writer Ketu Vishwanath Reddy
Author
First Published May 27, 2023, 11:14 AM IST

"సృజనాత్మక శక్తి, విమర్శనా దృష్టి, వీటికి తోడు శాస్త్రీయ దృక్పథం చిత్తశుద్ధి ఉంటేనే గాని వాస్తవికతావాద  సాహిత్య సృష్టి చేయడం అసాధ్యం " - కేతు విశ్వనాథరెడ్డి.

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అధ్యాపకుడు, పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, కథా రచయిత, నవలికా రచయిత, విద్యావేత్త, అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించి, మరణించేదాకా అరసం అధ్యక్ష వర్గం సభ్యులుగా ఉన్నారు. తెలుగు అభ్యుదయ సాహిత్యాన్ని రాయలసీమ నుండి సుసంపన్నం చేసిన వారిలో ఆయన ఒకరు.
     
విశ్వనాథరెడ్డి (10.7.1939 - 22.5.2023) కడప జిల్లాలోని రంగశాయిపురం వాసి. ఆయనది బాగా జరుగుబాటు ఉన్న వ్యవసాయ కుటుంబం. నాగమ్మ వెంకటరెడ్డి వారి అమ్మానాన్నలు. ఆయన కుటుంబానికి  వ్యాపార నేపథ్యం  కూడా ఉంది. విశ్వనాథరెడ్డిని ఆయన అవ్వ తాతలు సంపూర్ణమ్మ, పెద్ద భూమారెడ్డి చదివించారు.  ఎర్రగుంట్ల (1947- 52) ప్రొద్దుటూరు (1952– 55) లలో పాఠశాల విద్య నభ్యసించి, కడప ప్రభుత్వ కళాశాలలో 1955 నుంచి 58 డిగ్రీ చదివారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1958– 60 మధ్య ఎంఏ తెలుగు చేశారు. ఆ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగులో కేతు విశ్వనాథరెడ్డి, కె. నాగిరెడ్డి, భాస్కర  స్వర్ణాంబ,  జి. నాగయ్య, నల్లపాటి రామప్ప నాయుడు, కృష్ణా రెడ్డి, చెన్నారెడ్డి మొదలైన వాళ్లు మొదటి బ్యాచ్ విద్యార్థులు. ఆ తర్వాత విశ్వనాథరెడ్డి ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి పర్యవేక్షణలో ‘‘కడప ఊర్ల పేర్లు’’ అనే అంశం మీద పరిశోధించారు. దీంతో తెలుగు శాఖలో ‘ఓనమాస్టెన్స్’ అనే అధ్యయన విభాగానికి పునాది పడింది. 1962 ఆగస్టు 2న ఆయనకు పద్మావతి గారితో పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు సంతానం. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. మాధవీ లత, శశికాంత్, శిరీషలు.
    
ఆయన కడప, శ్రీకాళహస్తి, కందుకూరులలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, 1976లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో లెక్చరర్ గా చేరారు. కొన్నాళ్ల తర్వాత డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి రీడర్ గా వెళ్లి, అక్కడే ఆచార్యుడై అనేక హోదాలలో దూరవిద్యకు సేవలందించారు. దూరవిద్య తెలుగు వాచకాలతో ఆయన విప్లవాన్ని తీసుకొచ్చారు.
     
ఆయనకు పత్రికా రంగంతో బాగా అనుబంధం ఉండేది. ‘ఆంధ్రరత్న' అనే పత్రికకు కొన్నాళ్లు ఉపసంపాదకులుగా పనిచేశారు. ఆ తర్వాత ఈనాడు, ఆంధ్రభూమి పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, శిక్షణ నిర్వహించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కొంతకాలం ‘ఈ భూమి’ కి సంపాదకత్వం వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగానూ,  నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహామండలి సభ్యులుగానూ  సేవలందించారు. 
     
విశ్వనాథరెడ్డి దాదాపు 100 కథానికలు రాశారు. అవి మొదట  'జప్తు', 'ఇచ్చాగ్ని' వంటి సంపుటాలుగా వచ్చాయి. తర్వాత ' కేతు విశ్వనాథ రెడ్డి కథలు ' పేరుతో రెండు సంపుటాలు వచ్చాయి. వాటిలో మొదటి దానికి 1994లో తెలుగు విశ్వవిద్యాలయం, 1994లో భారతీయ భాషా పరిషత్తు, 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. రెండవ దానికి 2009లో అజోవిభో కందాళ  ఫౌండేషన్ పురస్కారం లభించింది. ఆయన బోధి, వేర్లు  అని రెండు నవలికలు రాశారు. వారి ఉపన్యాసాలు, వ్యాసాలు ‘సంగమం’ పేరుతోనూ,  ముందుమాటలు సమీక్షలు కలిపి ‘పరిచయం’ పేరుతోనూ ప్రచురింపబడ్డాయి. ఇంగ్లీషులో రాసిన వ్యాసాలు ట్రెడిషన్స్ అండ్ ట్రెండ్స్,  చేంజ్ అండ్ రిలవెన్స్ అని  అచ్చయ్యాయి. కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యాన్నంతా 13 సంపుటాలుగా వింగడించి వాటికి విలువైన ముందు మాటలతో సంపాదకత్వం వహించారు. ఆ ముందు మాటలు ‘మన కొడవటిగంటి’ పేరుతో పుస్తకంగా వచ్చాయి. ఆయన తెలుగు కల్పనా సాహిత్యం మీద రాసిన విమర్శ అంతా ‘దృష్టి’ పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆయన మరో విమర్శ పుస్తకం ‘దీపధారులు’. చదువు  కథలు, రాయలసీమ రాగాలు వంటి పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఇంకా అనేక రచనలు పుస్తకాలుగా రావలసినవి చాలా ఉన్నాయి. వాటి క్రోడీకరణ జరుగుతుండగా ఆయన కన్నుమూశారు. 

ఆయన కథలను ఇలా వింగడించుకోవచ్చు.
1. భౌతిక వాద కథలు
2. కథకుల కథలు 
3. రాయలసీమ నిర్దిష్టత కథలు 
4. ఆర్థికాంశాల కథలు 
5. స్త్రీ పురుష సంబంధాల కథలు 
6. రాజ్య వ్యవస్థ కథలు 
7. దళిత బహుజన కథలు
    
అభ్యుదయ రచయిత సాధారణంగా భౌతికవాది అయ్యుండాలి. అప్పుడు మాత్రమే వాస్తవికతను శాస్త్రీయంగా చూడడం సాధ్యమవుతుంది. మతం పట్ల విమర్శనాత్మక దృష్టి లేకుండా ప్రగతిశీల  రచయితలు సత్యాన్ని సుందరంగా చిత్రించ లేరు. దైవ భావన, దాని భౌతిక రూపమైన మతం మానవ జీవితంలో నిర్వహిస్తున్న విధ్వంసక పాత్రను ఎత్తిచూపడం ద్వారా అభ్యుదయ రచయితలు పాఠకులలో మార్పు తీసుకుని రాగలరు.  కులమతాలు మనుషులను విభజించి పాలిస్తున్న నిజాన్ని ప్రగతిశీల రచయితలు బయటపెడతారు. కేతు విశ్వనాథరెడ్డి గారు భౌతిక వాద రచయిత. నిజ జీవితంలో భౌతికవాది అయిన విశ్వనాథరెడ్డి, భౌతిక వాద కథలు రాశారు. అనాదివాళ్ళు (1963), ఆత్మరక్షణ (1977), మహిమ (1988),  S2బోగి (1991) అమ్మవారి నవ్వు 2003 వంటివి ఆయన భౌతిక వాద కథలు. ' 1962 నుంచే జీవితాన్ని గురించి గట్టిగా ఆలోచించాను ' అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారి మీద అప్పటికే మార్క్సిజం ప్రభావం ఉంది. కులమత పునాదులు బలంగా ఉన్న కుటుంబంలో పుట్టిన విశ్వనాథరెడ్డిగారిని మార్క్సిజం బయటకి లాక్కొచ్చింది. ‘అనాది వాళ్లు’ కథ గురజాడ రాసిన ‘పెద్ద మసీదు’ కథ లాగా ఆచార్లు, రాజశేఖరం అనే రెండు పాత్రల ద్వారా నడుస్తుంది. భావవాది ఆచార్లు, భౌతికవాది రాజశేఖరంల  మధ్య సంఘర్షణ నడుస్తుంది. రచయిత రాజశేఖరం వైపు నిలబడి మతంలోని హిపోక్రసీని బయట పెడతాడు. ‘ఆత్మరక్షణ’ కథ పౌరోహిత్య వృత్తిలోని ఆర్థిక సూత్రాన్ని బహిర్గతం చేస్తుంది. ‘మహిమ’ కథ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులలోనూ దాగి ఉన్న హేతు జ్ఞాన శూన్యతను ఎత్తిచూపుతుంది. సైన్సు అభివృద్ధి చెందినంతగా శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి   చెందని వింత స్థితిని  ఈ కథ చిత్రించింది. ఒక బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఏవో మహిమలను సమర్థిస్తూ ప్రసంగం చేయడం, అది తెలిసి ఇంగ్లీషు,  ఫిజిక్స్ అధ్యాపకులు తమ కొడుకును ఆ మహిమల వ్యక్తి దగ్గరికి తీసుకుపోవడం ఈ సమయంలో ప్రసాద్ అనే యువకుడు మహిమల బండారాన్ని బయట పెట్టడం ఈ కథ. 
    
' ఎస్ 2 ' , ' అమ్మవారి నవ్వు ' , విశిష్టమైన కథలు. మొదటిది బాబ్రీ మసీదు విధ్వంసానికి  ముందు, ఎలైట్ సెక్షన్లో నిగూఢంగా దాగిఉండే మతతత్వాన్ని బహిర్గతం చేస్తే,  రెండవది బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కూడా హిందూ ముస్లిం కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఐక్యతను ప్రదర్శించింది.
 
రచయితలు కళాకారులు పాత్రలుగా మనకు చాలా సాహిత్యం వచ్చింది.  కేతు విశ్వనాథ గారు సాహిత్య కథలు అనడానికి వీలైన చాలా కథలు రాశారు.  వైరుధ్యం (1973), మార్పు (1975), ప్రేమరూపం (1977), మన ప్రేమ కథలు (1977), బజారు (1985), ఎవరు వీరు (1986), తప్ప బుట్టిన వాళ్ళు (1994), ఒక జీవుడి ఆవేదన (1997) వంటివి ఆ కథలు. ఆ కథలలో కవులు, నవలా రచయితలు, కథారచయితలు పాత్రలుగా ఉంటారు. విమర్శకులు కూడా కనిపిస్తారు. మన ' ప్రేమ కథలు ' లో రచయిత పాఠకులను సవరిస్తాడు. ఎక్కువ కథలలో రచయితలే పాఠకులు, విమర్శకుల చేత ప్రభావితులైనట్లు విశ్వనాథరెడ్డి గారు రాశారు. అభ్యుదయ రచయిత సమాజాన్ని ఎంత గౌరవిస్తారో ఈ కథలు తెలియజేస్తాయి. ఉబుసుపోక ఆదర్శాలతో కథలు రాసే గోపాలం, తన పక్కింటి కేశవ రావు ద్వారా వాస్తవిక లోకంలోకి వస్తాడు  ' వైరుధ్యం ' కథలో.  చిన్నప్పుడు చదివిన పౌరాణిక జానపద కథలకు,  పెరిగి పెద్దైనాక అనుభవంలోకి వచ్చిన వాస్తవ  జీవితానికి గల వైరుధ్యాన్ని చిత్రించిన కథ 'మార్పు'. ఇలాగే ఈ కథలు సమాజం ద్వారా రచయితలను సంస్కరింపచేస్తాయి. రచయితలు సమాజాన్ని వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చెబుతాయి.
     
కేతు విశ్వనాథరెడ్డి గారు రాయలసీమ వారు. ఏ రచయిత అయినా తన ప్రాంతం గురించి రాయకుండా ఉండడం సాధ్యం కాదు. రాయలసీమ నిరాదరింపబడిన  ప్రాంతం. వర్గదృష్టితోనైతే పీడిత ప్రాంతం. అభ్యుదయ రచయిత పీడిత వర్గ పక్షపాతి. విశ్వనాథరెడ్డి గారు రాయలసీమ జీవిత పరిణామాలను, ముఖ్యంగా గ్రామీణ జీవితాలను, అక్కడి కరువు, కక్ష్యలను విస్తృతంగా తన కథలలో ప్రతిబింబించారు. వాన కురుస్తే (1971), జప్తు (1972), గడ్డి (1981), పొడి నిజం  (2003), విరూపం (2002)  వంటి కథలు రాయలసీమ కరువు అక్కడి ప్రజా జీవితం మీద చూపే ప్రభావాన్ని చిత్రించగా, సానుభూతి (1976), వెనకా ముందూ (1977), పీర్ల సావిడి (1980), కూలిన బురుజు (1988), స్వస్తి (1998), నిజం కాని ఒక్కనిజం కథ (1995) వంటి కథలలో రాయలసీమ  ఫ్యాక్షన్ సృష్టించే బీభత్సాన్ని చిత్రించారు. ఇలాంటివే కాక, చాలా కథలలో కరువు, కక్షలు ప్రస్తానకు వస్తాయి.

కరువు రాయలసీమ జీవితాన్ని వాన కోసం ఎదురు చూడడంగానే మారుస్తున్న వైనాన్ని ‘వాన కురిస్తే’ కథ వాస్తవికంగా చిత్రించింది. పాపయ్య అనే రైతు వంశం వాన కోసం నిరీక్షించడంలోనే  తరాల జీవితాలు  గడిపే కఠోర సత్యాన్ని ఈ కథలో చెప్పారు రచయిత. మంచి జీవితం రాయలసీమకు  ఒక కలగానే మిగిలిపోతున్న విషాదాన్ని రచయిత మానవీయ దృష్టి కోణం నుంచి వివేచించి వర్ణించారు. కరువు కాలంలో రాయలసీమ రైతు పట్ల రాజ్యం ఎంత మెకానికల్, హింసాత్మకంగా వ్యవహరిస్తుందో ' జప్తు ' కథలో చూడవచ్చు. ఆధిపత్యకులాలు అణగారినకులాలను కరువులోను ఎలా దోపిడీ చేస్తాయో కూడా ఈ కథ వివరిస్తుంది.  కరువులో పాలకులు పేదలకోసం సరఫరా చేసే గడ్డిని సైతం పెత్తందార్లు ఎలా మెక్కేస్తారో ‘గడ్డి’ కథ విమర్శనాత్మకంగా ఆవిష్కరించింది. కరువు కక్షలకు ఎలా దారితీస్తుందో కూడా ఈ కథ చెప్తుంది. పులివెందుల కాలువ వస్తువుగా రాయలసీమ కరువు రైతుల పాలిట రాచపుండుగ మారిన వైనం ‘పొడినిజం’ లో కనిపిస్తుంది. కరువు వల్ల అన్ని వర్గాల, కులాల ప్రజలు సిమెంటు ఫ్యాక్టరీ కూలీలుగా మార్పు చెందుతున్న తీరును ‘విరూపం’ కథ చెప్పగా ఆ కారణంగా రాయలసీమ మానవ సంబంధాలలో వస్తున్న వికృత పరిణామాలను ‘నమ్ముకున్న నేల’ కథ చిత్రించింది.

రాయలసీమలోని పది కుటుంబాలలో ఒకటే పచ్చగా ఉంటే, అది ఫాక్షన్ గొడవల్ని ఎలా  సృష్టిస్తుందో, ‘సానుభూతి’ కథ చెబుతుంది. వాన కోసం నిరీక్షించడంలోనే తరాలు గడిచిపోయినట్లుగా,  ఫ్యాక్షన్ గొడవల్లోనే తరాలు నశించి పోవడం ఈ కథలో చూడవచ్చు. ఆధిపత్య కులాల ఫ్యాక్షన్ గొడవల్ని చిత్రిస్తూ, రచయిత దళితుల జీవితాలవైపు చూడమని చిత్రించడం ప్రగతి శీల లక్షణం. రాయలసీమ ముఠా కక్షల మీద రాయలసీమ (వెంకటరెడ్డి) కోస్తా (కృష్ణారావు) అనే మిత్రుల మధ్య చర్చ సాగుతుంది 'వెనకా ముందూ' కథలో. ఫాక్షనిస్టులు శత్రుత్వం  నెరపుతూ, రాజకీయ అవసరాల కోసం ఏకంకావడం, వాళ్ల గొడవల్లో పేదలు ఇరుక్కొని చావడం గురించి 'పీర్ల సావిడి' కథ చెబుతుంది. సాంస్క్రతిక రంగాన్ని కూడా ఆధిపత్యవాదులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొనే దౌర్భ్యాగాన్ని కూడా ఈ కథ చూపిస్తుంది. రాయలసీమ ముఠా కక్షలు సృష్టించే విధ్వంసానికి 'కూలిన బురుజు' కథ  ఒక ఇతిహాసం.   మరాఠీ దండు రోజుల్లో కట్టించిన బురుజు ముఠాల గొడవల్లో కూలిపోయి, అక్కడ ప్రజల జీవితాలు కూడా కూలిన బురుజులాగా తయారైన తీరుకు ఆవేదనాత్మక ప్రతిబింబం ఈ కథ. ముఠా కక్షలలో రాజ్యం పోలీసుల రూపంలో ఖూనీ చేసినవాళ్లను కాకుండా, ఖూనీ అయినవాళ్లను వేధించడం చెప్పిన రచయిత "ఈ మాయ అర్థం కాలేదు" అంటారు. ఇలాగే ఆయన కథలన్నీ రాయలసీమ ముఠా కక్షలను అనేక ముఖాలనుండి ఆవిష్కరించాయి. విశ్వనాథరెడ్డి కరువు, కక్షలను వైభవీకరించలేదు, ఆర్ధీకరించారు. ఈ ముఠాల నాయకుల మీద మొట్టికాయలు వేశారు. ముఠా కక్షలతో నలిగిపోయేవాళ్ల వైపు నిలబడ్డారు.

మన సమాజంలో ఆర్థిక అసమానతలున్నాయని తాళ్లపాక అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి దేశీకవులు గుర్తించారు. ఆధునిక కాలంలో మార్క్సిజం అందుబాటులోకి వచ్చి, అభ్యుదయ సాహిత్యం మొదలైనాక అసమాన ఆర్థిక వ్యవస్థ మీద యుద్ధం మొదలైంది. ఆర్థిక అసమానత్వ నిర్మూలనోద్యమాలు పుట్టుకొచ్చాయి.  శ్రీశ్రీ 'వ్యత్యాసాలు' వంటి కవితలు వందల కొలది వచ్చాయి. అనేక నవలలు, కథలు, నాటకాలు ఆర్థిక అసమానతల్ని, వాటి దుష్పలితాలను ఆవిష్కరించాయి. అభ్యుదయ రచయితగా విశ్వనాథ రెడ్డి గారు చీకటి తప్పు (1963), దాపుడు కోక (1972), చెదరని గుండెలు (1972), సమిధ (1978), ఆస్ట్రే - అగ్గిపుల్లా (1978), ద్రోహం (1975), చీకటి నాడి - వెలుగు నెత్తురు (1979), దూరం (1979), సందా కబళం (1980), సొతంత్రం (1981), కాంక్ష (2001), రుచి (1993) వంటి అనేక కథలలో అసమాన ఆర్థిక సంబంధాల వికృత రూపాన్ని విమర్శనాత్మకంగా చిత్రించారు.

"డబ్బు ఈ దేశంలో ఈ సంఘంలో అన్నింటినీ శాసిస్తోంది" . అన్న వాస్తవాన్ని 'చీకటి తప్పు' కథలో ప్రతిపాదించారు విశ్వనాథరెడ్డి గారు. మధ్యతరగతి కుటుంబాలు వరకట్నంతో అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బటయపడలేని నికృష్ట స్థితి, అది కల్పించే దుమారం 'చీకటి తప్పు' కథలో ప్రతిబింబిస్తుంది. భాస్కరం వంటి ఆదర్శవంతులైన యువకులు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక, తల్లిదండ్రుల ఆర్థిక అవసరాల కోసం ఇష్టంలేని పెళ్లి చేసుకునే తలకిందుల వ్యవస్థను ఆర్థికాంశం నిర్ణయించిన విషాద ప్రతిఫలనం ఈ కథ. 

ఆర్థిక దారిద్ర్యం ఎంత అమానుషంగా ఉంటుందో 'దాపు ఈ కోక' కథ చదివి తెలుసుకోవచ్చు. వ్యవసాయ కూలి చెన్నమ్మ చాలా కష్టపడి కొనుక్కున్న 30.00 రూపాయల చీరను కట్టుకోకుండా, దాచిపెట్టుకొని, పుట్టింట్లో అందరికీ చూపెట్టాలని తీసుకుపోతుంటే, బస్సు ప్రయాణంలో ఆ చీర ఇద్దరు తాగుబోతుల చేతుల్లో పడి చినిగిపోతుంది. చెన్నమ్మ బాధ వర్ణనాతీతం. ఒక పేద శ్రామిక మహిళకు తాను కష్టపడి సంపాదించుకున్న వస్తువు మీద ఎంత మక్కువ ఉంటుందో రచయిత చాలా ఆర్ద్రంగా చిత్రించారు. 

అవసరాలు ఎక్కువ, ఆదాయం తక్కు ఉండే భార్యాభర్తల జీవితం ఎంత సంఘర్షణాత్మకంగా ఉంటుందో 'చెదిరిన గుండెలు' కథ ఆవిష్కరించింది . క్రింది మధ్య తరగతి జీవితాన్ని రచయిత 'మనలాంటి వాళ్లందరనీ విశ్వామిత్రుడు స్రుష్టించినట్లుంది. వాడొక భ్రష్టయోగి. మనమొక భ్రష్టవర్గం. త్రిశంకుకి వారసులం' అని వ్యాఖ్యానించాడు. ఏ అడ్డదారులూ తొక్కందే, ఏ గడ్డీ మెయ్యందే ఎవరూ ఉన్నట్టుండి ధనవంతులైపోరు. ఈ వాస్తవాన్ని చిత్రించిన కథ 'సమిధ'. మగవాడి ధనదాహ యజ్ణంలో స్త్రీ సమిధ అయిపోయిన కథ ఇది. ఈ కథలో అలా పైకి వచ్చిన శ్రీపతి తన కుమారునికి చేసిన హితబోధ. 'డబ్బు సంపాదించేవాళ్ల దృష్టి డబ్బు మీద తప్ప దేనీ మీదా వుండకూడదు. డబ్బు ముందు అన్ని విలువలూ దిగదుడుపే. ఆఫ్టరాల్ సెక్స్. సెక్స్ కన్నా జీవితంలో సాధించవలసింది డబ్బు. డబ్బు ముఖ్యం' అన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గమంతా ఈ బోధలో దాగి ఉంది.

సాంబయ్య ఆధిపత్యం కింద భార్య సాయమ్మ, మేనల్లుడు రాముడు క్రూరంగా అణచివేయబడ్డారు. సాంబయ్య మరణించాడు. ఆయన ఆస్తులన్నీ సాయమ్మ చేతికి వచ్చాయి. ఆమెను సాంబయ్య దగ్గర అప్పులు తీసుకున్నవాళ్లు తక్కువ అంచనా వేశారు. రాముడు కూడా ఆమె వల్ల తనకు సమస్య రాదనుకున్నాడు. భర్త దగ్గర క్రూరమైన హింసను అనుభవించిన సాయమ్మ భర్త మరణంతో అతని ఆస్తికి యజమానురాలైంది. ఆమె రాముడి పట్ల మరో సాంబయ్యగా తయారైంది. ఆ నేపథ్యంలో ఒక స్వాతంత్ర్య దినోతవ్సంనాడు రాముడు గొల్ల చినబ్బి ఇచ్చిన పొట్టేలు పిల్లను గట్టిగా పట్టుకొని వదిలిపెట్టాడు. అది పరుగెత్తి వెళ్లిపోయింది. రామునికి స్వతంత్రం అంటే ఏమిటో తెలిసింది. 'సాయమ్మ ఇంటికి చస్తే పోను' అనుకున్నాడు. ఇది 'సొతంత్రం' కథ. వ్యవస్థ మారకుండా పీడిత వర్గం చేతికి అధికారం వచ్చినా, వాళ్లలో కొందరైనా పీడకులుగా మారుతారని ఈ కథ ప్రతిపాదించింది. డబ్బు, సంపద కొందరి చేతుల్లో ఉండే సమాజం ఎంత వికృతంగా ఉంటుందో విశ్వనాథరెడ్డి గారు తన మార్క్సిస్టు దృక్పథంతో చిత్రించారు.

అభ్యుదయ రచయితకు సమాజాన్ని నియంత్రిస్తున్న లేదా నడిపిస్తున్న మూలస్తంభాలు లేదా వ్యవస్థల పరిజ్ణానం ఉండాలి. వాటిని నిర్మించిన చలనసూత్రాలు తెలియాలి. విశ్వనాథరెడ్డి గారికి ఈ జ్ణానం పుష్కలంగా ఉంది. చాలా కథలలో ఆయన సామాజిక పీడనలో రాజకీయ నాయకుల ప్రమేయాలను చిత్రించారు. వర్తమాన రాజకీయ వ్యవస్థ పెత్తందార్లకు అండగా నిలుస్తున్న వాస్తవాన్ని ఆయన చిత్రించారు. కార్యనిర్వహణ వ్యవస్థను ఆవరించి ఉన్న అనేక రుగ్మతలను విశ్వనాథ రెడ్డి గారు చాలా కథలలో విమర్శనాత్మకంగా చిత్రించారు. కార్యనిర్వహణ శాఖలోని అనేక విభాగాలు ఉండవలసినంత ఆరోగ్యకరంగా లేవని మనం గమనిస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తులు, ఆధిపత్యాలు, అణచివేతలు అన్ని విభాగాలలోకి చొచ్చుకురావండం చూస్తూనే ఉన్నాం. కేతు విశ్వనాథరెడ్డి గారు శాంతిభద్రతలను పరిరక్షించవలసిన పోలీసు శాఖలో ఆధిపత్యం, పెత్తనం చేయడం మీద అనధికారం (1978), ఆ రోజులే వస్తే (1979), సందా కబళం (1980), అంతర్ముఖం (1994) వంటి కథలు రాశారు. బలహీనులను పీడించే బలవంతులను నియంత్రించాల్సిన పోలీసు శాఖలో పై ఉద్యోగి కింది ఉద్యోగులను బానిసలుగా ఉపయోగించుకోవడాన్ని 'అనధికారం'  కథ చెబుతుంది. పోలీసు అధికారుల భార్యలు చేసే పెత్తనాన్ని ఈ కథ ఆవిష్కరించింది. అవినీతికి అలవాటు పడిన పోలీసు ఉద్యోగి రాయలసీమలో అరుదుగా ఒక ఫాక్షన్ రహిత గ్రామంలో తన ఆదాయం కోసం  సోమయ్య వంటి అమాయకులను కేసుల్లో ఇరికించే నిజాన్ని 'ఆ రోజలే వస్తే' కథ చెబుతుంది. ఫాక్షన్ ను అణచివేయాల్సిన పోలీసు ఫాక్షన్ లేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డ కథ ఇది. 'సందా కబళం' కథ కూడా పైస్థాయి పోలీసులు కింది స్థాయి పోలీసులను పీడించే దుర్మార్గాన్ని చిత్రించింది.

ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య అనుసంధానంగా ఉండేవి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు. అవి ఎంత స్వచ్ఛంగా ఉంటే, ప్రజలకు అంత మేలు జరుగుతుంది. అవి ఏ మాత్రం చెడిపోయినా ప్రజలు చాలా నష్టపోతారు. ఎక్కువ చెడిపోతే ఇక చెప్పనక్కరలేదు. 'దప్పిక' కథలో రెవెన్యూ శాఖను, 'వైరుధ్యం' కథలో పంచాయతీరాజ్ శాఖను విశ్వనాథరెడ్డి గారు మనకు ఫొటో తీసి చూపించారు. రెవెన్యూశాఖలో ఒక చిన్న ఉద్యోగిని తహసిల్దార్ కరప్ట్ చేసి చెడగొట్టిన తీరును 'దప్పిక' కథ ప్రతిబింబిస్తుంది. సంపాదించిన కొలదీ ఇంకా సంపాదించాలన్న తృష్ణ పెరిగిపోయి మనిషి ఎలా పతనమవుతాడో ఈ కథ చెబుతుంది. సంపద పెరిగే కొద్దీ సౌందర్యలాలసత్వం మనిషిని చుట్టుముట్టే తీరును కూడా ఈ కథ చెబుతుంది. అవినీతి సంపాదన పర్యవసనాన్ని ఈ కథలో శేఖర్ సూత్రీకరించాడు.  "కరెంటు, నీళ్లు, డబ్బు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఉండబట్టే గంగన్న కుటుంబం వీధుల్లో పడింది. మీ దెబ్బతో కొన్నాళ్లు పొతే చాలా కుటుంబాలు వీధిన పడతాయి". 'మాటల్తో పనులవుతాయండీ' అన్నది 'వైరుధ్యం' కథా సారం. డబ్బుతో జరుగుతాయి అని ధ్వని.  ఇది అవినీతి వ్యవస్థ.  పంచాయతీరాజ్ శాఖలో అవినీతిని ప్రతిబింబించే కథ ఇది. మూడు తరాలకు సరిపడా సంపాదించిన బిడిఓ దామోదరం కొడుకు మరణిస్తే విలవిలలాడిపోతాడు. అతని పీడనలో ఎంత మంది ప్రాణాలు పోయాయో అతను పట్టించుకోడు.  తన కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక వైరాగ్యంలోకి దిగుతాడు. ఆధ్యాత్మిక చర్చలు చేస్తాడు. అదంతా శ్మశాన వైరాగ్యమే. కొన్నాళ్లు గడిచాక కథ మొదటికొస్తుంది. "పెద్ద జీవాలు పెద్ద జీవాలే. చిన్న జీవాలు చిన్న జీవాలే" అన్నది అటవీశాఖ ఉద్యోగి కోటయ్య ఫిలాసఫీ. తాను చెడి, తన కొడుకునూ చెడగొట్టబోతే ఆ కొడుకు ఈశ్వరయ్య తిరగబడిన కథే ' పారువేట '. తండ్రి మురికి నుంచి ఈశ్వర్యయ్యను దూరంచేసింది విద్యార్థి దశలో అతని ఉద్యమానుభవం. విద్యావ్యవస్థలో ట్యూషన్ చెప్పే పాఠశాల అధ్యాపకుల అక్రమాలను బహిర్గతం చేసిన కథ  'చక్రబంధం'.  సాగర్ తండ్రి కేశవరావు జిల్లా అటవీశాఖాధికారి. తన కుమారుని విద్య సందర్భంగా విద్యావ్యవస్థ కూడా ఎలా పాడైపోయిందో గ్రహించాడు. "చదువూ ఉద్యోగమూ అన్నీ కలుషితమైన రోజులు అవి" అన్నది ఆయన అవగాహన. విద్యావ్యవస్థలోకి ప్రైవేట్ మేనేజ్ మెంట్లు, రాజకీయాలు ప్రవేశించి ఎలా భ్రష్టుపట్టించాయో 'పద్ధతి' కథ ప్రతిబింబిస్తుంది. 'చెడబారినదైన యవస్థ' అని తిక్కన వర్ణించినట్లు శిథిలమైపోతున్న ప్రజాస్వామ్య రంగాలను విశ్వనాథరెడ్డి గారు విమర్శనాత్మకంగా తన కథలలో ప్రతిబింబించారు.  

'ప్రపంచమంతా ఆ యిద్దరే' అని గుర్తించిన కేతు విశ్వనాథరెడ్డి గారు స్త్రీపక్షపాతి. స్త్రీని అభ్యుదయ రచయితలు పీడితులుగానే గుర్తించి, వాళ్ల పక్షాన మాట్లాడుతారు, రచనలు చేస్తారు.   కేతు విశ్వనాథరెడ్డి గారు పురుషస్వామ్య సమాజంలో స్త్రీలు ఎన్ని రకాలుగా హింసను, వివక్షను అనుభవిస్తున్నారో చాలా కథలలో చిత్రించారు. తారతమ్యం (1977), ప్రేమరూపం (1977), ముఖదర్శనం (1996), ఇచ్ఛాగ్ని (1995), రెక్కలు (1991) వంటివి విశ్వనాథరెడ్డి గారు రాసిన స్త్రీల కథలు. 

ప్రాచీన తెలుగు సాహిత్యంలో స్త్రీని గురించి అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే వితంతువును గురించి శ్రీనాథుడు అన్యాయమైన మాటలు అన్నాడు. వితంతువుగా మారిన స్త్రీ అశుచిత్వం ఎంత చేసినా పోదట. విధవ ఆశీర్వాదాలు తీసుకోవద్దన్నాడు.

" బైసిమాలిన పరమ నిర్భాగ్యురాలు
విధవ; దాని యాశీస్సును విషసమంబు "

అనడం ఎంత అన్యాయం. ఇప్పటికీ మన సమాజంలో వితంతువుల పట్ల ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. విశ్వనాథరెడ్డి గారు 'ముఖదర్శనం' కథలో వితంతు వ్యవస్థలోని అనుమాషత్వాన్ని చిత్రించారు. సావిత్రమ్మను వితంతువును చేసే కర్మకాండ చూసి ఆమె మనుమరాలు భార్గవి భయపడిపోయి జ్వరం వచ్చేసి, కలవరిచ్చేస్తుంది. తనను పెద్దైనాక అలా చేయకండని అందరినీ ప్రాధేయపడుతుంది. ఏ కారణం చేతనైనా భర్త చనిపోతే, ఆ భార్య ఒంటరిగా బతకలేక అనివార్యంగా మరో మగాడి ఆసరాలో బతకాల్సిన స్థితిని 'ప్రేమరూపం' లో చిత్రించారు. ఈ కథలో అచ్చమ్మ జీవితానుభవం మన సామాజికస్థితిని వ్యాఖ్యానిస్తుంది. అచ్చమ్మకు వీరారెడ్డి మీద ప్రేమ ఉందా అని అడిగిన కుర్రాడితో ఆమె "అదేందో నాకు తెలియదు నాయనా! పెద్దోళ్లు చేస్తే మొదటి మనువయింది. దిక్కు లేక రెండోసారి దారి తోడయింది. యివన్నీ యింత తిండికీ, బట్టకూ, మగ మనిషి చాటు కోసమే కదా! అదేందీ ఆ ప్రేమలేం సేసుకుంటాము? వాటిని కొరుక్కు తిని బతకలేం కదా?" అంటుంది. జీవితాన్ని కాచివడగట్టి ఆమె అన్న మాటలివి.

'తారతమ్యం' కథ విశ్వనాథరెడ్డి గారు కథలలో విశేషమైనది. స్త్రీపురుష సంబంధాలలో, కుటుంబ ప్రేమల్లో ఆర్థికసూత్రం ఎలా దాగి ఉంటుందో ఈ కథ చెబుతుంది. గౌరీరామక్రిష్ణలు భార్యాభర్తలు. గౌరి తమ్మునికి, చెల్లెలికి పెళ్ళిళ్ళు కుదురుతాయి. వాళ్లకు పెళ్లికానుకలు ఇవ్వాలి. గౌరి తమ్మునికి ఉంగరం చదివించాలంటుంది. చెల్లెలిది పేద సంబంధం గనుక ఏమీ చదివించనక్కరలేదంటుంది. తమ్ముడు పెళ్లి కాగానే వాడు అక్కను ఏమీ గౌరవించడు. వాడికి ఉంగరం పెడితే వాడు ఇంకా ఎక్కువ తనకు కొనిస్తాడని ఆమె ఆశించింది. వాడి దగ్గర  కథ అడ్డం తిరిగింది. "కొడుకులు కొడుకులే. కూతుర్లు కూతుర్లే" అని మొదట దబాయించిన గౌరి,  చివరికి "అందరికీ లోకువే ఆడదంటే" అనే స్థితికి వచ్చింది. స్త్రీపురుషుల సంపాదనల వల్ల ఏర్పడే వైరుధ్యాలను 'నిప్పు - నివురు' (1994) కథలోనూ, వ్యాపారంలో మోసపోయి ఇంటిని అమ్మకానికి పెట్టిన భర్త మీద తిరుగుబాటు చేసిన భార్యను 'సతి' కథలోనూ, రెండు తరాల స్త్రీల జీవితాలను, కులాంతర వివాహాల పర్యవసానాలను 'ఇచ్ఛాగ్ని' కథలోను చిత్రించారు.   

రాయలసీమలో కడప జిల్లాలోనే ఎన్నో కొన్ని పరిశ్రమలు ఉండేది. పరిశ్రమలలో కార్మికుల జీవితాలను, పరిశ్రమలు మానవసంబంధాలలో తీసుకొచ్చిన మార్పులను కేతు విశ్వనాథ రెడ్డి గారు కొన్ని కథలలో చిత్రించారు 'శ్రుతి' (1984) కడప జిల్లాలో సిమెంటు పరిశ్రమ వచ్చినాక రైతులు ఫ్యాక్టరీ వర్కర్లుగా మారిపోవడం, కార్మికులలో కుల మత ప్రాంతీయాభిమానాలు రావడం, వాటిని ఉపయోగించుకొని యాజమాన్యం కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయబోవడం, కార్మికులు తమ వైరుధ్యాలను పక్కనబెట్టి ఐక్యత ప్రకటించడం ఈ కథలో వస్తువు. ప్రకాశం తెలుగువాడు. తెనాలివాసి. దళిత క్రైస్తవుడు. దేశ్ పాండే మరాఠీవాడు. బ్రాహ్మణుడు. సేతు మాధవన్ తమిళుడు. అబ్దుల్లా ముస్లిం. జమ్మువాసి. ఈ పాత్రల ఆధారంగా ఈ కథ ప్రాంత, మత, కుల, భాషావైరుధ్యాలను చిత్రిస్తూనే కార్మిక ఐక్యతను చాటింది.

'నమ్మకున్న నేల' విశ్వనాథరెడ్డి గారి కథల్లో ఐతిహాసిక కథ. రైతులు వ్యవసాయం జరక్క పొలాలను వ్యాపారులకు అమ్ముకోవడం, వ్యాపారులలో నైతికత లోపించడం,  రైతులు వ్యసాయం జరగక భోగం కంపెనీలకు నీల్లు మోసి బతకడం - వంటి వస్తువులను ఈ కథ ఆవిష్కరించింది. 

'శిలువ వేసిన మనుషులు' విశ్వనాథరెడ్డి దళితుల పక్షం వహించి రాసిన కథ. మన సమాజంలో వేళ్లూనికొని కుటుంబాలను ఆర్థికంగా దివాలా తీయిస్తున్న మట్కా ఆట మీద విశ్వనాథరెడ్డి గారు 'విశ్వరూపం' (1978) కథ రాశారు. ఆ ఆటలో యువత కూరుకుపోవడం పట్ల ఆవేదనతో ఆ కథ రాశారు.

కేతు విశ్వనాథరెడ్డి గారు కథానికలతో పాటు రెండు నవలికలు కూడా రాశారు. అవి 1. బోధి (1978), 2. వేర్లు (1984). 'బోధి'లో వెంకట్రాముడు యాంత్రపాలజీలో,  చెన్నకేశవ ఎకనమిక్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్లు. ఇద్దరూ శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు. ఈ యిద్దరూ రాయలసీమ గ్రామీణ యువకులు. వెంకట్రాముడు దళితుడు. చెన్నకేశవది వ్యవసాయ కుటుంబం.  ఆధునిక విద్య, ఉన్నత విద్య అభ్యసించిన ఈయిద్దరూ కులవృత్తికి, వ్యవసాయానికి దూరమైనారు. అంతేకాదు తమ మనుషులకు కూడా దూరమైనారు. ఇద్దరూ నిరుద్యోగులే. ఉద్యోగాన్వేషణలో ఉంటారు. ఇంత వరకు ఈ యిద్దరి జీవితాలలో సామ్యం. ఆ తర్వాత వెంకట్రాముడిది దళిత విద్యావంతులలోనే పోటీ జీవితం అవుతుంది. చెన్నకేశవ కథ స్త్రీపురుష సంబంధాల కథగా పరిణమిస్తుంది. 

వలసవాద విద్యావ్యవస్థ ప్రవేశపెట్టిన ఉపాధిలో పోటీ అనే దానినే భారతీయ పాలకులు స్వతంత్రానంతరం కూడా కొనసాగించారు. ఈ పద్ధతి స్వతంత్రానంతరం కొంతకాలం బాగానే కొనసాగింది. 1970ల నుంచి పరిస్థితి మారింది. నిరుద్యోగ సమస్య ముదిరింది. క్రమంగా పాలకులు ప్రైవేటీకరణను పెంచిపోషించడంతో ఇది మరీ బలిసిపోయింది. మొదట్లో దళితులలో చదువుకున్నవాళ్లు పరిమిత సంఖ్యలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కొంచెం సులభంగానే దొరికాయి, రిజర్వేషన్ వ్యవస్థ వల్ల. దళితులు ఎక్కువగా చదువుకొని ఉద్యోగాలలోకి రావడానికి ప్రయత్నంచినప్పుడు పోటీ పెరిగింది. అక్కడ కూడా బలవంతులదే రాజ్యమైంది. ఈ వాస్తవాన్నే 'బోధి' నవలిక ఆవిష్కరించింది. 

వెంకట్రాముడు చదివిన చదువు అతనిని తన జాతి, వృత్తి, ఆహారాల పట్ల విముఖుణ్ణి చేసింది. అతను చదువుకున్నాక తన అన్నలాగా ముగ్గురాళ్ల పనిలోకి పోలేడు. తమ్ముళ్లలాగా రైతుల ఇళ్లలో పనిచేయలేడు. పశువుల్ని మేపలేడు. తల్లీచెల్లెళ్లలాగా ముగ్గురాళ్ల గ్రౌండింగ్ కు పోలేడు.  గొడ్డు మాంసం కోసం చిన్నప్పటిలాగ ఎగడబడడం లేదు. ఆ రకంగా ఆయన తన జాతి దృష్టిలో చులకన అయ్యాడు. ఆ తిండి కోసం ఎగబడే తన తమ్ముణ్ని దబాయిస్తాడు. దళితుల మురికిని అసహ్యించుకుంటాడు. "ఇన్నేళ్లుగా అలవాటయిన మనుషులు తనకెందుకు తలకిందులుగా కనిపిస్తున్నారో, వాళ్ల మాటలు తనకెందుకు రోతగా ఉన్నాయో వెంకట్రామునికి ఎంత ఆలోచించినా అర్ణం కాలేదు' అంటాడు రచయిత. 

ఈ స్థితిలో వెంకట్రామునికి ప్రత్యామ్నాయం ఉద్యోగమే. ఉద్యోగాన్వేషణలో వెంకట్రామునికి దేవదాసు అనే మిత్రుని చేయూత దొరికింది. అతని ద్వారా వెంకట్రాముడు కులనిర్మూలన సంఘంలో చేరుతాడు. కార్యవర్గ సభ్యుడవుతాడు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్లాడు. డిఆర్ఓ ఓబయ్య అనే దళిత అధికారి సహాయం కోరుతాడు. ఆయన తన ముందే దళితులను అవమానకరంగా మాట్లాడడం చూశాడు. వెంకట్రామునికి ఊళ్లో రైతులకు, బయట ఉద్యోగులకు తేడా కనిపించలేదు. తాను ఉద్యోగం ప్రస్తావన తెస్తే ఓబయ్య ప్రతిభను గురించి మాట్లాడుతాడు. ఎందరిని కలిసి అభ్యర్థించినా వెంకట్రామునికి నిరాశే మిగిలింది. ఆఖరికి కులాంతర వివాహం చేసుకున్న వాసు చెల్లెలు, వెంకట్రాముని క్లాస్ మేట్ చంద్రావతి కూడా వర్గదృష్టిని ప్రదర్శించింది.  వెంకట్రాముని అనుభవాలు సంప్రదాయ గ్రామాలకు, ఆధునిక పట్టణాలకు మధ్య భేదాన్ని అభావం చేసేసింది. ఇదంతా ఆలోచించి వెంకట్రామునికి తన వేర్లు వర్గ వ్యవస్థలో ఉన్నట్లు అర్థమైంది. రిజర్వేషన్ సౌకర్యాల సాధనలోనూ, కులనిర్మూలన వాదుల్లోనూ వర్గం ఉందని గుర్తు చేస్తూ వర్గరహిత సమాజ నిర్మాణం వైపు పాఠకుల ఆలోచనలను మళ్లిస్తుంది ఈ నవలిక. వెంకట్రాముని చదువు నేర్పని చదువును ఆయన జీవితానుభవం నేర్పింది. 

'బోధి' లో స్త్రీపురుషులసంబంధాలు, వాటిలో ప్రేమకు సంబంధించిన జ్ణానమే ' బోధి '. ఉద్యోగం లేకపోయినా కట్నం కోసం కొడుక్కి పెళ్లి చెయ్యాలని చెన్నకేశవ తండ్రి ప్రయత్నిస్తాడు. చెన్నకేశవ తండ్రి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ హైదరాబాదుకు వెళ్లి పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరిపోతాడు. ఆయనకు రాధ, రాణి, ప్రసూన అనే ముగ్గురు అమ్మాయిలు పరిచయమవుతారు. రాధ తన ఊరి అమ్మాయే. పేదింటి అమ్మాయి. తన కులం కాకపోయినా, పల్లెటూళ్ల వ్యవసాయ కులాల మధ్య వరుసలలో అతనికి చెల్లెలు అవుతుంది. అయినా రాధ పట్ల అతను ఆకర్షితుడై, ఒక రోజు ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. అది కేవలం ఆకర్షణతోనే గాని, ప్రేమతో కాదు అని అతనికి తెలుసు. ఇది జరిగింది తన గ్రామంలోనే. ఈ పని చేయడానికి రాధ అందం, తన తొందరపాటు ఒక కారణమైతే, ఇతన్ని ఉద్రేకరపరిచే  స్నేహితుని ఉత్తరం మరో కారణం. "మనసు బాగుండడం లేదని ఏడుస్తున్నావా? మీ ఊళ్లో ఒక ఆడపిల్లకు కడుపు చెయ్యి" అన్న మిత్రుని ప్రోత్సాహం చెన్నకేశవను ఉద్రేకపరిచింది. ఈ సంఘటన ద్వారా యవ్వనోద్రేకంలోంచి, స్త్రీల పట్ల కేవలం ఆకర్షణలోంచి ఏర్పడే స్త్రీపురుష సంబంధాలు సంస్కారవంతంగా ఉండవు అని సూచించాడు రచయిత. 

రాణి చెన్నకేశవకు బిఎలో సహవిద్యార్థిని. ఆమె బోళామనిషి. నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటారు.  అనేక మంది ఆడవాళ్లతతో ఒక మొగవాడు సంబంధం పెట్టుకుంటున్నప్పుడు, ఒక స్త్రీ అనేక మంది మగవాళ్లతో సంబంధం పెట్టుకోకూడదా? అని ఆమె ప్రశ్నిస్తుంది. ఆమె ఒక రోజు చెన్నకేశవను తన గదికి పిలుచుకుని పోయి, అతను ఉండగానే బట్టలు మార్చుకుంటుంది. రాధ విషయంలో లాగా, రాణి విషయంలో చెన్నకేశవ తొందరపడలేదు. 'నిజమైన ప్రమలేకుండా స్త్రీని తాకరాదు' అనే ఎరుక ఉండడమే కారణం.

రాణి అతనికి ప్రసూనను పరిచయం చేసింది. ప్రసూన అభిప్రాయాలు, ఆమె ప్రవర్తన చెన్నకేశవకు నచ్చాయి. ఆమెకు కూడా చెన్నకేశవ నచ్చాడు. ఆమె తల్లిదండ్రులకు కూడా నచ్చాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నవలికలో భూస్వామ్య, అరాచక స్త్రీపురుషసంబంధాలను తిరస్కరించి ఇద్దరి ఆలోచనలు, ఆచరణలు నచ్చినవే ఉత్తమ స్త్రీపురుష సంబంధాలని రచయిత ప్రతిపాదించారు. స్త్రీపురుష సంబంధాలలో ఆపేక్ష అపరిహార్యమైనా, ప్రేమ పునాది కావాలన్నిది రచయిత అభిప్రాయం. 

అభ్యుదయ రచయిత అయిన కేతు విశ్వనాథరెడ్డి గారు సామాజిక సంబంధాలను, స్త్రీపురుష సంబంధాలను మొత్తంగా సామాజిక వ్యవస్థను శాస్త్రీయ పద్ధతిలో అర్థం చేసుకొని, విమర్శనాత్మక వాస్తవికవాద మార్గంలో రచనలు చేసి తెలుగు అభ్యుదయ సాహిత్యాభివృద్ధికి దోహదం చేశారు. ఆయన సాహిత్యం పాఠకుల సంస్కారాన్ని విశాలం చేస్తుంది. తిరోగమనవాదులను కూడా అది మారుస్తుంది.  ఆధునికులను మరింత ఆధునికులను చేస్తుంది. ఆయన తన సాహిత్యంలో ప్రస్తావించిన అనేక రుగ్మతలు  ఇంకా మన సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి.  అందువల్ల కేతు విశ్వనాథరెడ్డి గారు తన సాహిత్యంలో చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలు కాలం చెల్లినవి కావు. అవి నేటికీ ప్రాసంగికత కలిగి ఉన్నాయి.

'నేను మౌలికంగా వాస్తవికవాదినే' - కేతు విశ్వనాథరెడ్డి

- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios