ప్రొ. లక్ష్మీనారాయణ కవిత : చరిత్ర
యుద్ధాలు లేని శాంతి సమత మహోదయం కోసం చరిత్ర తనను తాను నిరంతరం నిర్మించుకుంటుంది అంటూ ప్రొ. లక్ష్మీనారాయణ రాసిన కవిత ' చరిత్ర ' ఇక్కడ చదవండి :
చరిత్ర ఎంత ప్రాచీనమైనదో ఎవరికి తెలుసు
అది అత్యంత సనాతనమైన భూగోళానికి తోబుట్టువు కాబోలు
అందుకే అపార సహనం
అసమాన సాహసం
చరిత్రది ఒక వీర విషాద గాధ
నాటి ఆకులు అలములు తిన్న ఆదివాసీలు తనవారే
నేటి గ్రహాంతర సీమల రహస్యాలు ఛేదించే
ఆధునికులు కూడా తన వారే
ఎందరో బానిసల కన్నీటి గాధలను కడుపులో దాచుకుంది
కఠిన శిలలతో కోటల బురుజులు నిర్మించిన
కష్టజీవులు తనకు కావలసిన వారే
దురహంకార నియంతలు చీకటి చెరసాలలో బంధించినపుడు
కొరడా దెబ్బలకు తాళలేక విలవిలలాడి నేలకు వాలింది
యుద్ధోన్మాదులతో భూమి దద్దరిల్లినపుడు
తన శరీరం రక్తసిక్త శకలాలుగ చెల్లాచెదురై
ఆసువులు బాసిన ఎందరో సైనికులను
వేలకు వేల మంది విధవలను
అనాధలైన పసి పిల్లల్ని చూసి
కట్టలు తెంచుకున్న కన్నీళ్ళు ఏరులైపారేలా ఏడ్చింది
ఎందరో దీనుల్ని ఒడిలోనికి చేర్చుకుంది
అయినా తనది అపురూప చైతన్యం
అగ్ని పర్వతాల ఆక్రోశం
రెండు ప్రపంచ మహా సంగ్రామాలలో
ప్రతీఘాత శక్తులతో సమతా స్వేచ్ఛా సమరం సాగించింది
ఖండ ఖండాంతరాలలో పరాయి పాలనను కూల్చి వేసింది
భారతావనిలో స్వాతంత్య్ర సూర్య జ్యోతిని వెలిగించింది
చరిత్ర ఒంటిలో నేటికి కనిపించని తూటాలు ఉన్నాయి
అసమానత అత్యాచారాల గాయాల సలపరం ఉంది
యుద్ధాలు లేని శాంతి సమత మహోదయం కోసం
చరిత్ర తనను తాను నిరంతరం నిర్మించుకుంటుంది
ఆదర్శాల అనంత గమ్యాల వైపు
క్షణం క్షణం ముందుకు సాగిపోతుంది.