ప్రమోద్ ఆవంచ కవిత : ఊపిరిలో ఆవిరయ్యే జ్ఞాపకం..

మనసెప్పుడూ అర్ధం కాని విషయం - మన చుట్టూ అల్లుకునే ప్రశ్నార్థకం అంటూ ప్రమోద్ ఆవంచ రాసిన కవిత ' ఊపిరిలో ఆవిరయ్యే జ్ఞాపకం.....' ఇక్కడ చదవండి

pramod avancha poem oppirilo aavirayye jnapakam ksp

గుండెల్ని కోసుకుంటూ విరహ తంత్రులను 
మీటుతుందో  జ్ఞాపకం 
తపించే మనసుకెప్పుడూ రంపపు కోతలే 

లేత ఆకుల రెపరెపలు
వసంత మోహాలై 
మనసును తీపి గాయం చేసాయి 

చిగురు తొడిగిన మొగ్గ లేత పచ్చని ప్రేమ 
కథలను రాసుకుంటుంటుంటే 
అంతు చిక్కని అందాన్ని అడవంతా 
కళ్ళప్పగించి చూస్తుంది

రాత్రంతా జాబిలమ్మ చెంత స్నానమాడి
వేకువ వెలుగులో వళ్ళు విరుచుకుంది ఆకాశం 
కళ్ళల్లో మత్తును రెప్పల కింద దాచింది 
తెలిసినదేదో తెలియని మైకం 
మనసును మాయలా తాకింది 
అర్థం అయ్యీ కాక గుండె విలవిల....
మనసెప్పుడూ అర్ధం కాని విషయం
మన చుట్టూ అల్లుకునే ప్రశ్నార్థకం 

ప్రతి క్షణం ఏదో ఒక జ్ఞాపకం 
ఊపిరిలో ఆవిరవుతూనే ఉంది 
క్షణం సేపు కాలం ఆగిపోయి 
మేఘం వర్షించింది
మనసుకూ కళ్ళున్నాయి 
అవి బాధతో కన్నీళ్ళను కురిపిస్తున్నాయి
ఒక ప్రవాహం ప్రేమ లోతుల్లోకి
ఒక ప్రయాణం నిశీధిల్లోకి....
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios